ఏపీ సీఎం జగన్ కేబినెట్ పదవులైనా, నామినేటెడ్ పదవులైనా ఏదైనా సామాజిక వర్గాన్ని పరిగణలోకి తీసుకుంటున్నారు. ఆ కోణంలోనే పదవుల పంపకాలు చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్సీ పదవుల జాతర మొదలైన వేళ ఒకేసారి 18మంది ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించింది వైసీపీ. ఈసారి కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మార్క్ చూపించారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయానికి పెద్ద పీట వేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థులకు తమ గురుతర బాధ్యతను కూడా జగన్ వివరించారు. గతంలో ఎప్పుడూ జరగని విధంగా సామాజిక న్యాయం అమలు చేస్తున్నామని చెప్పిన ఆయన పదవులు పొందినవారు యాక్టివ్‌గా ఉండాలని సూచించారు. ప్రభుత్వం చేస్తున్న సామాజిక న్యాయాన్ని ప్రతి గడపకు తెలిసేలా చూడాలని సూచించారు.
ప్రస్తుతం జగన్ ప్రకటించిన 18మంది ఎమ్మెల్సీల్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలే. మిగిలిన నలుగురు ఓసీలు ఒక్కో సామాజికవర్గానికి చెందిన వారు. బీసీ 11, ఓసీ-4, ఎస్టీ-1, ఎస్సీ-2 అభ్యర్థులు ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థులను ప్రకటించారు. తద్వారా శాసనమండలిలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 68 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చామని చెప్పుకుంటోంది అధికార పార్టీ. సామాజిక సాధికారత అంటే తమదేనని చంద్రబాబు మాటలు చెబితే జగన్ చేతల్లో చూపించారనే విషయాన్ని తెలియజెప్పింది. ప్రస్తుతం శాసనమండలిలో వైసీపీ బీసీ ఎమ్మెల్సీల సంఖ్య 19కి పెరగనుండగా ఓసీలు 14కు చేరనున్నారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మండలిలో 37 శాతమే ప్రాతినిధ్యం ఉండేది. ఇప్పుడు జగన్ ఒక్క బీసీలకే 43 శాతం ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారని విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తోంది.
ఎస్సీ, సామాజిక సమీకరణాల పరంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక చేసిన జగన్, మరోసారి చేపట్టబోయే మంత్రివర్గ విస్తరణలో కూడా ఆ కోణంలోనే మినిస్ట్రీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జగన్ మొదటి కేబినెట్లో మండలి నుంచి మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ మంత్రులుగా ఉండేవారు. కానీ వారిని రాజ్యసభకు పంపారు. దీంతో మండలి నుంచి మంత్రులు లేరు. దీంతో ఇప్పుడు కొత్తగా మండలికి వచ్చేవారిలో కొందరికి మంత్రి పదవులు రానున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరుపై సమీక్ష చేస్తున్న జగన్ ఓ నలుగురిని మారుస్తారనే టాక్ వినిపిస్తోంది. వారి స్థానంలో ఎమ్మెల్సీలకు అవకాశం కల్పిస్తారని చెబుతున్నారు.
సామాజిక న్యాయాన్ని పాటించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది సరే కానీ తొలి నుంచి కష్టపడిన వారికి ఏమేర పదవులు ఇస్తుందనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. పార్టీ స్థాపించినప్పటి నుంచి చాలామంది నేతలు జగన్ వెంట నడిచారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన్ను వీడలేదు. వారిలో కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యారు. మరికొందరు నామినేటెడ్ పదవుల్లో ఉన్నారు. ఇంకా కొందరు పార్టీ బాధ్యతలు చూస్తున్నారు. అయినా చాలామందికి ఎలాంటి పదవులు దక్కలేదు. అయితే ప్రస్తుతం అలాంటి వారిలో కొందరికి ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చినా సొంత పార్టీ కన్నా బయటి నుంచి వచ్చిన వారికే జగన్ ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. పన్నెండేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారిని కాదని భవిష్యత్ రాజకీయాల కోసం సామాజికపరంగా ఓట్లు తెచ్చుకోవడం కోసమే జగన్ పాకులాడుతున్నారన్న విమర్శలు పార్టీ నుంచే వినిపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో గెలవాలంటే ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టడం కూడా ఓ వ్యూహమే. అలాంటి సమయంలో కొందరిని లాగి కండువాలు కప్పుతున్నారు. అయితే వారు ఊరికనే రారు కదా. అలాంటి వారికి ఓ పదవి ఎర వేస్తున్నారు. పార్టీలో చేరితే పదవి గ్యారంటీ అనే సంకేతాలు పంపుతున్నారు. ఇతర పార్టీల నేతలను ఆకర్షించే ప్రయత్నంలో ఎన్నో ఏళ్లుగా పార్టీ జెండా పట్టుకున్న వారిలో అసంతృప్తి అసహనం పెరగడాన్ని కూడా గమనించాలి. పార్టీలోనే కొనసాగుతున్న వారిని పక్కన పెట్టి అప్పటికప్పుడు ఇతర పార్టీల నుంచి వచ్చి చేరే నేతలకు ప్రయారిటీ ఇచ్చినందున ఓట్లు ఎంత మేర వచ్చి పడతాయో తెలియదు కాని ఉన్న ఓట్లు పోయే అవకాశముందన్న ఆందోళన పార్టీ నేతలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నుంచి వచ్చిన వెంటనే బీద మస్తాన్ రావుకు రాజ్యసభ ఇచ్చారు. తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ పదవి ఇవ్వడం కూడా అంతే చర్చనీయాంశమైంది. ఇక తాజాగా ఎమ్మెల్సీల భర్తీలోనూ జగన్ అదే వైఖరిని అవలంబిస్తున్నారంటున్నారు. కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళకు ఎమ్మెల్సీ ఆఫర్‌తో పార్టీలో చేర్చుకున్నారు. కుడిపూడి సూర్యనారాయణ కోలా గురువులు కూడా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారే. దీంతో తొలి నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.