రాజకీయాలు విచిత్రంగా మారిపోయాయి. సాంప్రదాయ పార్టీల పట్ల జనంలో విశ్వసనీయత తగ్గపోయింది. వాళ్లు వేసే తప్పటడుగులు, జనాకర్షణ విధానాలతో సగటు ఓటర్లు విసిగిపోయారు. అసలు వీళ్లు వద్దురా బాబూ అని దణ్ణం పెట్టుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సర్కారు పట్ల రోజురోజుకు వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగని చంద్రబాబు పట్ల జనానికి ప్రేమ ఉందని చెప్పలేని పరిస్థితీ ఉంది. జగన్ పోవాలని కోరకునే వాళ్లు ఎక్కువగానూ చంద్రబాబు రావాలని కోరుకునే వాళ్లు తక్కువగానూ కనిపిస్తున్నారు. మరో పక్క పవన్ కళ్యాణ్ తీరును ఆయన చర్యలను నమ్మలేమని జనం బహిరంగంగానే చెబుతున్నారు. బీజేపీకి అంత సీన్ లేదని ఒప్పుకుంటున్నారు. ఏపీలో ఇప్పుడు చెప్పుకోలేని రాజకీయ శూన్యత కనిపిస్తోంది. దాంతో జనం కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఇన్ స్టెంట్ జస్టిస్ అన్నట్లుగా అకస్మాత్తుగా ఒక కొత్త నాయకుడు పుడితే అతను రాష్ట్రాన్ని రాజకీయ సంస్కృతిని బాగు చేస్తాడని జనం విశ్వసిస్తున్నారు.
ఇదీ ఒక్కరిద్దరి అభిప్రాయం కాదని విశాల జనహితం కోసం చేస్తున్న ఆలోచన అని ఓపెన్ గానే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాతకు దగ్గ మనవడిగా పేరు పొందిన జూనియర్ ఎన్టీఆర్ అందరికీ గుర్తుకు వస్తున్నారు. ఆయన రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందన్న చర్చ అంతర్గీనంగా మొదలై ఇప్పుడిప్పుడే బయట పడుతోంది. ఇటీవలి కాలంలో కొడాలి నాని వల్లభనేని వంశీ మళ్లీ జూనియర్ ఎన్టీయార్ మాట మాట్లాడుతున్నారు. వాళ్లిదరూ వైసీపీలో కొనసాగుతున్నప్పటికీ ఎన్టీయార్ మాట వచ్చినప్పుడల్లా ఆయన గొప్పదనాన్ని కీర్తిస్తున్నారు. ఆరు నెలలు టైమ్ ఇస్తే జూనియర్ అధకారాన్ని లాక్కుని చూపిస్తారని పెద్ద ఎన్టీయార్ తరహాలో సంక్షేమ రాజ్యాన్ని స్థాపించి చూపిస్తారని చెప్పుకుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే ఆయనకు భుజం కాస్తామని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియా ఇంటర్యూల్లో ప్రకటించారు. ఇదీ అంతా ఉత్తుత్తి మాటలు మాత్రం కాదనుకోవాలి. అధికార పార్టీలో తీరు పట్ల విసుగుచెంది కనిపిస్తున్న ఫ్రస్టేషన్ కు నిదర్శనంగా చెప్పుకోక తప్పదు.
వైసీపీలో ఉండలేక బయటకు రాలేక కొందరు మాట్లాడుతున్న మాటలుగా పరిగణించాలి. టీడీపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అక్కడా పెత్తందార్లు ఎక్కువై పోయారని నిజమైన కార్యకర్తలను పక్కన పెట్టి చాలా రోజులైందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే కొత్త నాయకత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఎన్టీయార్ కుటుంబం దూరం పెట్టడంతో స్వశక్తి మీద ఎదిగిన నటుడు జూనియర్ ఎన్టీయార్ వైపు ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు. సీనియర్ ఎన్టీయార్ లాంటి వాగ్ధాటి అంతటి చురుకుదనం పోరాట పటిమ జనాకర్షణ ఉన్న వ్యక్తి జూనియర్ ఎన్టీయార్. పాన్ ఇండియా స్టార్ గా ఉన్న జూనియర్ ఎన్టీయార్ త్వరలో ఇంటర్నేషనల్ స్టార్ కాబోతున్న తరుణంలో రాష్ట్రం కోసం ప్రజల కోసం ఆయన రాజకీయాల్లోకి రావాలన్న చర్చ జరుగుతోంది. గతంలో జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ కోసం ప్రచారం చేశారు. యాక్సిడెంట్ కావడంతో మంచం మీద పడుకునే ప్రచార వీడియోలు రూపొందించారు. తర్వాత ఏదో కారణం చేత రాజకీయాలకు దూరం జరిగి ఫుల్ టైమ్ సినిమాలపై దృష్టి పెట్టారు. లోకేష్ ఎదుగుదల కోసం జూనియర్ ను చంద్రబాబు దూరం పెట్టారన్న చర్చ కూడా జరిగింది అది వేరే విషయం.
జూనియర్ ఇప్పుడు తన సినిమా కేరీర్ పీక్ పాయింట్ లో ఉన్నారు. ఎట్ల లేదన్నా మరో 15 సంవత్సరాలు ఆయన ఇండస్ట్రీని ఏలే అవకాశం ఉంది. అయినా ఏపీ ప్రజలు ఇప్పుడే ఆయన కోసం ఎదురు చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. జగన్ ను దించాలంటే ప్రస్తుతమున్న ప్రతిపక్షం వల్ల కాదన్న ఫీలింగ్ జనంలోకి వచ్చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు రౌటీన్ అయిపోయారని తాను తిరిగి అధికారానికి వస్తే ఏదో చేయగలరన్న నమ్మకం కలిగించలేకపోయారని వాదనలు వినిపిస్తున్నాయి. పైగా జగన్ చంద్రబాబు కలిసి అమరావతిని శంకరిగిరి మాన్యాలు పట్టించిన తీరు కూడా జనంలో వ్యతిరేకతకు కారణమైంది. మరో పక్క చంద్రబాబుకు తనయుడు లోకేష్ ను ప్రమోట్ చేసుకునే విషయంలో ఉన్న శ్రద్ధ ప్రజా సంక్షేమంపై లేదని కొందరి ఆరోపణ. తెలుగుదేశం పార్టీలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి మారిపోయి నాయకులపై అధిష్టానానికి పట్టు లేకుండా పోయింది.
అందుకే మార్పు అనివార్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు కావాల్సిందీ సహేతుకమైన సంక్షేమం. జనానికి నాలుగు రాళ్లు పడేసి తమ వైపుకు తిప్పుకునే నాయకులు అసలు అవసరం లేదు. ఆనాడు ఎన్టీయార్ ఇచ్చిన రెండు రూపాయల కిలో బియ్యం మండల వ్యవస్థతో పాటు వైఎస్కార్ నాటి ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్సమెంట్ లాంటి మంచి విధానాలు కావాలి. రాజకీయ ఆర్థికం రంగాల్లో ప్రక్షాళన జరగకపోతే రాష్ట్రం పూర్తిగా దివాలా దీసే ప్రమాదమూ ఉంది. ఆ దిశగా అడుగులు వేయాలంటే శక్తిమంతుడైన ధైర్యవంతుడైన సంక్షేమ పిపాసి అధికారపీఠంపై ఉండాలి. అది జూనియర్ ఎన్టీయార్ మాత్రమేనని జనం నమ్మకం. నందమూరి తారకరామారావు పార్టీ పెట్టిన తొమ్మిది నెలలకే అధికారానికి వచ్చారు. జూనియర్ ఎన్టీయార్ కూడా ఆయన వారసుడే. అందుకే టైమ్ తక్కువ ఉందనే వాదనకు తావు లేదని జూనియర్ గుర్తించాలి. ఒక్క సారి ఆయన లెగ్గు పెడితే జనం ప్రభంజనమై కదులుతుంది. చేయి చేయి కలిపి ముందుకు సాగుతుంది. ఆ సంగతి మాత్రం జూనియర్ కు అర్థమైతే చాలు.