రాజకీయాల్లో అయినా కార్పొరేట్ పోటీలో అయినా ట్రెండ్ సెట్ చేసిన వారే విజయం సాధిస్తారు. ట్రెండ్ ను ఫాలో అయ్యే వాళ్లు వెనకబడిపోతారు. ట్రెండ్ సెట్ చేయడానికి అపార అనుభవమే ఉండాల్సిన అవసరం లేదు. అపార మేథస్సు ముందు చూపు ఉంటే చాలు అంటున్నారు మేథావులు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు ట్రెండ్ ఫాలోవర్ గా మిగిలిపోతున్నారు. ఆయన ప్రత్యర్ధి జగన్ మోహన్ రెడ్డి ట్రెండ్ సెట్ చేసుకుంటూ ముందుకు పోతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 90లలో చంద్రబాబు నాయుడి పేరు చెబితేనే ఐటీ సావీ అని పిలిచేవారు. ఐటీకి ఆయనే ఆద్యుడనేవారు. విజనరీ అంటే చంద్రబాబే అనేవారు. అందుకే ఆయన కూడా విజన్ 2020 అంటూ తరచుగా మాట్లాడేవారు. ఎంతో దూరదృష్టి ఉందని అందరూ మెచ్చుకునే చంద్రబాబు నాయుడిలో మ్యాజిక్ అయిపోయిందా అన్న అనుమానాలు వస్తున్నాయంటున్నారు రాజకీయ పండితులు. కొన్నేళ్లుగా చంద్రబాబు నాయుడు ఎలాంటి అద్భుతాలు చేయడం లేదు. పై పెచ్చు చాలా విషయాల్లో చాలా వెనకబడిపోతున్నారు. టెక్నాలజీలోనే కాదు ముందు చూపులోనూ పావులు కదపడంలోనూ ట్రెండ్ సెట్ చేయడంలోనూ చంద్రబాబు ఇంకెవరినో ఫాలో అవుతున్నారు.
ఎన్టీయార్ నుండి టిడిపి పార్టీనీ ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్న చాణక్యుడు చంద్రబాబు. మొదటి తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు జాతీయ స్థాయిలోనూ చక్రాలు తిప్పారు. కేంద్రంలోని ప్రభుత్వాల్లో కీలక పాత్ర పోషించారు. అపుడు చంద్రబాబు కాకలు తీరిన రాజకీయ నేతలను సైతం కంగారు పెట్టగలిగేవారు. చంద్రబాబుతో పెట్టుకోవడం ఎందుకని చాలా మంది భయపడేవారు కూడా. అటువంటి చంద్రబాబు తనకన్నా ఎన్నో ఏళ్లు చిన్నవాడు రాజకీయంగా ఏపాటి అనుభవం లేని కుర్రాడి ముందు తేలిపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. 2014 ఎన్నికల్లో చాలా తెలివిగా బిజెపి-జనసేనలతో కలిసి పొత్తు పెట్టుకుని అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. ఎన్నికల్లో గెలిస్తే ప్రత్యేక హోదా తెస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక బిజెపి పెద్దలు ప్రత్యేక హోదాను పక్కన పెట్టేశారు. ఇటు చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాను పక్కన పెట్టి కేంద్రం నుండి ఏమేమి పనులు కావాలో అవి చేయించుకుంటూ ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ వచ్చారు.
అయితే తన కుమారుడి వయసు ఉన్న వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అజెండాను భుజాలకెత్తుకుని దాన్నో మహోద్యమంగా మలిచినపుడు చంద్రబాబు దాన్ని ఉక్కుపాదంతో అణచివేశారే తప్ప రాజకీయంగా తాను జగన్ ట్రాప్ లో పడుతున్నానని తెలుసుకోలేకపోయారు. 2018 వచ్చేసరికి ఏపీలో టిడిపి పట్ల వ్యతిరేకత పెరిగిపోవడంలో ప్రత్యేక హోదాను ఆయన అణచివేయడమూ ఓ కారణమే అని తెలిసింది. ప్రత్యేక హోదా కోసం పార్లమెంటులో టిడిపి ఎంపీలు రాజీనామా చేయాలని జగన్ సవాల్ విసిరినపుడు రాజీనామాలు చేసి ఏం సాధిస్తాం అన్నారు చంద్రబాబు. అదే అదనుగా జగన్ మోహన్ రెడ్డి తమ ఎంపీల చేత రాజీనామాలు చేయించి దీక్ష నిర్వహించారు. ఏం జరుగుతోందో తెలిసే లోపే చంద్రబాబు నాయుడికి తాను వెనకబడిపోయానని అర్ధం అయ్యింది. మొత్తానికి 2018లో ఎన్నికల ఏడాదిలో బిజెపి నుండి బయట పడ్డారు కానీ అప్పటికే ఆలస్యం అయిపోయింది. అంత వరకు ప్రత్యేక హోదా అడిగిన వారిపై కేసులు పెట్టించి అరెస్ట్ చేయించిన చంద్రబాబు ధర్మపోరాట దీక్షల పేరిట ప్రత్యేక హోదా కావాలని డిమాండ్ చేశారు. అదంతా కూడా జగన్ మోహన్ రెడ్డి పన్నిన ట్రాపే అని రాజకీయ పండితులు అంటున్నారు.
అపుడు జగన్ మోహన్ రెడ్డి ఓ ట్రెండ్ సెట్ చేస్తే చంద్రబాబు నాయుడు దాన్ని గుడ్డిగా ఫాలో అయిపోయారన్నది వారి వాదన. సరే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వాలంటీర్ వ్యవస్థను సచివాలయ వ్యవస్థను పెట్టారు. వాటిని చంద్రబాబు నాయుడు ఏ మాత్రం ఆలోచించకుండా వ్యతిరేకించారు. వాలంటీర్లను తిట్టిపోశారు. ఇంట్లో మగవాళ్లులేనపుడు వాలంటీర్లు ఇళ్లకు వెళ్తారట ఎంత దారుణం అంటూ దిగజారుడు ఆరోపణలు చేశారు. అయితే ఆ తర్వాత ప్రజల్లో వాలంటీరు వ్యవస్థపై సానుకూలత కనిపించగానే తాము మళ్లీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు హామీ ఇవ్వడం మొదలు పెట్టారు. అదే విధంగా జగన్ మోహన్ రెడ్డి అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను ఉద్దేశించి అప్పులు చేసి పప్పు బెల్లాలు పంచి పెట్టి రాష్ట్రాన్ని శ్రీలంక చేసేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.
అయితే సంక్షేమ పథకాలనే ఆయన వ్యతిరేకిస్తున్నారని ప్రజల్లో సంకేతాలు వెళ్లిపోయాయి. దాన్ని ఆలస్యంగా గమనించిన చంద్రబాబు మేం అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఎత్తేస్తామని వైసీపీ ప్రచారం చేస్తోంది కానీ మేం వాటిని ఆపం ఇంతకన్నా గొప్పగా అమలు చేస్తాం అంటూ చెప్పడం మొదలు పెట్టారు. మరి ఇవే పథకాలను పప్పు బెల్లాలతో ఎందుకు పోల్చారన్నది ఆయనే చెప్పాలంటున్నారు రాజకీయ పండితులు. కొద్ది వారాల క్రితం జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న నినాదంతో 2024 ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే ప్రతీ 50 కుటుంబాలకు ఒకరు చొప్పున గృహ సారధులను నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే చంద్రబాబు ప్రభుత్వ నిధులతో గృహసారధులను నియమిస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలకు దోచి పెడుతున్నారని అన్నారు. అయితే గృహ సారధుల కాన్సెప్టే వేరని ఆయనకు అర్ధం కావడానికి చాలా రోజులు పట్టింది.
ఈలోపు జగన్ మోహన్ రెడ్డి 5లక్షలకు పైగా గృహసారధులను నియమించేశారు కూడా. గృహసారధుల వల్ల వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో జనంలోకి పోతుందని అర్ధం కాగానే చంద్రబాబులో కంగారు మొదలైంది. అంతే నిన్న కాక మొన్న ప్రతీ 30 కుటుంబాలకు ఒకరు చొప్పున సాధికార సారధులను నియమిస్తున్నామని ప్రకటించారు. అంటే ఏంటి జగన్ మోహన్ రెడ్డి ఏం చెబుతున్నారో ఏం చేస్తున్నారో వాటినే చంద్రబాబు నాయుడు కళ్లకు అద్దుకుని కాపీ కొడుతున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. గృహసారథుల ను కాపీ కొట్టిన వనంలో సాధికార సారధులన్న పేరులోనూ ఆయన కాపీ పేస్ట్ వ్యవహారం బట్టబయలైందని వారంటున్నారు. జగన్ మోహన్ రెడ్డి ఓ కొత్త ఆలోచన చేసినపుడు దాన్ని వెక్కిరించడం ఆ తర్వాత అది గొప్ప ఐడియా అని అర్ధం కాగానే దాన్ని ఫాలో అయిపోవడం ఇదే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు. అందుకే జగన్ ట్రెండ్ సెట్ చేస్తోంటే చంద్రబాబు బేషరతుగా దాన్ని ఫాలో అయిపోతున్నారని రాజకీయ పండితులు అంటున్నారు. అయితే ఇలా ట్రెండ్ ను యథాతథంగా అనుసరించినంత మాత్రాన లాభం లేదని జగన్ మోహన్ రెడ్డిలానే ఆలోచించగలిగితేనే వాటి ప్రయోజనాలు దక్కుతాయని వారంటున్నారు.
మరి చంద్రబాబు నాయుడి మదిలో ఏం ఉందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.