భారత క్రికెట్‌లో శర్మ ప్రకంపనలు.. రాజీనామా!

By KTV Telugu On 17 February, 2023
image

భారత్-ఆస్ట్రేలియా మధ్య కీలకమైన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతోంది. ఇలాంటి సమయంలో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌ భారత క్రికెట్‌లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. వెలుగులోకి రావాల్సిన కొందరు ఆటగాళ్లు అర్థాంతరంగా ఆటకు గుడ్ బై చెప్పేస్తుంటే అంతా ఏంటో అనుకున్నారు. కానీ వారి కెరీర్‌ను కొందరు సెలెక్టర్లు పనిగట్టుకొని నాశనం చేస్తున్నారని చేతన్ శర్మ మాటలతో అర్థమైపోయింది. అంతేకాదు ఏ ఫామ్‌లో లేకపోయినా బీసీసీఐ పెద్దల అండతో కొందరు చక్కగా అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారని కూడా బట్టబయలైంది. చేతన్ శర్మ తాగి వాగాడో లేక కావాలనే ఓపెన్ అయ్యాడో గానీ ఓ స్టింగ్ ఆపరేషన్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం కావడంతో దెబ్బకు రాజీనామా చేశారు. శర్మ రాజీనామా చేయడం బీసీసీఐ కార్యదర్శి దాన్ని వెంటనే ఆమోదించడం చకచకా జరిగిపోయాయి.

భారత క్రికెటర్ల సెలెక్షన్, ఆటగాళ్ల మధ్య విబేధాలు, ఫిట్ నెస్ ఇలా చాలా అంశాలపై చేతన్ శర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఆటగాళ్లు ఫిట్‌గా లేకపోయినా ఇంజక్షన్లు తీసుకొని ఆడుతున్నారని అలాంటి వాళ్లు డోపింగ్ పరీక్షల్లో కూడా దొరకరని పరువు తీశాడు. ఇటీవల గాయంతో దూరమైన బూమ్రా గతంలో ఇంజక్షన్ తీసుకునే ఆడాడనే విషయం బయటకు పొక్కింది. అంతేకాదు చేతన్ శర్మ చాలా చెప్పాడు. బీసీసీఐలో తాము చెప్పిందే వేదమని ఎవరిని ఆడించాలి ఎవరిని పక్కనబెట్టాలనేది అంతా నా ఇష్టం అన్నట్టుగా చెప్పుకొచ్చారు. గంగూలీ, కోహ్లీ, రోహిత్ మధ్య కూడా అసలు పడదని కోహ్లీని కెప్టెన్‌ నుంచి తప్పించడంలో గంగూలీ పాత్ర ఉందని శర్మ బాంబ్ పేల్చాడు. అందుకే కోహ్లీ గంగూలీ పేరు వింటేనే మండిపడతారని అన్నారు. ఇక రోహిత్ శర్మ-హార్థిక్ పాండ్యాలను గోర్రెలతో పోల్చుతూ తనను గుడ్డిగా నమ్ముతారని శర్మ వ్యాఖ్యానించాడు. యువ ఆటగాళ్లు గిల్ ఇషాన్‌లను తానే ప్రోత్సహించానన్న శర్మ సంజూశాంసన్ శిఖర్ ధావన్‌ సహా మరో ఆటగాడిని సైడ్ చేశామని చెప్పుకొచ్చాడు. సంజూకు అవకాశాలు రావడం లేదని ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. యంగ్ క్రికెటర్ కెరీర్‌ను సెలెక్టర్లు డోలాయమానంలో పడేస్తున్నారనేది శర్మ మాటలతో తేలిపోయింది.

బీసీసీఐ సీరియస్‌గా తీసుకోవడంతో చేతన్ శర్మ తన పదవికి రాజీనామా చేశారు. గతంలో టీ20 వరల్డ్ కప్ ఓటమి తర్వాత చేతన్‌ శర్మ సారథ్యంలోని సెలక్షన్‌ కమిటీని బోర్డు రద్దు చేసింది. అయినా మళ్లీ జై షా అండతో సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా శర్మ బాధ్యతలు చేపట్టాడు. టీమిండియాకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను రచ్చకీడ్చి మరోసారి బీసీసీఐ ఆగ్రహానికి గురయ్యారు. రాజీనామా చేశారు. అయితే ఈ ఎపిసోడ్ అంతా ఎవరో కావాలనే చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతన్‌ శర్మ అంటే పడని బీసీసీఐ పెద్దలే ఈ స్టింగ్‌ ఆపరేషన్‌కు ప్రణాళిక రచించారని అతడిని తప్పించేందుకు ఇలా ప్లాన్‌ చేశారని క్రీడా వర్గాల్లో చర్చ జరిగింది. తనకు తానుగా స్వయంగా తప్పుకొనేలా వ్యూహాలు రచించారనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. చేతన్ శర్మ వ్యాఖ్యలపై అటు ఆటగాళ్లు కుతకుతలాడిపోతున్నారట.