జనసేన ఎందుకు వద్దు? టిడిపియే ఎందుకు ముద్దు?

By KTV Telugu On 21 February, 2023
image

భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారు. జనసేనలో చేరతారని చాలా కాలంగా ప్రచారం ఉన్నా ఆయన మనసు మార్చుకున్నారా. పాలక పక్షమైన వైసీపీలోనూ చేరతారని ఊహాగానాలు వినిపించాయి. మరి కన్నా అధికారంలో లేని టిడిపి వైపే ఎందుకు మొగ్గు చూపినట్లు ఏంటి ఆయన లెక్క. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు వైఖరి పడక పార్టీకి రాజీనామా చేశారు మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. కన్నా లక్ష్మీనారాయణ ఆషామాషీ నాయకుడేమీ కాదు. చాలా సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ హయాంలో కీలక మంత్రి పదవులు చాలా సమర్ధవంతంగా నిర్వర్తించిన దిట్ట. ఒక సమయంలో ముఖ్యమంత్రి పదవి రేసులోనూ దూసుకుపోయారు. కాకపోతే అదృష్టం కలిసిరాక మంత్రిగానే మిగిలిపోయారు. లేదంటే ఉమ్మడి ఏపీకి ఆయనే చివరి ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారు. కేంద్ర మంత్రి చిదంబరంతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా కిరణ్ కుమార్ రెడ్డి సిఎం పదవిని తన్నుకుపోయి కన్నాకు నిరాశ మిగిల్చారని అంటారు.

కాంగ్రెస్ దిగ్గజాల కేబినెట్లలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ రాష్ట్ర విభజన తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. కాంగ్రెస్ పార్టీ సమాధి అయిపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉండిపోయారు. 2019 ఎన్నికల సమయంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరడానికి అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఇటు జగన్ మోహన్ రెడ్డి కూడా కన్నా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కన్నా వంటి సీనియర్లు పార్టీలో ఉంటే మంచిదనే జగన్ కూడా భావించారు. అయితే చివరి నిముషంలో కన్నాకు బిజెపి పెద్దలు ఫోన్ చేసి ఏపీ బిజెపిలో చేర్చేసుకున్నారు. ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కచ్చితంగా గెలిచి తీరుతుందన్న నమ్మకం లేకనో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఆఫర్ ను కాలదన్నుకోవడం ఎందుకనే భావించిన కన్నా బిజెపిలో చేరిపోయారు. ఆ ఎన్నికల్లో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అఖండ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. బహుశా బిజెపి చేరినందుకు కన్నా నాలిక కరుచుకుని ఉండాలి. అధికారం లేకపోయినా బిజెపిలో కన్నా యాక్టివ్ గానే ఉండేవారు. అయితే హఠాత్తుగా ఆయన్ను తప్పించి సోము వీర్రాజును అధ్యక్షుని చేయడంతో కన్నా నీరుగారిపోయారు.

ఇక బిజెపిలో తనకు ఫ్యూచర్ ఉండదని నిర్ణయానికి వచ్చేశారు. పార్టీ మారి తీరాల్సిందే అనుకున్నాక రాజీనామా చేసేశారు. దానికి ముందు జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి సానుకూలంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పై ఏ పార్టీ కూడా ఒత్తిడి తీసుకురావద్దని కన్నా సూచించారు. పవన్ ను సొంతంగా ఆలోచించుకునే వాతావరణం కల్పించాలని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలతోనే కన్నా జనసేనలో చేరబోతున్నారని ప్రచారం జరిగింది. దానికి ఊతమిస్తూ నాదెండ్ల మనోహన్ కూడా కన్నా ఇంటికి వెళ్లి భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. బిజెపికి రాజీనామా చేసిన వెంటనే ఆయన జనసేనలో చేరతారని అందుకే అందరూ అనుకున్నారు. అయితే ఉన్నట్లుండి ఆయన టిడిపి లో చేరడం ఖాయమని ఈ నెల 23న చంద్రబాబు సమక్షంలో పచ్చకండువా కప్పుకుంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరడం కన్నా టిడిపిలో చేరడమే ఒకందుకు మంచిదని కన్నా భావించి ఉండచ్చు. జనసేన అనగానే ఎలాగూ కాపుల పార్టీ గా ముద్ర పడుతుంది. అందులో ఎక్కువ మంది కాపులకే టికెట్లు దక్కుతాయి కూడా. అదే టిడిపిలో చేరితే అక్కడ ఉన్న కాపు నేతల కన్నా కూడా తానే సీనియర్ కావడంతో పాటు చంద్రబాబుతోనూ సాన్నిహిత్యం ఉంది కాబట్టి రేపు టిడిపి-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో కీలక పదవి సంపాదించడం తేలికవుతుందని కన్నా వ్యూహంగా భావిస్తున్నారు.

అయితే టిడిపిలో ఆయనకు ఇబ్బందులూ లేకపోలేదు. గుంటూరు జిల్లాకు చెందిన కన్నా లక్ష్మీనారాయణకు అదే జిల్లాకు చెందిన రాయపాటి సాంబశివరావుకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కన్నా లక్ష్మీనారాయణను టిడిపిలో చేర్చుకోవడాన్ని రాయపాటి నిర్ద్వంద్వంగా వ్యతిరేకించడం ఖాయం. మరి చంద్రబాబు నాయుడు రాయపాటికి విలువ నిస్తారా లేక కన్నాకే ప్రాధాన్యతనిస్తారా అన్నది చూడాలి. అయితే రాయపాటిని పక్కన పెట్టే పరిస్థితులు అయితే ఉండవంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే రాయపాటి తన నియోజకవర్గంలో తన మనుషుల గెలుపుకు కృషిచేయడమే కాదు పొరుగు నియోజకవర్గాల్లో టిడిపి అభ్యర్ధుల ఎన్నికల ఖర్చుకూ ఎంతో కొంత సాయం చేస్తారు. అటువంటి రాయపాటిని పూర్తిగా విస్మరించే పరిస్థితి చంద్రబాబుకు ఉండదు. రాయపాటిలా కన్నా లక్ష్మీనారాయణ ఎన్నికల ఖర్చు భరించే పరిస్థితి ఉండదంటున్నారు పార్టీ సీనియర్లు.

ఇక అధికారంలో ఉన్న వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలోనే చేరితే పోయేది కదా అన్న వ్యాఖ్యలూ వినపడుతున్నాయి. నిజానికి కన్నాకు కూడా ఆలోచన లేకపోలేదంటారు పరిశీలకులు. కాకపోతే 2019లో చేరతానని చెప్పి చివరి నిముషంలో కన్నా హ్యాండ్ ఇచ్చారన్న కోపం వైసీపీ నాయకత్వంలో ఉందంటున్నారు. అదే ఇపుడు కన్నాకు మోకాలడ్డే పరిస్థితులు ఉంటాయంటున్నారు. అందుకే కన్నా వైసీపీ వైపు చూడలేక టిడిపి లో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటూ ఉండచ్చని వారంటున్నారు. కన్నా లక్ష్మీనారాయణ తో పాటు మరి కొందరు అనుచరులు కూడా బిజెపిని వీడారు. అయితే ఇపుడు వారంతా టిడిపిలోనే చేరతారా అన్నది ప్రశ్న. కన్నాతో పాటు బిజెపి నుండి బయటకు వచ్చిన వారిలో కొందరు కీలక నేతలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ సీనియర్ నేత మంత్రి అంబటి రాంబాబుతో టచ్ లో ఉన్నారు. వారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉంటాయంటున్నారు. 2024 ఎన్నికల్లోనూ వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని సర్వేలు ప్రచారం చేస్తోన్న నేపథ్యంలో కన్నా తీసుకున్న నిర్ణయం మంచిదా కాదా అన్నది చర్చనీయాంశమవుతోంది. అయితే కన్నా మంచి నిర్ణయమే తీసుకున్నారని ఇపుడు ప్రచారంలో ఉన్న సర్వేలన్నీ కూడా టిడిపి-జనసేన పొత్తు ఆలోచనకు ముందు చేసినవి కాబట్టి ఇపుడు సమీకరణలు మరోలా ఉంటాయని వారంటున్నారు.