పాత కొట్టుడుకి కొత్త కవరేజ్‌ ఎందుకయ్యా బాబూ!

By KTV Telugu On 24 February, 2023
image

ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డినుంచి మొదలుకుని వైసీపీలోని ప్రతీ నాయకుడి నోటా ఆ పచ్చపత్రికల మాట రానిరోజుండదు. ఇక సజ్జలలాంటి ముఖ్యులు మీడియా ముందుకొస్తే కవరేజ్‌కే పీఛే క్యా హై అంటూ లోతైన విశ్లేషణని విడమర్చి మరీ చెబుతారు. అనేవాళ్లు అంటుంటారు మనం చేయాల్సింది మనం చేయడమేనని ఆ మీడియా కూడా ఎప్పుడో మెంటల్‌గా ఫిక్స్‌ అయిపోయింది. అందుకే ఓ మాటపడ్డప్పుడల్లా కసిగా నెగిటివ్‌ కవరేజ్‌ వస్తూనే ఉంటుంది. ఆ మాటకొస్తే టీడీపీని, రాజకీయ ప్రత్యర్థులను సాక్షికూడా ఏకిపారేస్తుంటుంది. ఎవరి మీడియాని వాళ్లు సమర్ధంగా వాడుకుంటున్నారు.

తెలుగురాష్ట్రాల్లో మీడియా విశ్వసనీయత గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. కొన్ని మీడియాసంస్థలు పార్టీ జెండా ఎగరేయలేదన్నమాటేగానీ హార్డ్‌కోర్‌ కార్యకర్తల్లా పనిచేస్తుంటాయి. ఇక సొంతమీడియాకి దాని ఎజెండా ఉండనే ఉంది. ఇక అందులో రాతలు కూతలు నిఖార్సుగా ఉంటాయని ఎలా అనుకుంటాం. గన్నవరం రచ్చ తర్వాత టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిని పోలీసులు అరెస్ట్‌చేశారు. కోర్టులో హాజరుపర్చడానికి ముందు కొన్ని గంటలు ఆయనెక్కడున్నారో తెలీకపోవటంతో హైడ్రామా జరిగింది. కోర్టుకు తరలించే టైంలో ఆయనేవో సైగలు చేశారు. ఎవరికి అర్ధమైన భాష్యాన్ని వాళ్లు అల్లేశారు.

తనపై పోలీసులు చేయిచేసుకున్నారని పట్టాభి ఆరోపించారనో ఆయన కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారనో రాయడం వేరు. కానీ వైసీపీ చెప్పే ఎల్లోమీడియాలో టాప్‌ వన్‌లో ఉండే ఈనాడు కాస్త ఎక్కువగానే వండివార్చింది. ఇవిగో గాయాలు అంటూ పట్టాభి ఫొటోలను ప్రచురించింది. తీరాచూస్తే అవి రెండేళ్లక్రితం ఫొటోలు. పాత ఫొటోలనే కొత్త సంఘటనలా చిత్రీకరించే ప్రయత్నాన్ని నెటిజన్లు ఏకిపారేశారు. ఆ నెటిజన్లలో వైసీపీ సిటిజనులు ఎలాగూ ఉంటారనుకోండి. ఫైల్‌ఫొటో అని వేసుంటే కాస్త గౌరవంగా ఉండేది. ఎప్పుడో పాత ఫొటోలనే ఫ్రెష్‌గా చూపిస్తే నమ్మేయడానికి హ్యాండ్‌ కంపోజింగ్‌ జమానా కాదుగా.

టీడీపీ నేత పట్టాభిపై పోలీసుల థర్డ్‌ డిగ్రీ ప్రయోగించారంటూ ఈనాడు రెండేళ్లనాటి ఫొటోలను పాఠకులకు అందించింది. ఇది కచ్చితంగా అత్యుత్సాహమే. తిమ్మినిబమ్మిని చేసే ప్రయత్నమే. రేపు పట్టాభి బెయిల్‌మీద బయటికిరాడా తన అనుభవాల్ని గట్టి గొంతుతో చెప్పుకోడా. ఈలోపు మీడియాకి ఎందుకంత ఆరాటం నెటిజన్లు ఫుట్‌బాల్‌ ఆడేసుకోవటంతో పొరపాటుకు చింతిస్తున్నాం అంటూ అత్యధిక సర్క్యులేషన్‌ పత్రిక వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. సాంకేతిక కార‌ణాలతో తప్పు జరిగినట్లు బుకాయించినా తప్పయిపోయిందని చెంపలేసుకున్నట్లే. పోలీసులు పట్టాభిమీద లాఠీలు ప్రయోగించారో లేదోగానీ నెటిజన్లు మాత్రం ఈనాడుమీద థర్డ్‌డిగ్రీ ప్రయోగించారన్న జోకులు పేలుతున్నాయి.