బీజేపీకి విరాళాల వెల్లువ‌.. అధికారంలో ఉంటే అంతే!

By KTV Telugu On 17 February, 2023
image

చెప్పేటందుకే నీతులు. త‌మ‌దాకా వ‌స్తే అన్నీ ప‌క్క‌న‌పెడ‌తారు ఈ కాల‌పు నేత‌లు. పార్టీల‌న్నాక రాజ‌కీయం చేయాలి. రాజ‌కీయం చేయ‌డానికి కాసులుండాలి. ఆ కాసులు జేబుల్లోంచి పెట్టుకోరుగా. ఎవ‌రో ఒక‌ర్ని బాదేస్తారు. వాటికి విరాళాల‌ని అంద‌మైన పేరు పెట్టేస్తారు. నేష‌న‌ల్ హెరాల్డ్ విష‌యంలో మ‌నీ ల్యాండ‌రింగ్ జ‌రిగిందని సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల‌ను కూడా విచారించారు. ఎక్క‌డినుంచో నిధులొస్తున్నాయ‌ని దేశ‌వ్యాప్తంగా ఆ పార్టీనేత‌ల‌ను విచారించారు. మ‌రి రాజ‌కీయ‌పార్టీల‌కు విరాళాల విష‌యంలో బీజేపీ ఆ విలువ‌లు పాటిస్తుందా అంటే ఆ పార్టీనే ఆత్మప‌రిశీల‌న చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ముచ్చ‌ట‌గా మూడోసారి అధికారంలోకి రావాల‌నుకుంటున్న బీజేపీకి పైసామే ప‌ర‌మాత్మా హై అన్న విష‌యం అంద‌రికంటే బాగా తెలుసు.

బీజేపీ అనే కాదు ఆ మాట‌కొస్తే ఏ పార్టీకైనా మ‌నుగ‌డ సాగించాలంటే నిధులు ఉండాలి. విరాళాల రూపంలోనే ఫండ్స్ స‌మ‌కూరాలి. ప్ర‌జ‌లైతే తృణ‌మో ఫ‌ణ‌మో ఇవ్వ‌గ‌లుగుతారు. అదే కార్పొరేట్ల‌యితే త‌మ స్థాయికి త‌గ్గ‌ట్లు ఘ‌నంగా స‌మ‌ర్పించుకుంటారు. అందులో అధికారంలో ఉన్న పార్టీకి పోటీలుప‌డి మొక్కులు చెల్లించుకుంటారు. ఎందుకంటే వాళ్లు ఎద‌గాలంటే అధికారంలో ఉన్న పెద్ద‌ల స‌హ‌కారం కావాలి. స‌హ‌కారం లేక‌పోయినా ఎలాంటి ఆటంకాలు క‌ల్పించ‌కుండా చూసుకోవాలి. అందుకే అడ‌క్కుండానే వంద‌ల‌కోట్లు విరాళాలు ఇచ్చేస్తుంటారు. 2021-22 సంవ‌త్స‌రానికి విరాళాల విష‌యంలో టాప్ ర్యాంకులో ఉంది బీజేపీ. ఏకంగా ఆ పార్టీకి రూ.614 కోట్ల విరాళాలు వ‌చ్చాయి. అన్ని పార్టీల‌కు క‌లిపి వ‌చ్చిందే రూ.780 కోట్లు అయితే అందులో దాదాపు 80శాతం క‌మ‌లంపార్టీ ఖాతాలో ప‌డ్డాయి. బీజేపీ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్‌లో ఉంది. కాక‌పోతే ఇన్ని ద‌శాబ్దాలు అధికారం అనుభ‌వించినా ఆ పార్టీకి వ‌చ్చిన విరాళాలు మాత్రం కేవ‌లం రూ.95కోట్లు.

మ‌ళ్లీ ప‌వ‌ర్‌లోకి వ‌స్తుంద‌న్న న‌మ్మ‌కం ఉంటే కాస్త ఎక్కువే ఇచ్చేవాళ్లేమో! త‌ర్వాతి స్థానంలో శ‌ర‌ద్‌ప‌వార్ పార్టీ ఉంది. ఎన్‌సీపీకి రూ.58 కోట్ల విరాళాలు వచ్చాయి. బీజేపీకి కాసుల‌వ‌ర్షం కురిపించిన‌వారిలో కార్పొరేట్లు, బ‌డా వ్యాపార‌వేత్త‌లే ఎక్కువ‌. ఎందుకంటే ఆ పార్టీకి వ‌చ్చిన మొత్తం రూ.780 కోట్ల‌లో రూ.548కోట్ల విరాళాలు బ‌డాబాబుల‌నుంచే వ‌చ్చాయి. ఇప్ప‌టికే అదానీ విష‌యంలో ఉదారంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న అప‌నింద‌లు ఉన్నాయి. అదానీ మోసానికి వేల‌మంది ల‌క్ష‌ల‌కోట్లు న‌ష్ట‌పోయినా కేంద్రం ప‌ట్టించుకోలేదు. దేశంలో పేద‌లు పెరిగిపోతుంటే సంప‌న్నుల జాబితా ఏటికేడు ఎదిగిపోతోంది. పారిశ్రామిక‌వేత్త‌ల‌ను అధికారంలో ఉన్న పెద్ద‌లు చ‌ల్ల‌టిచూపు చూడ‌టం వ‌ల్లే వారి వ్యాపార‌సామ్రాజ్యం విస్త‌రిస్తోంది. వేల‌కోట్లు సంపాదిస్తున్న‌ప్పుడు కొన్ని వంద‌ల‌కోట్లు విరాళాలుగా ప‌డేయ‌టం కార్పొరేట్ల‌కు పెద్ద లెక్కేమీ కాదు. విరాళాల‌తో పాల‌కులు-కార్పొరేట్ల బంధం బ‌ల‌ప‌డేకొద్దీ బిక్క‌మొహం వేసేది సామాన్యుడే.