వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి మరోసారి సీబీఐ ముందుకు వెళ్తున్నారు. సీఎం జగన్మోహన్‌రెడ్డికి అవినాష్‌రెడ్డి సోదరుడి వరస. హత్యకు గురైంది ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్. అందుకే కేసులో అనుమానితుడిగా అవినాష్‌రెడ్డికి పిలుపు వచ్చినప్పుడల్లా ఇంత ఉలికిపాటు. కేసు విచారణ సీబీఐకి వెళ్లినప్పటినుంచీ కొత్త కొత్తపేర్లు తెరపైకొచ్చాయి. ప్రత్యక్ష పాత్రధారులు చిన్నవాళ్లయినా తెరవెనుక సూత్రధారులు పెద్దవాళ్లన్న అనుమానం మొదట్నించీ ఉంది. దీనికి తగ్గట్లే వైఎస్ కుటుంబ బంధువుల పేర్లు కలకలం రేపాయి.
అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి చుట్టూ వైఎస్ వివేకా మర్డర్ కేసు మిస్టరీగా ఉంది. పోయిన్సారి విచారణకు పిలిచినప్పుడు కొంత సమయం తీసుకుని హాజరయ్యారు అవినాష్‌రెడ్డి. మళ్లీ సీబీఐ ముందు ఆయన హాజరవుతున్నారు. ఈసారి విచారణ వివరాలు తీసుకుని పంపించేసేలా ఉండకపోవచ్చు. మూడువారాలు గడవకముందే సీబీఐ మళ్లీ పిలవటంతో అంతకుముందు విచారణలో సేకరించిన వివరాలపై ప్రశ్నించబోతోందన్నమాట. అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కరరెడ్డిని ఇంటి దగ్గరే విచారించేందుకు సీబీఐ అంగీకరించింది. కానీ కడప ఎంపీని మాత్రం తమ కార్యాలయానికే పిలిపించటంతో కేసులో కీలక మలుపు ఉండొచ్చన్న అంచనాలున్నాయి.
అవినాష్‌రెడ్డిని మొదటిసారి విచారించినప్పుడు ఆయన కాల్‌డేటా ఆధారంగానే సీబీఐ మరికొందరిని అనుమానించింది. ఇప్పుడు రెండోసారి పిలుస్తోందంటే మ్యాటర్ సీరియస్సేనంటున్నారు. వైఎస్ వివేకా హత్యగురించి పనిమనిషి అందరికీ చెప్పాకే తమకూ తెలిసిందన్నది మొదట్లో అవినాష్‌రెడ్డి వెర్షన్. అయితే ఆయన కాల్‌డేటాలో తెల్లవారుజామునే కొందరికి ఫోన్లుచేశారన్న ఆధారాలు దొరికాయంటున్నారు. దీంతో ఈసారి ఎంక్వయిరీలో కాల్‌డేటానే కీలకమయ్యేలా ఉంది. ఎంక్వయిరీలో మరికొన్ని వివరాలు సేకరించి మళ్లీ పిలుస్తామని పంపించేస్తారా లేదంటే అంతకుమించి ఏమన్నా జరగొచ్చా అన్నదానిపై వైఎస్ కుటుంబంతో పాటు వైసీపీ వర్గాల్లో కూడా ఉత్కంఠ పెరుగుతోంది.
పక్కా ఆధారాలతో సీబీఐ ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్ట్‌చేసేదాకా వస్తే అది రాజకీయంగా వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి దెబ్బే. ఎందుకంటే బాబాయ్ హత్యకేసులో విచారణ వేగంగా జరిగేలా ఆయన చర్యలు తీసుకోలేదన్న అపనింద ఉండనే ఉంది. స్వయానా ఆయన సోదరి వివేకా కూతురు సునీత ఆంధ్రప్రదేశ్‌లో విచారణ సజావుగా సాగదంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌తోనే కేసు విచారణను తెలంగాణకు మార్చారు. అయినవాళ్లే ఈ దారుణానికి ఒడిగట్టారన్న సునీత అనుమానాలకు సీబీఐ విచారణలో బయటికొస్తున్న నిజాలు బలం చేకూరుస్తున్నాయి. సీఎం సొంత జిల్లాకు చెందిన మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి చెప్పినదాని ప్రకారం కేసు కీలకఘట్టానికి చేరుకున్నట్లే కనిపిస్తోంది. ఒకవేళ అంతా ఊహిస్తున్నట్లే జరిగితే వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఆత్మరక్షణలో పడాల్సి వస్తుంది.