ఈశాన్య భారత్‌లోని త్రిపురలో ఈసారి విజయం ఎవరిది. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు అనేది ఉత్కంఠను రేపుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి టఫ్ ఫైట్ నడించింది. త్రిపుర ప్రజలు ఎప్పుడూ ఒకే పార్టీ వైపు మొగ్గుచూపుతూ ఉంటారు. కానీ మొదటిసారి అక్కడ హంగ్ ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకప్పుడు త్రిపుర కామ్రేడ్స్‌కు కంచుకోట. అలాంటి కోటను గత ఎన్నికల్లో కమలం పార్టీ బద్దలు కొట్టింది. మూడు దశాబ్దాలకు పైగా త్రిపురను పాలించిన సీపీఎం ప్రస్థానానికి అడ్డుకట్టవేస్తూ 2018లో బీజేపీ అనూహ్య విజయాన్ని దక్కించుకొంది. ఇప్పుడు మళ్లీ అదే విజయాన్ని పునరావృతం చేయాలనే లక్ష్యంతో ప్రచారం నిర్వహించింది. మరోవైపు త్రిపురలో పూర్వవైభవం సాధించాలని భావిస్తోన్న సీపీఎం దశాబ్దాల వైరాన్ని పక్కనబెట్టి కాంగ్రెస్‌తో చేతులు కలిపింది.
దేశ వ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో సత్తా చాటుకుంటూ అధికారాన్ని దక్కించుకుంటున్న బీజేపీకి త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారాయి. ఇక్కడ బీజేపీ ఐపీఎఫ్‌టీతో పొత్తుపెట్టుకుంటే కాంగ్రెస్ వామపక్షాల కూటమి ఎన్నికల బరిలో నిలిచాయి. బీజేపీకి ఇక్కడ విపక్షాల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. మొత్తం 60స్థానాలకు గానూ బీజేపీ 55సీట్లలో పోటీ చేస్తుండగా ఐపీఎఫ్‌టీ ఐదు చోట్ల అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఇక వామపక్ష కూటమిలో సీపీఎం 47సీట్లలో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ కేవలం 13 స్థానాల్లో తమ అభ్యర్ధుల్ని నిలబెట్టింది. ఈసారి పోటీలో రాజవంశానికి చెందిన తిప్ర మోత అధికార విపక్షాలకు కంట్లో నలుసుగా మారారు. 42మందిని పోటీకి దింపారు. తృణమూల్ కాంగ్రెస్ 28 ఇండిపెండెంట్ అభ్యర్ధులు 42మంది పోటీ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో త్రిపుర అసెంబ్లీలో 36 సీట్లు కైవసం చేసుకుంది బీజేపీ. కమలం పార్టీ సొంతంగా సాధారణ మెజారిటీని సాధించిన ఏకైక ఈశాన్య రాష్ట్రం త్రిపుర. మరి అటువంటి త్రిపురలో ఈసారి త్రిముఖ పోరు నడుస్తుండడంతో గెలుపుని ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. గత ఐదేళ్ల పాలనలో బీజేపీ కొంత ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ప్రతిపక్షాల ఐక్యత బీజేపీని పరేషాన్ చేస్తోంది. దీనికి తోడు కొత్తగా ఆవిర్భవించిన ట్రైబల్ పార్టీ తిప్ర మోత కూడా రోజు రోజుకి ప్రజల ఆదరణ పొందడం కాషాయ నేతల్లో గుబులు పుట్టిస్తోంది. ముఖ్యమంత్రిగా బిప్లబ్ దేవ్ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 10 నెలల ముందు ఆయనను పదవినుంచి తొలగించింది. ఆయన స్థానంలో మాణిక్ సాహా ను ముఖ్యమంత్రిగా నియమించింది. గుజరాత్ లో ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మార్చి లభ్ధి పొందినట్లు త్రిపురలో కూడా తమకు లాభం చేకూరుతుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
త్రిపురలో వామపక్షాలు అధికారంలో ఉన్నప్పడు కేవలం పార్టీ కేడర్ వారి విధేయుల సంక్షేమానికే ఎక్కువ మొగ్గు చూపిందన్న ఆరోపణలను ఎదుర్కొంది. అందుకే సీపీఐ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు. కానీ ఈసారి తన పాత విధానాలను మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్ధుల్లో 50 శాతానికి పైగా కొత్తవారే. మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. గత ఎన్నికల్లో 16 సీట్లకు పరిమితమైన సీపీఎం ప్రస్తుతం అధికారంపై భారీ ఆశలు పెట్టుకుంది. ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్‌తో పొత్తు తమకు లాభిస్తుందని ఆ పార్టీ అంచనా వేస్తోంది. అయితే బెంగాలీల ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో ఇతర పార్టీల ఓట్లకు టీఎంసీ గండి కొట్టే అవకాశం ఉంది. అది సీపీఎం-కాంగ్రెస్‌లను ఆందోళనకు గురిచేస్తోంది. టీఎంసీ ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఆ వ్యతిరేక ఓట్ల చీలిక తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ భావిస్తుంది.