శ్రీలంక అధ్యక్షుడి గా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే…దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారు ? ఆయన ముందుంది ముళ్ల దారేనా ? దేశంలో ఉన్న వనరులను ఎలా ఉపయోగిస్తారు ? ఐఎంఎఫ్‌ను బెయిల్ ఔట్ ప్యాకేజీ అడుగుతారా ? పెట్రోల్, డీజిల్ సమస్యను పరిష్కరించే చర్యలు తీసుకునే అవకాశం ఉందా ? ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడిదే చర్చ.
శ్రీలంక పార్లమెంట్ అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఎన్నికయ్యారు. గొటబయ రాజపక్సే అనుచరుడిగా పేరున్న రణిల్…దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుండి ఎలా గట్టెక్కిస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. 134 ఓట్లతో అధ్యక్షుడిగా ఎన్నికైన రణిల్ విక్రమసింఘే ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయ్. ఆందోళకారులు కోరుకున్నట్లే గొటబయ రాజపక్సే రాజీనామా చేశారు. దేశం విడిచి పారిపోయారు. ముఖ్యంగా నాలుగు నెలలుగా కొలంబో అధ్యక్ష భవనం ముందు ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రజల ఆందోళనను ఎలా విరమింపజేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే రణిల్ విక్రమ సింఘే ముందున్న ప్రధాన సవాల్.
శ్రీలంకకు దాదాపు 51 బిలియన్ల డాలర్లపై అప్పులున్నాయ్. ఒక్క చైనాకే ఏడు బిలియన్ డాలర్లు చెల్లించాలి. అంతర్జాతీయ ద్రవ నిధి సంస్థను ఒప్పించి…బెయిల్ ఔట్ ప్యాకేజ్ తీసుకురావడమే రణిల్ ముందున్న ప్రధాన కర్తవ్యం. అయితే ఐఎంఎఫ్…బెయిల్ ఔట్ ప్యాకేజ్‌కు అంత సులువుగా ఒప్పుకునే అవకాశాలు లేవు. దేశం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు బెయిల్ ఔట్ ప్యాకేజే కీలకం. ఈ ఏడాది దేశాన్ని నడపడానికి 4 మిలియన్లు డాలర్లు అవసరమవుతాయని ప్రభుత్వం చెబుతోంది.
శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. వాహనదారులు పెట్రోల్ కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ప్రస్తుతం అత్యవసర సర్వీసులకు మాత్రమే పెట్రోల్‌ను సరఫరా చేస్తున్నారు. రెండ్రోజుల క్రితం పెట్రో ధరలను సవరించింది సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్. ప్రస్తుతం శ్రీలంకలో లీటర్ పెట్రోలు 450, సూపర్ డీజిల్ 520 రూపాయలుగా ఉంది. ఆటో డీజిల్.. లీటర్ పై 20 తగ్గించి…ప్రస్తుతం 440 రూపాయలకు విక్రయిస్తోంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగిపోయాయ్. పెట్రోల్, డీజిల్ ధరల నుంచి ప్రజలకను రణిల్ ఎలా విముక్తి కల్పిస్తారో…ధరల కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఎగుమతులు, దిగుమతులపై రణిల్ విక్రమసింఘే దృష్టి సారించాల్సిన అవసరముంది. శ్రీలంకలో ఉత్పత్తయ్యే కెమికల్స్, చిరు ధాన్యాలు, వాహనాలను ఎగుమతులు పెంచితే…ఆదాయం పెరగనుంది. ఎగుమతుల కంటే దిగుమతులకే ఎక్కువ ఖర్చు చేస్తోంది. ఈ రెండింటిని విక్రమసింఘే బ్యాలన్స్ చేయాల్సి ఉంది. పర్యాటక రంగాన్ని కరోనా ఊహించని దెబ్బ కొట్టింది. విదేశాల నుంచి పర్యాటకులు సంఖ్య తగ్గిపోయింది. దీంతో దాదాపు 30 లక్షల మందికి ఉపాధి కరువైంది. అంతకుముందు జరిగిన వరుస బాంబు దాడులూ…పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపాయ్. ముఖ్యంగా టూరిజం అభివృద్ధికి చర్యలు తీసుకుంటే…ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరకనుంది. అయితే రణిల్ విక్రమసింఘే…ఇతర దేశాలను ఎలా ఒప్పిస్తారన్నదే ఉత్కంఠగా మారింది.
శ్రీలంక ప్రెసిడెంట్ రణిల్ విక్రమసింఘే ముందున్న సవాళ్లు….