తెలంగాణా కాంగ్రెస్ లో ఆరని మంటలు

By KTV Telugu On 17 February, 2023
image

కోమటి రెడ్డి వ్యాఖ్యలు తెలంగాణా కాంగ్రెస్ లో కాక రేపుతూనే ఉన్నాయి. నేనలా అనలేదు బాబోయ్ అని ఆయన వివరణ ఇచ్చుకున్నా ఆయన మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఆయనపై చర్యలు తీసుకోవలసిందేనని రేవంత్ వర్గం నేతలు పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణాలో ఏ పార్టీకీ మెజారిటీ రాదని వ్యాఖ్యలు చేసి తెలంగాణా కాంగ్రెస్ లో ముసలం రేపిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి తాను తొక్కిన అడుసు కడుక్కునే పనిలో బిజీగా ఉన్నారు. కాకపోతే అది ఓ పట్టాన వదలడం లేదు. కోమటిరెడ్డి వ్యాఖ్యలు బిజెపి, బి.ఆర్.ఎస్. లకు ఆయుధాలుగా మారగా కాంగ్రెస్ మాత్రం ఆత్మరక్షణలో పడిపోయింది. దీనిపై రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే నిజా నిజాలు తెలుసుకుని కోమటి రెడ్డిని ఆరా తీశారు. ఠాక్రేతో భేటీ అయిన కోమటి రెడ్డి తాను హంగ్ వస్తుందని అనలేదని ఓ సర్వే చెప్పిందాన్ని మాత్రమే తాను చెబితే మీడియా వక్రీకరించిందని వివరణ ఇచ్చారట.

అయితే ఎన్నికల తర్వాత బి.ఇర్.ఎస్. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటుందని ఎందుకు అనాల్సి వచ్చిందంటూ ఠాక్రే నిలదీసేసరికి కోమటిరెడ్డి దగ్గర సమాధానం లేదంటున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతంలోనే బి.ఆర్.ఎస్. తో ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తు ఉండదని స్పష్టం చేసిన తర్వాత కూడా సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి బి.ఆర్.ఎస్. తో పొత్తు ఉంటుందని వ్యాఖ్యానించడం క్రమశిక్షణారాహిత్యమే అంటున్నారు ఆయన ప్రత్యర్ధులు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు విరుద్ధంగా బి.ఆర్.ఎస్.తోనో మరో పార్టీతోనో పొత్తు ఉంటుందని వ్యాఖ్యానిస్తే మాత్రం వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఠాక్రేతో భేటీ అయిన సందర్భంలో కోమటిరెడ్డి తాను టిడిపితో పొత్తు వద్దని చాలా గట్టిగా చెప్పానన్నారు. 2018 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఓడిపోవలసివచ్చిందని కోమటిరెడ్డి ఆరోపించారు. అటువంటి పార్టీతో పొత్తుకు పార్టీలో కొందరు ప్రయత్నిస్తే మరోసారి పార్టీకి భంగపాటు తప్పదని కోమటి రెడ్డి అంటున్నారు. కోమటి రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యం లేకపోలేదు.

తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒకప్పుడు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడకు కుడిభుజం. ఇప్పటికీ చంద్రబాబుకు రేవంత్ నమ్మకస్తుడే. రేవంత్ ను అడ్డుపెట్టుకునే చంద్రబాబు తెలంగాణా కాంగ్రెస్ లో టి టిడిపి నేతలను చేర్పించారని కాంగ్రెస్ సీనియర్లంతా భావిస్తున్నారు. వారికే మొన్న పదవుల్లో ప్రాధాన్యతనిచ్చారని కూడా వారు భావిస్తున్నారు. ఇటీవల ఖమ్మంలో టిడిపి సభ పెట్టిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. అయితే చంద్రబాబు పేరు చెబితేనే బిజెపి అగ్రనేతలు మొహాలు తిప్పేసుకుంటున్నారు. ఒక వేళ బిజెపి పొత్తుకు ససేమిరా అంటే కాంగ్రెస్ తో అయినా జట్టు కట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్లు అనుమానిస్తున్నారు. అదే జరిగితే రేవంత్ రెడ్డి ద్వారా కాంగ్రెస్ తో చెట్టాపట్టాలేసుకు తిరగడానికి చంద్రబాబు ప్రయత్నిస్తారని కోమటిరెడ్డి అనుమానిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే టిడిపితో పొత్తు వద్దని ఆయన అంటున్నారు. అయితే పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలతోనే సన్నిహిత సంబంధాలున్న చంద్రబాబు అంతగా అవసరమైతే హై కమాండ్ నుంచే చెప్పించుకుని కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవచ్చని కాంగ్రెస్ లో మరో వర్గం వాదిస్తోంది.