కొత్త చోటుకి వెళ్తే ఓ పట్టాన అడ్జస్ట్ కాలేరు చాలా మంది. కొత్త చోటు అలవాటు అయితే కానీ అక్కడ కుదురుగా ఉండలేరు. ఎంత కొత్త చోటులోనైనా అలవాటు పడచ్చు కానీ కాషాయం పార్టీలో మాత్రం కుదురుకోవడం ఓ పట్టాన కుదిరే పనే కాదంటున్నారు రాజకీయ పండితులు. కాషాయ కషాయం అలవాటు పడ్డానికి ఏళ్లు కూడా సరిపోకపోవచ్చని వారంటున్నారు. అందుకే కమలం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారు అక్కడ ఇమడలేక ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారని వారు చెబుతున్నారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలోంచి ఏ రాజకీయ పార్టీలోకి అయినా మారచ్చు. గోడ దూకినంత మాత్రాన కంగారు పడాల్సింది ఏమీ ఉండదు. నాలుగురోజులు అయితే అంతా మామూలు అయిపోతుంది. అదే ఏ రాజకీయ పార్టీ నుంచి అయినా భారతీయ జనతా పార్టీలోకి జంప్ చేస్తే మాత్రం అక్కడ ఇమడలేక ఊపిరాడక ఇబ్బందులు పడుతూ ఉంటారు.
అలా ఉక్కిరి బిక్కిరి అయ్యే ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఊపిరి సలపక బిజెపిలో ఇమడలేక కమలం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీ మారడానికి కారణం బిజెపి మౌలిక సిద్ధాంతానికి ఆయన ఇంత వరకు అలవాటు పడలేకపోవడమే. ఎంత సేపూ తన ఆలోచనలు తన రాజకీయాలు తన అజెండాల ప్రకారమే పార్టీ ముందుకు నడవాలని కన్నా అనుకుని ఉంటారు. అది బిజెపిలో అసాధ్యం కాబట్టే ఆయన అందులో కొనసాగే వాతావరణం లేకుండా పోయిందంటున్నారు రాజకీయ పరిశీలకులు. అసలు దేశంలోనే మిగతా రాజకీయ పార్టీలన్నీ ఒక ఎత్తయితే బిజెపి ఒకటీ ఒక ఎత్తు. బిజెపిలో ఉండే సిద్ధాంతం ఏ రాజకీయ పార్టీలోనూ ఉండదు. కాంగ్రెస్ పార్టీ అయితే అసలు సిద్దాంతాలే ఉండవు. ఎంత కొత్త వారైనా వచ్చిన మరుక్షణమే కాంగ్రెస్ లో అడ్జస్ట్ అయిపోగలరు. అదే కాంగ్రెస్ గొప్పతనం. ఈ వెసులు బాటు బిజెపిలో ఉండదు. అందుకే రాజకీయ అవసరాల కోసం పదవులకోసం బిజెపిలో చేరిన నేతలు కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఏపీలో కన్నా లక్ష్మీనారాయణే కాదు కాంగ్రెస్ నుండి వచ్చి చేరిన పురంధేశ్వరి పరిస్థితీ అంతే. ఆమెకు మరో గత్యంతరం లేకనే మౌనంగా బిజెపిలో కొనసాగుతున్నారు తప్ప బిజెపిలో అంతా బాగుండి మాత్రం కాదంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఇక ఆమెకు ముందు 2019 ఎన్నికల్లో ఏపీలో టిడిపి ఘోర పరాజయం అనంతరం ఒకే సారి నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపిలోకి దగ్గరుండి పంపించారు చంద్రబాబు నాయుడు. సుజనా చౌదరి, సిఎం రమేష్, టి.జి.వెంకటేష్ తో పాటు గరికపాటి మోహన రావు బిజెపిలో చేరారు. వారు పేరుకు బిజెపి ఎంపీలుగా కొనసాగుతూ వచ్చారు కానీ బిజెపి సిద్ధాంతాన్ని కానీ ఆలోచనా ధోరణిని కానీ ఈ నాటికీ అలవర్చుకోనూ లేదు కనీసం అర్ధం చేసుకోను కూడా లేదు. వాళ్లు బిజెపిలో ఉంటూనే టిడిపి వాణిని వినిపిస్తూ ఉంటారు. ప్రత్యేకించి చంద్రబాబు అజెండాకు అనుగుణంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వారిని బిజెపిలోకి పంపించిందే అందుకు కాబట్టి వారు ఆ పనిలోనే బిజీగా ఉంటారు.
ఇక ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ లాగే తెలంగాణాలో సీనియర్ రాజకీయ నేత ఈటల రాజేందర్ కూడా బిజెపిలో అసహనంగానే ఉన్నారని సమాచారం.
కేసీయాఆర్ పార్టీలో ఉన్నప్పుడు ఆయన నెంబర్ టూ గా వెలిగారు. కీలక మంత్రి పదవులు అనుభవించారు. పార్టీలోనూ ప్రభుత్వంలోనూ చక్రం తిప్పారు. అయితే కేసీయార్ తో తేడా రావడంతో ఆయన పార్టీ మారాల్సి వచ్చింది. ఉప ఎన్నికల సమయంలో ఏదో ఒక పార్టీ అండ ఉండాలి కాబట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అండ ఉంటే మంచిది కాబట్టి ఆయన బిజెపిలో చేరారు తప్పితే బిజెపి సిద్ధాంతాలకు ఆర్షితులై కాదు. బిజెపిలో తనకి కీలక పదవులు వస్తాయని ఆయన ఆశలు పెట్టుకున్నారు తెలంగాణా బిజెపి అధ్యక్ష పదవి కూడా వచ్చి వరిస్తుందనుకున్నారు. కానీ అవేవీ జరక్క పోవడంతో చాలా బోరుగా ఫీలవుతున్నారు. ఆయన ఏ క్షణంలోనైనా ఏ పార్టీలోకి అయినా జంప్ చేస్తే ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు రాజకీయ పండితులు. సరియైన అదను కోసం అవకాశం కోసమే ఆయన ఎదురు చూస్తున్నారన్నది వారి వాదన. ఆ అవకాశం బి.ఆర్.ఎస్. నుండి వచ్చినా కూడా ఆయన జార విడుచుకోకపోవచ్చునని అంటున్నారు.
ఈటలే కాదు కాంగ్రెస్ నుండి బిజెపిలోకి జంప్ చేసిన డి.కె.అరుణ కానీ మర్రిశశిధర రెడ్డి కానీ బిజెపిలో హ్యాపీగా ఏమీ లేరు.
బిజెపి సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉండే కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘం కాలం కొనసాగిన ఈ నేతలు రాజకీయ పరిస్థితుల కారణంగా కాంగ్రెస్ లో కొనసాగే పరిస్థితి లేక మాత్రమే బిజెపిలో చేరారు. అయితే అక్కడ వీళ్లకి ఊపిరాడ్డం లేదు. సూది మొనంత దారి కనిపించినా దారం మొనంత ఆధారం దొరికినా వెంటనే బిజెపికి గుడ్ బై చెప్పడానికి ఈ వలస నేతలు సిద్దంగానే ఉంటారని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూ రావడం అదే సమయంలో బిజెపి బలపడుతూ రావడం వల్ల చాలా మంది కాంగ్రెస్ నేతలకు మరో దారి లేక బిజెపిలో చేరుతున్నారు కానీ సంఘ్ పరివారపు సిద్ధాంతాలు కానీ ఆలోచనలపై కానీ వారికి ఏ మాత్రం అవగాహన లేదనేది వాస్తవం.
మధ్యప్రదేశ్ లో సంప్రదాయ కాంగ్రెస్ వాద కుటుంబం నుండి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ అధినాయకత్వమే తనకి అన్యాయం చేసిందన్న ఆక్రోశంతో ఉండబట్టి కాంగ్రెస్ కు గుణపాటం చెప్పేందుకు బిజెపిలో చేరారు. జ్యోతిరాదిత్యతో పాటు ఆయన అనుచరులూ బిజెపిలో చేరడంతో మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం కుప్పకూలి అక్కడ బిజెపి ప్రభుత్వం ఏర్పాటు అయ్యింది. అందుకు బదులుగానే జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రి పదవి ని ఇచ్చి బిజెపి బాగా చూసుకుంటోంది.
అస్సాంలో కాంగ్రెస్ పార్టీ నుండి బిజెపిలో చేరి హిమాంత బిశ్వశర్మ అయితే ఏకంగా బిజెపి లో అమాంతం ఎదిగిపోయి అస్సాం ముఖ్యమంత్రి అయిపోయారు. అలాగే జనతాదళ్ కు చెందిన బసవరాజ్ బొమ్మయ్ కూడా బిజెపిలో చేరి కర్నాటక ముఖ్యమంత్రి అయిపోయారు. ఈ ఇద్దరిలో అస్సాం ముఖ్యమంత్రి అయితే సంఘ్ పరివార్ నేపథ్యం నుండి వచ్చిన బిజెపి ముఖ్యమంత్రులకన్నా కూడా బలంగా బిజెపి అజెండాను సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోతూ పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు. ఇతర పార్టీల నుండి బిజెపిలోకి వచ్చేవారు దాని సిద్ధాంతాన్ని అర్దం చేసుకుని పార్టీ అజెండా ప్రకారం నడుచుకుంటే రాజకీయంగా మంచి పదవులు వస్తాయనడంలో అనుమానాలే అవసరం లేదంటున్నారు ఆరెస్సెస్ భావజాలికులు. అలా కాకుండా తమ సొంత అజెండాలను బిజెపిపై రుద్దాలనుకుంటే మాత్రం చేదు అనుభవాలు తప్పవని వారంటున్నారు. రాజకీయ అవసరాల కోసమే ఎక్కువ మంది బిజెపిలో చేరుతున్నారే తప్ప దాని సిద్దాంతాలు నచ్చి అయితే కాదంటున్నారు రాజకీయ పండితులు. అసలు సిద్దాంతాలు విలువలు అంటేనే మెజారిటీ రాజకీయ నాయకులకు ఆముదం తాగినట్లు ఉంటుందని వారు అంటున్నారు.