దున్నేవాడిదే భూమి. దోచుకునే వాడిదే జేబు.వెన్నుపోటు పొడుచుకునే వాడికే పార్టీ గుర్తులూ, పార్టీపై సర్వాధికారాలూనూ. ఇదే అసలు సిసలు రాజకీయ న్యాయం అంటున్నారు మేథావులు. నాడు చంద్రబాబు నాయుడైనా నేడు ఏక్ నాథ్ షిండే అయినా అక్రమాల్లో ఆరి తేరి గురి చూసి వెన్నుపోటు పొడిచి వ్యవస్థలను మేనేజ్ చేస్తే విజయానికి ఇష్టం లేకపోయినా చచ్చినట్లు మనల్నే వరిస్తుందంటున్నారు రాజకీయ పండితులు.
మహారాష్ట్రలో శివసేన పార్టీ పై అధికారం ఎవరిది. పార్టీ గుర్తు బాణం ఎవరి చేతుల్లోకి వెళ్లాలి. అన్న అంశాలపై కొంత కాలంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆలోచనలు చేస్తోంది. చాలా పెద్ద విషయం కాబట్టి బోలెడు తర్జన భర్జనలు పడ్డారు. చివరకు చాలా తేలిగ్గా న్యాయాన్ని కనుగొన్నారు. పార్టీ తనకు పదవులు ఇచ్చి ప్రాధాన్యతనిచ్చి చక్కగా చూసుకున్నా కూడా వెర్రి మొర్రి ప్రేమలూ, అభిమానాలూ పట్టుకుని వేళ్లాడకుండా రాత్రికి రాత్రే నాయకత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేసి ఆ వెనకాల పదునైన గునపాన్ని వెన్నులో గుచ్చేసి రాజ్యలక్ష్మిని అమాంతం పట్టేసి సింహాసనం ఎక్కి కూర్చున్న ఏక్ నాథ్ షిండే తెగువనూ అధికారం కోసం ఎంతకైనా దిగజారగల ఆయన చిత్తశుద్ధిని వ్యవస్థలను మెప్పించగల చాతుర్యాన్నీ గమనించిన ఎన్నికల సంఘం మరో మాటే లేకుండా శివసేన పార్టీనీ ఆ పార్టీ గుర్తు బాణాన్నీ కూడా షిండేకు ఇవ్వడమే న్యాయమని తేల్చి చెప్పేసింది.
షిండే చేతుల్లో బాణం లేనపుడే శివసేన అధినేత మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గుండెల్లో బాణం గుచ్చుకుంది. ఇపుడు విల్లును కూడా షిండేకి ఇచ్చేసింది ఎన్నికల సంఘం. సో ఇక శివసేన పార్టీతో పాత జ్ఞాపకాలు మినహాయిస్తే పార్టికి సంబంధించినవి ఏవీ కూడా థాకరేకి చెందినవి కావని తేల్చేసినట్లయ్యింది. వచ్చే ఎన్నికల్లో షిండేపై ప్రతీ కారం తీర్చుకోవాలన్నా షిండేని తయారు చేసి తనపై వదిలిన బిజెపికి గుణపాఠం చెప్పాలన్నా కూడా ఉద్ధవ్ అర్జంట్ గా ఓ రాజకీయ పార్టీ పెట్టాలి. దాన్ని జనంలోకి తీసుకెళ్లాలి. తన తండ్రి బాల్ థాకరేకి వారసుణ్ని తానేని మరోసారి ప్రజలకు గుర్తు చేయాలి. శివసేన అనేది ఇక మన పార్టీ కాదని కూడా చెప్పాలి. అన్నీ చేసి వచ్చే ఎన్నికల్లో సత్తా చాటితే ఆయన రాజకీయాల్లో వెలుగుతారు. లేదంటే ఫ్లాష్ బ్యాక్ లో గుర్తుకొచ్చినట్లు ఎవరికైనా ఎప్పుడైనా గుర్తుకు వచ్చే జ్ఞాపకంగా మిగిలిపోతారు.
ఈ వ్యవహారం చూస్తే ఏం అర్ధం అవుతుంది. కష్టపడి పార్టీ పెట్టుకోవడం దాని గురించి ఎండనకా వాననకా వీధుల్లో తిరిగి జనంతో మమేకం కావడం. ఆనక ఎన్నికల్లో జనాన్ని ఆకట్టుకుని అధికారంలోకి రావడం. ఇంత ప్రయాస అవసరమా అని. ఎవరో పార్టీ పెడితే అందులో చేరి అదను చూసి వెన్నుపోటు పొడిస్తే అధికారంతో పాటు పార్టీకూడా మన ఒడిలో పడిపోతుంది కదా అని రాజకీయ గిరీశాలు సలహాలు ఇస్తారు. ఇపుడు షిండే లానే 1995లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావుకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు ముందుగా ముఖ్యమంత్రి పదవిని కొట్టేశారు. మన షిండేలానే. ఆ తర్వాత పార్టీ గుర్తుకోసం ఎన్టీయార్ న్యాయపోరాటం చేశారు. మన ఉద్ధవ్ థాకరేలా. అయితే అపుడు వ్యవస్థలను చంద్రబాబుదే అసలైన తెలుగుదేశమని కనిపెట్టి పార్టీ గుర్తు అయిన సైకిల్ ని ఎన్టీయార్ నుంచి గుంజుకుని బాబు చేతిలో పెట్టి రాజ్యమూ పార్టీ దానిపై సర్వాధికారాలూ నీవే నాయనా అని ఆశీర్వదించి ఏపీపై వదిలిపెట్టారు.
తన నిజాయితీకి తగిన గుర్తింపు లబించిందని మురిసిపోయిన చంద్రబాబు ఎన్టీయార్ బ్యాంకు ఖాతాలను కూడా ఫ్రీజ్ చేయించి ఆ నగదును కూడా పార్టీ అభివృద్ధికి వాడుకున్నారు. ఎన్టీయార్ లానే ఉద్ధవ్ థాకరే కూడా వెర్రిబాగులోడు. అంటే మాయామర్మం తెలీని ఒట్టి అమాయకుడు. కల్మషం తెలీని శాల్తీ. ఆవేశం తప్ప ఆలోచన లేనివాడు. అందుకే ఎన్టీయార్, థాకరేలను ఎవరు చూసినా వారిని మోసం చేయడం చాలా తేలికని వారి నుదురు చూస్తే తెలిసిపోతుంది.
ఆ విద్యలో ఆరితేరిన వారు కాబట్టే అపుడు చంద్రబాబు నాయుడు ఇపుడు ఏక్ నాథ్ షిండేలు అంది వచ్చిన అవకాశాన్ని రెండు చేతులతోనూ అంది పుచ్చుకుని ఒక చేత్తోనే వెన్నుపోటు పొడిచారు. అప్పుడు చంద్రబాబుకు నాడు కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అండదండలు అందిస్తే ఇపుడు షిండేకి బిజెపి అదే సాయాన్ని చేసి పెట్టింది. అప్పటికీ ఇప్పటికీ ఏం మారలేదు. న్యాయం అలానే ఉంది. అన్యాయమూ అలానే వెలిగింది. కాకపోతే బాధితులు వంచితుల పేర్లు మారాయంతే. మిగతాదంతా షేమ్ టూ షేమ్ .