ఐఏఎస్ వ‌ర్సెస్ ఐపీఎస్‌.. సిగ్గుసిగ్గు!

By KTV Telugu On 22 February, 2023
image

ఐఏఎస్ అంటేనే డిగ్నిటీ. ఐపీఎస్ అంటే గౌర‌వం. ప్ర‌భుత్వ‌యంత్రాంగంలో ఇద్ద‌రూ చెరోక‌న్నులాంటివ‌వారు. ఉన్న‌త‌చ‌దువుల‌తో త‌మ తెలివితేట‌ల‌తో ఎవ‌ర‌యినా ఆ స్థాయికి ఎదుగుతారు. అక్క‌డ‌క్క‌డా క‌లుపు మొక్క‌లు ఎక్క‌డ‌యినా ఉంటాయి. కానీ మెజారిటీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల‌కు జీవితంలో త‌మ‌ను తాము నిరూపించుకోవాల‌న్న ల‌క్ష్య‌మే ఉంటుంది. కొన్నిచోట్ల సేమ్ కేడ‌ర్ మ‌ధ్య పంతాలు ప‌ట్టింపులు వ‌స్తాయి. కొన్ని ఫిర్యాదుల‌దాకా వెళ్తాయి. ఎంత‌పెద్ద స‌మ‌స్య‌యినా ప్ర‌భుత్వ ప‌రిధిలో అంత‌ర్గ‌తంగా ప‌రిష్కార‌మ‌వుతుంటుంది. కానీ క‌న్న‌డ‌నాట మ‌హిళా ఐఏఎస్‌, ఐపీఎస్‌ల మ‌ధ్య ర‌చ్చ ఈ స్థాయికి ఎదిగినా ఇంత‌గా దిగ‌జార‌గ‌ల‌రా అని అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

క‌ర్నాట‌క‌లో రూప‌, రోహిణి పేర్లు అంద‌రి నోళ్ల‌లో నానుతున్నాయి. రోహిణి సింధూరి ఐఏఎస్ అధికారిణి. రూప ఐపీఎస్ ఆఫీస‌ర్‌. కొళాయిల ద‌గ్గ‌ర జుట్టుప‌ట్టుకుని కొట్టుకుంటున్న‌ట్లే ఉంది ఇద్ద‌రి మ‌ధ్యా పంచాయితీ. వేర్వేరు స‌ర్వీసుల్లో ఉన్నా గ‌తాల్ని త‌వ్వుకుంటున్నారు. వ్య‌క్తిగ‌త‌జీవితాల‌ను బ‌జారుకి లాగుతున్నారు. ఐఏఎస్ రోహిణి సింధూరి ప్ర‌యివేటు ఫొటోల‌ను రిలీజ్ చేసి వివాదాన్ని మ‌రింత దిగ‌జార్చేసింది ఐపీఎస్ రూప‌. రోహిణి స్వయంగా మగ అధికారుల‌కు వాటిని పంపించిందని రూప ఆరోపించింది. వాటిలో ర‌హ‌స్య‌మేమీ లేద‌ని అవి తాను సోష‌ల్‌మీడియాలో పెట్టిన‌వేనంటోంది రోహిణి. కాస్త అభ్యంత‌క‌రంగానే ఉన్న ఫొటోల‌ను ఓ ఐఏఎస్ అలా ఎలా సోష‌ల్‌మీడియాలో పెట్టేస్తుందో అర్ధంకాని విష‌యం. ప‌బ్లిక్‌లోకొస్తే ఎవ‌రు ఏమ‌న్నా అంటారు. రూప చేస్తోంది అదే. ప‌రువుపోయాక రూప‌మీద చీఫ్ సెక్ర‌ట‌రీకి ఫిర్యాదుచేసింది ఐఏఎస్ రోహిణి.

మ‌హిళా అధికారుల వ్య‌వ‌హారం శృతిమించటంతో ప్ర‌భుత్వం ఇద్ద‌రినీ బాధ్య‌త‌ల‌నుంచి త‌ప్పించింది. ఎక్క‌డా పోస్టింగ్ ఇవ్వ‌లేదు. అస‌లు ఇద్ద‌రి మ‌ధ్యా ఎందుకు తేడావ‌చ్చింద‌ని ఆరాతీస్తే రెండేళ్లుగా ఉప్పునిప్పులా ఉంటున్నారువాళ్లు. మొద‌ట్లో ఇద్ద‌రికీ సిన్సియ‌ర్ ఆఫీస‌ర్ల‌న్న పేరుండేది. వ్య‌క్తిగ‌త వైరాల‌తో చివ‌రికి ఇలా భ్ర‌ష్టుప‌ట్టారు. నిజాయితీప‌రుడైన డీకే రవి అనే ఐఏఎస్ అధికారి ఆత్మహత్య కేసులో రోహిణి సింధూరి పేరు అప్పట్లో వినిపించింది. ఇప్పుడు ప్ర‌యివేటు ఫొటోల‌తో స‌హ‌జంగానే అంద‌గ‌త్తె అయిన ఆ ఐఏఎస్ చ‌ర్చ‌నీయాంశ‌మైంది. గ‌తంలో శిల్ప‌నాగ్ అనే మ‌హిళా ఐఏఎస్‌తోనూ రోహిణికి ఇలాంటి వివాద‌మే న‌డిచింది. అప్పుడు కూడా ఆమెపై బ‌దిలీవేటు ప‌డింది.

మ‌రో విష‌యం ఏంటంటే ఇంత‌గా కంపు ప‌ట్టిన రోహిణిసింధూరి తెలుగుమ‌హిళ కావ‌డం. స‌ర్వీస్‌లో చేరిన కొత్త‌లో మంచిపేరున్నా చేజేతులాల త‌నే చెడగొట్టుకుంది. మైసూరు డిప్యూటీ క‌మిష‌న‌రుగా ఉన్న‌ప్పుడు అధికారిక నివాసంలో స్విమ్మింగ్‌పూల్‌, జిమ్ కోసం అర‌కోటి ఖ‌ర్చుపెట్టింది. అప్పుడు మైసూర్ క‌మిష‌న‌ర్‌గా ఉన్న శిల్ప‌నాగ్ దీన్ని వ్య‌తిరేకించింది. దీంతో ఇద్ద‌రి మ‌ధ్యా ర‌చ్చ మొద‌లైంది. రోహిణి క‌క్ష‌సాధింపు చ‌ర్య‌ల‌కు దిగితే రాజీనామా చేస్తాన‌న్న శిల్ప‌కు కార్పొరేట‌ర్లు అండ‌గా నిలిచి ఆందోళ‌న‌కు దిగారు. దీంతో ఇద్ద‌రినీ ప్ర‌భుత్వం వేరేచోటికి బ‌దిలీచేసింది. ఇప్పుడు తాజా గొడ‌వ‌లో పోస్టింగ్ ఇవ్వ‌కుండా మ‌హిళా అధికారులిద్ద‌రినీ ప‌క్క‌న‌పెట్టింది. రెండు కొప్పులు ఓ చోట‌క‌లిస్తే యుద్ధ‌మే. ఏ స్థాయివార‌యినా ఇద్ద‌రు ఆడవాళ్ల మ‌ధ్య ఎప్పుడూ స‌యోధ్య కుద‌ర‌నే కుద‌ర‌దంతే.