రాహుల్‌ వైస్ కెప్టెన్సీ పోయే

By KTV Telugu On 23 February, 2023
image

యువ ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. రావడమే కాదు సత్తా కూడా చాటుతున్నారు. అయినా అవకాశాలు అంతంతమాత్రమే. సీనియర్ అయిన కేఎల్ రాహుల్ కొంతకాలంగా ఘోరంగా విఫలమవుతన్నాడు. అయినా అతన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. జట్టులో స్థానం కోసం యంగ్ ప్లేయర్ల మధ్య తీవ్ర పోటీ ఉంది. ఇలాంటి సమయంలో వరుసగా విఫలమవుతున్న రాహుల్‌కు ఇంకా అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. ఇటీవల చీఫ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేసిన చేతన్ శర్మ చెప్పినట్టు ఎవరిని ఆడించాలో అంతా వాళ్ల ఇష్టారాజ్యమైపోయింది. అందుకే రాహుల్ లాంటి ప్లేయర్లు పరుగులు చేయకపోయినా ఇంకా బ్యాట్ పడుతూనే ఉన్నారు. అతన్ని వెనకేసుకొచ్చే వాళ్లు ఉండడంతో దర్జాగా టీమ్‌లో చోటు సంపాదిస్తున్నాడు. ఫామ్‌లో ఉన్న ప్లేయర్లు మాత్రం కొందరు బెంచ్‌కు పరిమితమవుతుంటే మరికొందరికి అసలు ఛాన్సే రావడం లేదు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రెండు టెస్టుల్లోనూ రాహుల్ వైఫల్యం చెందాడు. టీమిండియా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న రాహుల్ గణాంకాలు ఓ సారి చూస్తే అతను ఆడిన ఆట ఏపాటిదో అర్థమవుతుంది. 71 బంతుల్లో 20 పరుగులు 41 బంతుల్లో 17 పరుగులు 3 బంతుల్లో ఒక్క పరుగు. రెండు మ్యాచుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి రాహుల్ చేసిన స్కోరు మొత్తం 38 పరుగులు. గత పది ఇన్నింగ్స్‌లను చూసినా గొప్ప ప్రదర్శనేం లేదు. కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. రాహుల్ బంగ్లాదేశ్‌పై సాధించిన 23 పరుగులే అత్యధిక స్కోరు. ఇంటా బయట రాహుల్ ఫర్మామెన్స్‌పై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో కేఎల్ రాహుల్‌కు గట్టి షాక్ తగిలింది. ఆసీస్‌తో మిగిలిన రెండు టెస్టులకు ప్రకటించిన భారత జట్టులో రాహుల్‌కు ఉన్న వైస్‌ కెప్టెన్‌ ట్యాగ్‌ను తీసేశారు.

అత్యంత దారుణ ప్రదర్శన చేస్తున్న రాహుల్‌ను జట్టులో నుంచి తీసేయాలనే డిమాండ్లూ వినిపిస్తున్నాయి. కానీ ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం రాహుల్‌కు మద్దతు ఇస్తున్నాడు. తిరిగి గాడిలో పడగల నైపుణ్యం అతడిలో ఉందని నమ్ముతున్నామంటూ వెనకేసుకొస్తున్నాడు. అదే ఏ సంజూశాంసన్ ఇంకొకరో అయితే ఒక్క మ్యాచ్ ఆడకపోయినా నిర్ధాక్షిణంగా పక్కన బెట్టేస్తారు. అంతెందుకు అన్ని ఫార్మాట్లలో దుమ్ముదులుపే సత్తా ఉన్న గిల్‌ను కూడా పక్కనబెట్టి రాహుల్‌ను ఆడించేంత గొప్పొళ్లు మన కోచ్‌లు సెలెక్టర్లు. మూడో టెస్టులో రాహుల్‌ను మిడిల్ ఆర్డర్‌లో ఆడించాలని కొందరు మాజీలు సలహాలు ఇస్తున్నారు. ఏది ఏమైనా చివరి రెండు టెస్టులకు ప్రకటించిన జాబితాలో రాహుల్‌కు వైస్‌ కెప్టెన్సీ పోవడం మాత్రం అతడికి హెచ్చరికలాంటిదే. ఇలాగే కొనసాగితే జట్టులో స్థానం కూడా గల్లంతవ్వడం ఖాయం. ఇప్పటి వరకు 47 టెస్టులు ఆడిన కేఎల్ రాహుల్‌ 33.34 సగటుతో 2,642 పరుగులు సాధించాడు. అందులో 7 సెంచరీలు 13 అర్ధశతకాలు ఉన్నాయి. రాహుల్‌ అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 199 పరుగులు.