ద‌టీజ్ జ‌గ‌న్‌.. దేనిక‌యినా ద‌మ్ముండాలి!

By KTV Telugu On 22 February, 2023
image

ఒక‌ప్పుడు కీల‌క‌ప‌ద‌వుల‌న్నీ అగ్ర‌వ‌ర్ణాల‌కే. క‌మ్మ‌లు, రెడ్లు ఇత‌ర అగ్ర‌వ‌ర్ణాలే ప్ర‌భుత్వాల్లో పెత్త‌నం చెలాయించేవి. త‌ప్ప‌ద‌న్న‌ట్లు ఒక‌టిరెండు ప‌ద‌వులు ఎస్టీల‌కు, మ‌రీ బాగోద‌ని ఓ పోస్టు మైనారిటీల‌కు ఇచ్చే సంప్ర‌దాయ‌మే తెలుగురాష్ట్రాల్లో ద‌శాబ్దాలుగా సాగుతోంది. ఏమాట‌కామాటే చెప్పుకోవాలి. వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ముఖ్య‌మంత్రి అయ్యాక అదే ట్రెండ్ ఫాలో కాలేదు. త‌న‌దైన ట్రెండ్ సెట్ చేస్తున్నారు. త‌మ వెన‌కాల తిరగాల్సిన వాళ్ల‌కు ఈ ప‌ద‌వీయోగం ఏమిట‌ని అగ్ర‌వ‌ర్ణ నేత‌లు ఎంత గింజుకుంటున్నా తాను చేయాల్సింది చేసుకుంటూ పోతున్నారు.

ఏపీలో వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ప‌ద‌వుల్లో బీసీలకే పెద్ద‌పీట వేస్తూ వ‌స్తున్నారు. వారి మీద ప్రేమ కారిపోతోందా లేదంటే రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కోస‌మా అన్న‌ది ప‌క్క‌న‌పెడితే క‌చ్చితంగా ఇదో విప్ల‌వాత్మ‌క మార్పు. రేపు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మ‌ళ్లీ అధికారంలోకి వ‌చ్చినా రాక‌పోయినా ఎవ‌రు అధికారంలో ఉన్నా దీన్ని బ్రేక్ చేస్తే వ్య‌తిరేక‌త మూట‌గ‌ట్టుకోవాల్సిందే. ఏపీలో ఖాళీఅయిన ఎమ్మెల్సీ సీట్ల‌లో మెజారిటీ పోస్టుల్ని బీసీలు, ఎస్టీ ఎస్టీ మైనారిటీల‌తో భ‌ర్తీచేయ‌డం మ‌రో సాహ‌సోపేత‌మైన చ‌ర్య‌గానే చెప్పాలి.

ఇన్ని ప‌ద‌వులు వ‌చ్చిప‌డితే రెడ్ల‌కు ద‌క్కింది ఒకే ఒక్క ప‌ద‌వి. అదికూడా సీఎం సొంత‌జిల్లాలో టీడీపీనుంచి వ‌చ్చిన జ‌మ్మ‌ల‌మ‌డుగు నేత రామసుబ్బారెడ్డికి. ఏపీలో త‌మ ప్ర‌భుత్వ‌మే అధికారంలో ఉంద‌ని సంబ‌ర‌ప‌డాలో ఉండీ త‌మ‌కేమీ ఒర‌గ‌డం లేద‌ని బాధ‌ప‌డాలో తెలీక కుత‌కుత‌లాడిపోతోంది రెడ్డి సామాజిక‌వ‌ర్గం. క‌నీసం నాలుగోవంతు అంటే నాలుగుసీట్ల‌న్నా క‌చ్చితంగా ఇస్తార‌ని రెడ్డివ‌ర్గం న‌మ్మ‌కం పెట్టుకుంది. కానీ సొంత‌వ‌ర్గంకంటే సామాజిక స‌మీక‌ర‌ణాలే ముఖ్య‌మ‌నుకున్నారు జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. 18మందికి ప‌ద‌వులిస్తే అందులో 14మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వ‌ర్గాల నేత‌లే.

కాంగ్రెస్ హ‌యాంలోనైనా టీడీపీ పాల‌న‌లోనైనా సామాజిక‌వ‌ర్గాల ప‌రంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఎప్పుడూ ఇంత ప్రాధాన్యం ద‌క్క‌లేదు. టీడీపీ అంటే క‌మ్మ‌పార్టీ అనీ వైసీపీ అంటే రెడ్ల‌పార్టీ అనీ జ‌న‌సేనంటే కాపులపార్టీ అని నేత‌లు కులాల‌వారీగా పంచేసుకున్నారు. కానీ ఈ ట్రెండ్‌ని బ్రేక్‌చేసిన క్రెడిట్ మాత్రం జ‌గ‌న్‌దే. ఏడాదిన్న‌ర లోపే ఎన్నిక‌లు రాబోతున్నాయి. కేవ‌లం రెడ్లు ప‌ల్ల‌కీమోస్తే అధికారంలోకి రాలేద‌న్న విష‌యం జ‌గ‌న్‌కి తెలుసు. అందుకే అన్నివ‌ర్గాల‌నూ సంతృప్తిప‌రుస్తున్నారు. ఆ క్ర‌మంలో సొంత‌వ‌ర్గం అసంతృప్తికి గురైనా రాజ‌కీయంగా వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేద‌నుకుంటున్నారు. రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలు చూసుకోని పార్టీలు ఉండ‌వు. కానీ ఆ ప్ర‌య‌త్నంలో సామాజిక అంత‌రాలు ఎంతోకొంత పూడితే అంద‌రికీ మంచిదే.