సంచలనవ్యాఖ్యలతో స్టింగ్ ఆపరేషన్‌లో దొరికిపోయిన బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్‌శర్మ ఆ పదవినుంచి తప్పుకున్నాడు. టీమిండియా వెనుక ఏం జరుగుతోందో బీసీసీఐ గుట్టేంటో చెప్పుకుంటూ పోయిన చేతన్‌శర్మ అది బయటికి రావటంతో చివరికి గుడ్‌బై చెప్పాల్సి వచ్చింది. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మధ్య సంబంధాల గురించి చేతన్‌శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా నెలక్రితమే మళ్లీ నియమితుడైన చేతన్శర్మను స్టింగ్ ఆపరేషన్ బుక్ చేసింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో అరగంట సంభాషణను షేర్ చేసుకుంటూ గేమ్‌లో హిట్‌వికెట్‌గా మారాడు చేతన్‌శర్మ. ఫిట్నెస్ కోసం ఆటగాళ్లకు ఇంజెక్షన్లు కొందరు క్రికెటర్ల యాటిట్యూడ్ టీంలో రాగాద్వేషాలన్నీ చేతన్‌శర్మ నోటినుంచి వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి హిస్టరీ క్రియేట్ చేసిన చేతన్‌శర్మ స్టింగ్ ఆపరేషన్ని పసిగట్టలేక ఇలా సోషల్‌మీడియాలో దొరికిపోవడం ఆశ్చర్యంగా ఉంది.
క్రికెటర్ల పేర్లు బయటపెట్టలేదుగానీ చేతన్‌శర్మ చెప్పినదాని ప్రకారం కొందరు స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. డోప్కి కూడా దొరకకుండా జాగ్రత్తపడుతున్నారు. ఫిట్నెస్ ఉన్నా సరే పర్ఫామెన్స్ సరిగా లేనివాళ్లు అదే పనిచేస్తున్నారని చేతన్‌శర్మ బాంబుపేల్చాడు. పెయిన్ కిల్లర్లతో తీసుకునేవి పక్కా ఇంజక్షన్లని చెప్పాడు. పేసర్ బుమ్రా ఆ ఇంజక్షన్లతోనే ఫిట్నెస్ కోల్పోయాడని సంచలన నిజాన్ని చేతన్‌శర్మ బయటపెట్టాడు. కోహ్లికి కెప్టెన్సీ మార్పులు చేర్పులమీద ముందే చెప్పినా అహం దెబ్బతినటంతో గంగూలీని నిందించాడని చేతన్‌శర్మ అసలు విషయం బయటపెట్టాడు. రవిశాస్త్రి కోచ్ కావడంలోనూ తెరవెనుక కోహ్లీనే కీలకమన్న విషయాన్ని కూడా బయటపెట్టాడు.
చేతన్‌శర్మ ఎపిసోడ్ బీసీసీఐని కుదిపేసింది. ఏడాదికాలంలో చేతన్‌శర్మ సెలక్షన్ చాలాసార్లు విమర్శలను ఎదుర్కుంది. 2022లో టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఘోర వైఫల్యంతో సెలెక్షన్ కమిటీలోని సభ్యులందర్నీ తప్పించినా చేతన్శర్మని మాత్రం బీసీసీఐ కొనసాగించింది. ఏరికోరి చీఫ్ సెలక్టర్‌గా ఉంచితే ఆయనే బీసీసీని బోనులో నిలబెట్టి తన వికెట్ తానే పడగొట్టుకున్నాడు. చేతన్‌శర్మ తప్పుకున్నా ఆయన ప్రస్తావించిన అంశాలు అంత తేలిగ్గా మరుగునపడవు. రేపు మనోళ్లు నాలుగు వికెట్లు పడగొట్టినా సిక్సర్లు కొట్టినా స్టెరాయిడ్స్ ఎఫెక్ట్ ఏమోనని అనుమానించే పరిస్థితి ఉంటుంది. బీసీసీఐ ప్రతీ నిర్ణయాన్ని అనుమానపు కళ్లతోనే చూసే ప్రమాదం ఉంది. కడుపులో దాచుకోలేక ఎక్కడోచోట కక్కేద్దామనుకుంటే చివరికి ఇలాగే జరుగుతుంది.