తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉంది. అయినప్పటికీ నాయకులు ఇప్పటి నుంచే తన అస్త్రాలకు పదును పెడుతున్నారు. దాంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల వాతావరణం హీటెక్కిపోయింది. నాయకులు పాదయాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. గతంలో 2003లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా చేవెళ్ల నుంచి ఇచ్చాపురం వరకు ఎర్రటి ఎండల్లో పాదయాత్ర చేశారు. 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. ఆ తరువాత 2012లో చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర చేసి 2014లో జరిగిన ఎన్నికల్లో గెలిచి నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
2013లో ఏపీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్ర తలపెట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. దీంతో పాదయాత్రల ద్వారా నేరుగా సీఎం అయిపోవచ్చు అనే సెంటిమెంట్ బలపడింది.
రీసెంట్గా నారా లోకేశ్ కూడా యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇటు తెలంగాణాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతలుగా పాదయాత్ర చేశారు. తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాత్ సే హాత్ జోడో పేరుతో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మరోవైపు షర్మిల కూడా మరో ప్రజాప్రస్థానం పేరుతో తెలంగాణలో పాదయాత్ర చేస్తున్నారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ముఖ్య నేత రాహుల్ గాంధీ కూడా భారత్ జోడో యాత్ర పూర్తి చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇంకా చిన్నా చితక నాయకులు కూడా పాదయాత్రలకు సిద్ధమవుతున్నారు. అయితే రానురాను రాజకీయ ముఖచిత్రంలో వచ్చిన మార్పుల వల్ల పాదయాత్రల తీరుతెన్నుల్లో కూడా మార్పు వచ్చింది. ఈ యాత్రలు కాస్తా బలప్రదర్శనలుగా మారిపోయాయి. అంతేకాదు పాదయాత్రలు చేస్తున్న నాయకులు కావాలనో లేకపోతే కార్యకర్తల్లో జోష్ నింపాలనో నోటికి పని చెప్పడం మొదలెట్టారు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తన పాదయాత్రల్లో చంద్రబాబు విధానాల మీదే ఎక్కువగా విమర్శలు చేశారు. అయితే ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబును చీపుర్లతో కొట్టాలి నడివీధిలో కాల్చి చంపాలని జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం సృష్టించాయి.
ఇకపోతే ఇప్పటి పరిస్థితి చూస్తుంటే పాదయాత్రల్లో తిట్ల దండకాలు కామన్ అయిపోయి. ఏపీలో పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ సీఎం జగన్‌ను ఉద్దేశించి రారా పోరా వాడు వీడు ఏం పీకాడు సైకో అంటూ దారుణమైన పదజాలంతో విమర్శిస్తున్నారు. మహిళా మంత్రి రోజాను కూడా డైమండ్ పాప జబర్దస్త్ అంటీ అని వ్యాఖ్యానించడంతో వైసీపీ నాయకులు కూడా అదే స్థాయిలో బదులిచ్చారు. ఇటు తెలంగాణాలో బండి సంజయ్ మాట్లాడితే ఎలా ఉంటుందో తెలుసు. తన పాదయాత్రలో భాగంగా నిర్మల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ మీద తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ డ్రగ్స్ అలవాటు ఉంది ఆయన బ్లడ్ టెస్ట్ చేస్తే అసలు విషయం తెలుస్తుంది అని ఆరోపించారు. దాని మీద కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఇక మేడారం నుంచి హాత్ సే హాత్ జోడో పాదయాత్ర మొదలుపెట్టిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నక్సలైట్లు ప్రగతి భవన్ ను పేల్చేయాలని పిలుపునివ్వడం దుమారం రేపింది. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే గొయ్యి తీసి కేసీఆర్‌ను బొంద పెడతామని ఎర్రబెల్లి మీద విచారణ జరిపించి జైలుకు పంపిస్తామని అన్నారు.
మరోవైపు షర్మిల కూడా తానేమీ తక్కువ తినలేదు అన్నట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, సీఎం, ఇతర మంత్రుల మీద తీవ్రంగా విరుచుకుపడుతున్నారు. ఇంతకుముందు తన పాదయాత్రలో భాగంగా నర్సంపేటలో స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద చేసిన వ్యాఖ్యలతో ఎమ్మెల్యే అనుచరులు ఆమె మీద దాడి చేశారు. పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించారు. కోర్టు నుంచి పాదయాత్రకు అనుమతి తెచ్చుకుని మళ్లీ పాదయాత్ర కొనసాగిస్తున్నారు. తాజాగా మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దాంతో ఎమ్మెల్యే అనుచరులు షర్మిల కాన్వాయ్ మీద దాడి చేశారు. ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి హైదరబాద్‌కు తరలించారు. అంతేకాదు ఆమె పాదయాత్రకు అనుమతిని రద్దు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాదయాత్రలు రెండు అడుగులు నాలుగు తిట్లు అన్నట్లుగా సాగుతున్నాయి.