ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ వాడకం అనేది సర్వసాధారణం అయింది. చాలా మందికి వారి రోజూవారి వ్యాపార, ఉద్యోగ, విద్య, ఆర్థిక కార్యకలాపాలకు మొబైల్ ఫోన్‌పై ఆధారపడక తప్పని పరిస్థితి ఉందిప్పుడు. టక్నాలజీ పెరిగిన తరువాత సెల్ ఫోన్ వినియోగం ఇంకా పెరిగింది. దాంతో పాటు సోషల్ మీడియా నేపథ్యంలో జరిగే నేరాలు కూడా పెరిగాయి. వీటి ప్రభావం యువతీ యువకులపై ఎక్కువగా పడుతోంది. ఈ సమస్యకు గుజరాత్ లోని ఠాకూర్ కమ్యూనిటీ పెద్దలు ఒక వింత పరిష్కారం కనుగొన్నారు. తమ సామాజిక వర్గానికి చెందిన పెళ్లి కాని అమ్మాయిలు మొబైల్ ఫోన్లు వినియోగించవద్దని ఆదేశించింది. బనాస్కాంత జిల్లాలోని భాభర్ తాలూకా లున్సేలా గ్రామంలో జరిగిన సంత్ శ్రీ సదారామ్ బాపూ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే గనిబెన్ ఠాకూర్ ఆధ్వర్యంలో కుల పెద్దలందరూ కలిసి తమ కమ్యూనిటీ నిబంధనల్లో కొన్ని సంస్కరణలు చేశారు. శుభకార్యాలు, నిశ్చితార్థం, పెళ్లిళ్లకు హాజరయ్యే అతిథుల సంఖ్యను కూడా పరిమితం చేశారు. నిశ్చితార్థానికి 11 మంది, వివాహానికి 51 మంది అతిథులకు మించి ఆహ్వానించవద్దని తీర్మానం చేశారు. ప్రతి గ్రామంలోనూ ఠాకూర్ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉండడంతో ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. వివాహ వేడుకల్లో వధూవరులకు బహుమతులకు బదులుగా నగదు ఇవ్వాలని సూచించారు. అంతేకాదు వివాహా ఊరేగింపుల్లో డీజేను ఉపయోగించడంపైనా నిషేధం విధించారు. తమ సామాజికవర్గం వారు ప్రతి ఒక్కరూ ఈ నియమనిబంధనలకు కట్టుబడి ఉండాలని ఉల్లంఘిస్తే జరిమానా తప్పదని హెచ్చరించారు. అయితే పై చదువుల కోసం ఇతర నగరాలకు వెళ్లే బాలికలకు అవసరమైన రవాణా సౌకర్యం సంఘమే భరించాలని మరో తీర్మానం చేశారు.
అన్నీ బాగానే ఉన్నా అమ్మాయిలు ఫోన్లు వాడవద్దని చెప్పడమే సబబుగా లేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే సెల్‌ఫోన్ వాడకం వల్ల అమ్మాయిలు తప్పుదారి పడతారని అందుకే దానిపై నిషేధం విధించామని సమాజం పెద్దలు సమర్థించుకుంటున్నారు. మరి అబ్బాయిలకు ఈ నిషేధం వర్తించదా అనే ప్రశ్నలకు వారు సమాధానం చెప్పలేదు.
గతంలో కులాంతర వివాహం విషయంలో ఠాకూర్ కమ్యూనిటీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమయ్యింది. తమ సమాజానికి చెందిన అమ్మాయి కానీ అబ్బాయి కానీ వారి కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటే దాన్ని నేరంగా పరిగణిస్తామని తీర్మానించారు. ఠాకూర్ వంశానికి చెందిన యువతీ యువకులు వేరే వర్గానికి చెందిన అమ్మాయిని పెళ్లాడితే రూ.2లక్షలు జరిమానా చెల్లించాలని 2019లో చేసిన తీర్మానంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పుడు పెళ్లికాని అమ్మాయిలు ఫోన్లు వాడొద్దని చేసిన తీర్మాణంపై కూడా చర్చ జరుగుతోంది.