టిడిపి పేదల పార్టీ అన్న కాంగ్రెస్ రేవంత్

By KTV Telugu On 22 February, 2023
image

మనం ఎక్కడ్నుంచి వచ్చామో ఆ మూలాలను మర్చిపోవడం కష్టం. అయితే రాజకీయ నాయకులకు మాత్రం సాధారణంగా ఇలాంటి సెంటిమెంట్లేమీ ఉండవు. ఏ పార్టీలో ఉన్నారో దాన్ని మాత్రమే ప్రమోట్ చేసుకుంటూ ఉంటారు. కానీ తెలంగాణా కాంగ్రెస్ పి.సి.సి. అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రం తన పూర్వాశ్రమాన్ని ఏ మాత్రం మర్చిపోలేకపోతున్నాడు. తను వచ్చిన టిడిపిపై ప్రేమనూ చంపుకోలేకపోతున్నారు. ఇపుడు తెలంగాణాలో దీనిపైనే చర్చ నడుస్తోంది.

తెలంగాణాలో వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే తన లక్ష్యమని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పదే పదే శపథం చేస్తున్నారు. అందుకోసం చాలా పట్టుదలగా కష్టపడుతున్నారు కూడా. హైకమాండ్ ఆశీస్సులతోనే పాదయాత్ర కూడా చేస్తున్నారాయన. ఈ క్రమంలోనే పాలకుర్తిలో రేవంత్ రెడ్డి బి.ఆర్.ఎస్. నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావుపై విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కీలక పదవులు అనుభవించిన ఎర్రబెల్లి దయాకర రావు తనకు రాజకీయ భిక్ష పెట్టిన టిడిపికి తనను మంచిగా చూసుకున్న చంద్రబాబు నాయుడికి కూడా ద్రోహం చేశారని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పేదలకోసం అవతరించిన టిడిపిని వీడి ఎర్రబెల్లి దయాకర రావు బి.ఆర్.ఎస్. లో చేరడం దారుణమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఎర్రబెల్లి దయాకర రావుపై రేవంత్ రెడ్డి ఇంకేమి విమర్శలు చేసినా బానే ఉండేదేమో కానీ టిడిపిని వీడటాన్ని ప్రశ్నించడమే విడ్డూరంగా ఉందంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే ఎర్రబెల్లి దయాకర రావే కాదు రేవంత్ రెడ్డి కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నేతే.

చంద్రబాబు నాయుడి హయాంలో ఓ వెలుగు వెలిగారు రేవంత్ రెడ్డి. చంద్రబాబుకు అత్యంత ఆప్తుడు నమ్మకస్తుడిగా పేరు గడించారు. ఆ అనుబంధంతోనే చంద్రబాబు చెప్పిన ఓ ఆపరేషన్ లో పాల్గొని తెలంగాణా ఏసీబీ పోలీసులకు అడ్డంగా దొరికి జైలుకు కూడా వెళ్లారు రేవంత్ రెడ్డి. అప్పట్లో తెలంగాణా ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ను ప్రలోభ పెట్టడానికి డబ్బుతో సహా ఆయన ఇంటికి వెళ్లిన రేవంత్ రెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు చెప్పినట్లు వింటే డబ్బుకు డబ్బు పదవికి పదవి వస్తుందని ప్రలోభ పెట్టారు. ఏం కావాలంటే అది జరుగుతుందని బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే ఆ బేరసారాలన్నీ రికార్డు కావడంతో రేవంత్ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి అరెస్ట్ కావలసి వచ్చింది. సరే ఆ ఎపిసోడ్ ను పక్కన పెడితే చంద్రబాబుకు అంత సన్నిహితంగా మెలిగిన రేవంత్ రెడ్డే ఆ తర్వాత టిడిపికి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. రేవంత్ టిడిపిని వీడటం టిడిపికి ద్రోహం చేయడం కాదా అని రాజకీయ పండితులు నిలదీస్తున్నారు.

ఎర్రబెల్లి టిడిపిని వీడి బి.ఆర్.ఎస్. లో చేరితే ద్రోహం అవుతుంది కానీ రేవంత్ రెడ్డి టిడిపిని వీడి కాంగ్రెస్ లో చేరితే అది మోసం ఎందుకు కాదని వారు ప్రశ్నిస్తున్నారు. గురివింద గింజ తన ఎరుపు ఎరగదన్నట్లు రేవంత్ రెడ్డి తన తప్పును మర్చిపోయి ఎర్రబెల్లి తప్పును మాత్రమే చూస్తే ఎలా అని వారు సెటైర్లు వేస్తున్నారు. అయితే రేవంత్ రెడ్డి అనాలోచితంగా ఎర్రబెల్లిపై వ్యాఖ్యలు చేయలేదని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. ఒక వ్యూహం ప్రకారమే రేవంత్ ఉద్దేశ పూర్వకంగానే టిడిపి అంశాన్ని తెరపైకి తెచ్చారని వారు అనుమానిస్తున్నారు. నిజానికి రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత పార్టీలోని సీనియర్లంతా రేవంత్ పై చేస్తోన్న విమర్శకూడా అదే. టిడిపి నుండి వచ్చిన రేవంత్ కి ఆ పదవి ఎలా కట్టబెట్టారనే. ఆతర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ను తెలంగాణ టిడిపి నేతలతో నింపేస్తూ పదవులన్నీ టిడిపి నుండి వలస వచ్చిన రేవంత్ మనుషులకే ఇచ్చుకుంటున్నారని కూడా సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనపై కాంగ్రెస్ లో ఇంత రచ్చ జరుగుతోన్న నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి టిడిపిని పేదల పార్టీ అంటూ మెచ్చుకోవడం టిడిపికి ఎర్రబెల్లి ద్రోహం చేశారనడం వెనుక ఏదో ఒక ఆంతర్యం ఉందంటున్నారు రాజకీయ పండితులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణాలో టిడిపికి మంచి క్యాడర్ ఉంది. అలాగే మంచి బలం కూడా ఉంది. విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లోనూ టిడిపి బిజెపితో కలిసి 20కి పైగా స్థానాలు గెలుచుకుంది. కాకపోతే ఆ తర్వాత ఆ ఎమ్మెల్యేలంతా బి.ఆర్.ఎస్. లో చేరిపోయారు. అటు కేసీయార్ కూడా తెలంగాణాలోని టిడిపి ఓటు బ్యాంకును బి.ఆర్.ఎస్. వైపు ఆకర్షించడంలో విజయవంతమయ్యారు. పలు ఎన్నికల్లో సీమాంధ్ర సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఆ ఓట్లు బి.ఆర్.ఎస్. కే పడ్డమే దానికి నిదర్శనం. 2014 ఎన్నికల్లో టిడిపి తరపున మల్కాజగిరిలో పోటీ చేసిన మల్లారెడ్డి ఎంపీ అయ్యారు. ఆ తర్వాత ఆయన బి.ఆర్.ఎస్.లో చేరారు.

అయితే ఆ తర్వాత 2019 ఎన్నికల్లో అదే మల్కాజగిరి నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి టిడిపి ఓటు బ్యాంకు కారణంగానే గెలవగలిగారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకునే రేవంత్ రెడ్డి తెలంగాణా వ్యాప్తంగా నిద్రాణంగా ఉన్న టిడిపి ఓటర్లను తనవైపు తిప్పుకోడానికే టిడిపి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడి టిడిపి సంప్రదాయ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేసి ఉంటారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.
రేవంత్ రెడ్డి వ్యూహం వర్కవుట్ అవుతుందా లేదా అనేది ఇపుడే చెప్పలేం కానీ వర్కవుట్ అయితే కావచ్చు లేకపోతే లేదు. కానీ దాని వల్ల నష్టం అయితే ఉండదు కదా అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కాంగ్రెస్ ఓట్లు కాంగ్రెస్ కు ఎలానూ ఉంటాయి. దాంతో పాటు టిడిపి ఓట్లను కూడా ఆకర్షించగలిగితే కాంగ్రెస్ విజయానికి ఢోకా ఉండదన్నది రేవంత్ రెడ్డి వ్యూహం కావచ్చునంటున్నారు మేథావులు.

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తోన్న బి.ఆర్.ఎస్. నాయకత్వం దీనికి చెక్ చెప్పడానికి ఏదో ఒకటి చేయక మానదు. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. కు పరువు నిలిపిన స్థానాల్లో సీమాంధ్ర ఓటర్లదే మెజారిటీ. అంటే తెలంగాణా ఓటర్ల కన్నా సీమాంధ్ర ఓటర్లే కేసీయార్ వైపు నిలిచారు. ఆ ఓటు బ్యాంకును మరింత పదిలం చేసుకోవడానికి ఏంచేయాలో అన్నీ చేస్తారు కేసీయార్. టిడిపి గురించి సానుకూలంగా మాట్లాడ్డమే కాదు చంద్రబాబు నాయుడిపై తనకు ఇప్పటికీ అంతే గౌరవం ఉందని బహిరంగంగా చాటుకోవడం ద్వారా చంద్రబాబు సామాజికవర్గ ఓటర్లకు కూడా రేవంత్ తెలివిగా గేలం వేశారని నిపుణులు అంటున్నారు. దాని వల్ల కాంగ్రెస్ కు లాభమే తప్ప నష్టం ఏమీ ఉండదని వారంటున్నారు.

తెలంగాణాలో తటస్థంగా ఉన్న మాజీ టిడిపి నేతలతో పాటు బి.ఆర్.ఎస్. లో అసంతృప్తిగా ఉన్న టిడిపి నేతలను సైతం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేర్చుకునేందుకు వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే కొందరు మాజీ టిడిపి నేతలు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటన చేశారని వారు చెబుతున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి తెలంగాణాలో ఏదో ఒక మ్యాజిక్ చేయడం ఖాయమంటున్నారు ఆయన వర్గీయులు.