జనవాసాల్లో భూకంపం వస్తే భారీ భవనాలు కూడా పేకమేడల్లా కూలిపోతాయి. కాగితపు బొమ్మల్లా ఊగిపోతాయి. అలాంటిది సువిశాల హిమాలయాల కింద భూమి కంపిస్తే ఏమవుతుంది ఊహించేందుకే భయమేస్తోంది కదూ. హిమాలయాలకు భూకంపం వస్తే జరిగేది వినాశనమే. సమీప భవిష్యత్తులో హిమాలయ ప్రాంతంలో భారీ భూకంపాలు సంభవించే అవకాశం ఉందని సైంటిస్టులు బాంబుపేల్చారు. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఈ భూకంప ప్రమాదాన్ని అంచనావేసి ముందే హెచ్చరిస్తోంది. హిమాలయాలకు భూకంపం వస్తే హిమోత్పాతం పెనువిపత్తుకు కారణమవుతుంది. ఆస్తినష్టం ప్రాణనష్టం అంచనాలకు అందని విధంగా ఉంటుంది.
హిమాలయాలకు భూకంప ముప్పు ఉందని తెలిసినా నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సిందేనా అంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవచ్చంటున్నారు ఎన్‌జీఆర్‌ఐ శాస్త్రవేత్తలు. దృఢమైన నిర్మాణాలతో ఆస్తి, ప్రాణనష్టాలను నివారించవచ్చంటున్నారు ఎన్‌జిఆర్‌ఐ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు. భూమి ఉపరితలం నిరంతరం కదలికలుండే అనేక పలకలతో రూపొందింది. శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం భారత్ భూగర్భంలోని ప్లేట్ ఏటా సుమారు ఐదు సెంటీమీటర్లు మారుతుంది. దీనివల్ల హిమాలయాల వెంట ప్రకంపనాలకు ఆస్కారం ఏర్పడుతుంది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ సహా నేపాల్ పశ్చిమ భాగానికి మధ్య భూకంప అంతరంగా పిలిచే ప్రాంతం ఎప్పుడైనా భూకంపాలకు గురయ్యే అవకాశం ఉందంటున్నారు శాస్త్రవేత్త డాక్టర్ పూర్ణచంద్రరావు.
మాగ్నిట్యూడ్‌లో 3.5 కంటే ఎక్కువ తీవ్రత ఉన్నప్పుడు భూకంప ప్రభావం కనిపిస్తుంది. హిమాలయాల వెంట పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న భవనాలు నిబంధనల ఉల్లంఘన, మెగా జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రకృతి వైపరీత్యాలను ఆహ్వానిస్తున్నాయి. డార్జిలింగ్ సిమ్లాలాంటి హిల్ స్టేషన్లు కూండా కాంక్రీట్ జంగిల్స్‌గా మారిపోతున్నాయి. నిర్దేశించిన ఎత్తును ఉల్లంఘిస్తూ వాలు ప్రాంతాల్లోనూ భవనాల నిర్మాణంతో డార్జిలింగ్ పట్టణ ప్రాంతాలలో భూకంపం సంభవిస్తే అపారనష్టం జరిగే ప్రమాదం ఉందంటున్నారు. మరోవైపు హిమాచల్‌ప్రదేశ్ హైడల్ ప్రాజెక్టుల కేంద్రంగా మారుతోంది. ఉత్తరాఖండ్ ఇప్పటిదాకా 6.5 తీవ్రతతో రెండు భూకంపాలను మాత్రమే చూసింది. ఉత్తరాఖండ్ ప్రాంతంలో ఉపరితలం కింద ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున పెద్దభూకంపం అనివార్యమంటున్నారు శాస్త్రవేత్త పూర్ణచంద్రరావు.
నిర్మాణలోపాలతోనే టర్కీలో భూకంపం వేలమంది ప్రాణాలు తీసింది. అపారనష్టానికి కారణమైంది. భూకంపాలను ఆపలేం. కానీ జాగ్రత్తపడితే నష్టాన్ని అరికట్టగలం. భూకంపాలు సంభవించే ప్రాంతాల్లో భవనాల ఉన్న మార్గదర్శకాలను పాటిస్తే ముప్పు చాలావరకు తగ్గుతుంది. కానీ ఎక్కడికక్కడ నిబంధనల ఉల్లంఘన జరుగుతోంది. విపత్తు పరిమాణం భౌగోళిక ప్రాంతం, జనాభా, నిర్మాణ నాణ్యతలాంటి అనేక అంశాలపై ఆధారపడి ఉండొచ్చు. టర్కీ అంతటి తీవ్ర భూకంపం మనదేశంలోనూ రావచ్చంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే కచ్చితమైన తేదీ, సమయాన్ని ఎవరూ అంచనా వేసే అవకాశం లేదు. ప్రకృతి సమతుల్యతను దెబ్బతీసినా ఆకాశమే హద్దన్నట్లు విర్రవీగినా ప్రకృతి ప్రకోపానికి మూల్యం చెల్లించకతప్పదు. ఆసేతు హిమాచలం కూడా దీనికి అతీతమేమీ కాదు.