డైలమాలో పవన్ కళ్యాణ్.. వెయ్యి కోట్ల ఆఫర్ పై మౌనం

By KTV Telugu On 22 February, 2023
image

జగన్ వ్యూహమో ప్రశాంత్ కిషోర్ మంత్రాంగమో తెలియదు కానీ జనసేనా నాయకుడు పవన్ కళ్యాణ్ అయోమయ స్థితిలో పడిపోయారు. జగన్ చాలా తెలివిగా రాజకీయాలను వైసీపీ వర్సెస్ టీడీపీగా మార్చెయ్యడంతో పొలిటికల్ స్పేస్ లో పవన్ కళ్యాణ్ లేకుండా పోయారు. వారం రోజులుగా ఆట మొత్తం జగన్ పార్టీకి, చంద్రబాబు అనుచరులకు మధ్యే జరుగుతోంది. దానితో జనసేనను జనం మరిచిపోయారా లేక జనసేనాని సైడైపోయారా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కులాల కుమ్ములాట జరుగుతోంది. ఆట మొత్తం కమ్మ వర్సెస్ రెడ్డి అన్నట్లుగా సాగుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏదోక సైడ్ తీసుకోవడమే జరుగుతోంది. జగన్ ప్లాన్ కూడా అదే. కాపులను ఎదగనిస్తే వాళ్ల వేగాన్ని దూకుడును తట్టుకోవడం కష్టం. అందుకే వారికి ఎక్కువ ప్రాధాన్యం లేకుండా వారిని చీల్చే ప్రక్రియను జగన్ సమర్థంగా అమలు చేస్తున్నారు.పైగా పంచ్ డైలాగులతో ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టే పవన్ అంటే జగన్ కు అసలు గిట్టదు. అందుకే ఆయన్ను పూర్తిగా దెబ్బకొట్టాలంటే టీడీపీని నిత్యం వార్తల్లో ఉండేట్టుగా చూసుకోవాలి. మీడియా మొత్తం టీడీపీపై ఫోకస్ చేస్తే జనసేనను పట్టించుకునే వారు ఉండరని జగన్ ఆలోచనా విధానం.

పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రెండు సార్లు చంద్రబాబు పవన్ కలిసిన తర్వాత ఇరు పార్టీ కార్యకర్తల్లో జోష్ పెరిగింది. పొత్తు కుదిరిన స్థాయిలో కొన్ని చోట్ల వాళ్లు కలిసి పనిచేయాలనుకుంటున్నారు. అయితే సరైన దిశానిర్దేశం లేక ఆలోచనలో పడుతున్నారు. పై నుంచి సంకేతాలు రాకపోవడం వారికి ఇబ్బందిగా మారుతోంది. ఏం చేయాలో తెలీక నానా తంటాలు పడటమే వారి వంతయ్యింది. పైగా ఫలానా నియోజకవర్గాలు జనసేనకు కేటాయించే అవకాశం ఉందని లీకులు వదలడంతో క్షేత్రస్థాయిలో ఇప్పుడు సమస్యలు ఎదురవుతున్నాయి. ఇంతకాలం అక్కడ పార్టీ కోసం పనిచేసిన టీడీపీ శ్రేణులు ఆయా స్థానాలను జనసేనకు వదులుకునేందుకు వెనుకాడుతున్నాయి. ఈ పరిస్తితి తర్వాతి కాలంలో మరిన్ని ఇబ్బందులకు దారి తీసే అవకాశం ఉంది. పార్టీల అగ్రనేతలు మాత్రం ఆ దిశగా చర్చలు జరపడం లేదు ఇప్పుడే తొందరేమిటన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు.

వారాహి యాత్ర ఎందుకు జాప్యమవుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. వాహనానికి పూజ నిర్వహించి చాలారోజులైంది. నిజానికి నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకేసారి జనవరి ఆఖరి వారంతో యాత్ర చేస్తారని వార్తలు వచ్చాయి. లోకేష్ యాత్ర ప్రారంభించి మూడు వారాలు దాటుతోంది. పవన్ యాత్ర మాత్రం అతీ గతీ లేదు. దానితో ప్రత్యర్థుల విమర్శలకు అవకాశం ఇచ్చినట్లయ్యింది. చంద్రబాబును సంతోష పెట్టేందుకే పవన్ కళ్యాణ్ తన వారాహి యాత్రను నిరవధికంగా వాయిదా వేశారని వైసీపీ ఆరోపిస్తోంది. పైగా పవన్ ను చంద్రబాబు దత్తపుత్రుడని కూడా జగన్ పిలుస్తుంటారు.

అసలు యాత్ర ఎందుకు ఆలస్యమవుతుందో చెప్పేందుకు పవన్ ఇష్ట పడటం లేదా లేక చెప్పలేకపోతున్నారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న అవుతోంది. మరో పక్క మీడియాలో వస్తున్న కథనాలకు కూడా జనసేన నాయకుడు గట్టిగా సమాధానం ఇవ్వలేకపోతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వెయ్యి కోట్ల ఆఫర్ వ్యవహారం రెండు రోజుల పాటు హల్ చల్ చేసింది. కాపులను ఒక్క పక్కకు తీసుకురాగలిగితే పవన్ సీఎం అవుతారని అందుకు వెయ్యి కోట్లు తాము ఖర్చు చేస్తామని కేసీఆర్ అన్నట్లుగా మీడియా కథనాలు వచ్చాయి. దానితో జనసైనికులు కొందరు గట్టిగా కౌంటరిచ్చారే తప్ప పవన్ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. బలమైన మీడియా సంస్థలతో పెట్టుకోవడమెందుకులే అని పవన్ మౌనం వహించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

అయితే ప్యాకేజీ స్టార్ అన్నందుకు చెప్పుతో కొడతానని పవన్ కళ్యాణ్ హెచ్చరించిన సంగతిని గుర్తుచేస్తూ మరి వెయ్యి కోట్ల రాతల వాళ్లని ఏం చేస్తావని వైసీపీ వాళ్లు తెగ సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఉదాసీనంగా మారుతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకాలం ఏదోక అంశాన్ని పట్టుకుని పవన్ జనంలోకి వచ్చేవారు. బాధితులను ఆదుకునేందుకు చెక్కులు ఇచ్చేవారు. నెల రోజులుగా పవన్ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. దేనికైనా ట్వీట్లతో సరిపెడుతున్నారు. ఈ పరిస్తితి ఎందుకొచ్చిందని పార్టీ నేతలు మథనపడుతున్నారు. మరి పవనే దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది.