తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రంతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా తలపడుతోంది కేసీఆర్ సర్కార్. మోడీ గవర్నమెంట్‌పై యుద్ధం ప్రకటించింది. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కేంద్ర బడ్జెట్ మీద దుమ్మెత్తిపోశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విరుచుకుపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు చేయవద్దు అని చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరి మీ సంగతి ఏంటీ అని నిలదీశారు. 2014లో రూ.60 వేల కోట్ల అప్పు ఉండేదని ఇప్పుడు రూ.3 లక్షల కోట్ల అప్పు ఎలా పెరిగిందని నిర్మలా సీతారామన్ ప్రశ్నించారు.
ఇటీవల అసెంబ్లీలో కేసీఆర్ మాట్లాడుతూ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రజలను మభ్యపెడుతున్నారని 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అనేది పెద్ద జోక్ అన్నారు. భారత్ కంటే మన పక్క దేశాలు బంగ్లాదేశ్ భూటాన్ మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. తలసరి ఆదాయంలో భారత్ ర్యాంకు 138 అని తెలిపారు. మోదీ కంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాలనలోనే అభివృద్ధి జరిగిందని చెప్పారు. అప్పులు చేయడంలో ప్రధాని మోదీని మించిన వారు ఎవరూ లేరని విమర్శించారు. మన్మోహన్ సింగ్ హయాంలో ద్రవ్యలోటు 4.77 శాతంగా ఉండేదని ఇప్పుడు అది 5.1 శాతానికి చేరిందని అన్నారు. అలాగే మెడికల్ కాలేజీల ప్రతిపాదనలపై బీఆర్ఎస్ నేతలు కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఆ విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు నిర్మలా సీతారామన్.
2014 నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు స్థాపించామని అక్కడే నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో ఏయే జిల్లాల్లో మెడికల్ కాలేజీలు లేవో జాబితా పంపించమని తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగితే ఇదివరకే మెడికల్ కాలేజీలు ఉన్న కరీంనగర్, ఖమ్మం జిల్లాల పేర్లు పంపిచారని అందుకే వాటిని తాము తిరస్కరించామని తెలిపారు. తెలంగాణలో ఏయే జిల్లాల్లో మెడికల్ కాలేజీలు ఉన్నాయో కేసీఆర్ కే తెలియదా అని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి నోడేటా గవర్నమెంట్ ఎవరిదో అర్థం చేసుకోవచ్చన్నారు. 2014 నుంచి ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం నుంచి లక్షా 39 వేల కోట్ల రూపాయలు గ్రాంట్ రూపంలో వచ్చాయని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.