నరేంద్ర మోదీ హ్యాట్రిక్ ను అడ్డుకుంటారా

By KTV Telugu On 24 February, 2023
image

కేంద్రంలోని బిజెపికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రాగలిగితే వచ్చే ఎన్నికల్లో బిజెపిని గద్దె దింపచ్చని బిహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ చేసిన వ్యాఖ్య ఇపుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. వినడానికి బానే ఉంది కానీ ఇది సాధ్యమా అని బిజెపి వ్యతిరేకులు సైతం బుర్రలు గోక్కుంటున్నారు. ఈ యజ్ఞాన్ని కాంగ్రెస్ పార్టీయే భుజాలకెత్తుకోవాలని కూడా నితిష్ సూచించారు.

బిహార్ రాజకీయాలను దశాబ్ధాల తరబడి శాసించిన రాజకీయ దిగ్గజం నితిష్ కుమార్ కు ఒక్క కోరిక ఉండిపోయింది. ఒక్కసారైనా సరదాగా ప్రధాని పీఠంపై కూర్చుని దేశాన్ని పాలించేయాలని నితిష్ కుమార్ చాలా కాలంగా ముచ్చటపడుతున్నారు. అయితే ఆ కల నిజం అవుతుందో లేదోనని కూడా ఆయన అనుమానంతోనే ఉన్నారు. 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడానికి వీల్లేదని బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ కూడా పంతంగా ఉన్నాయి. అయితే ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నాయకుడు ప్రతిపక్షంలో లేకపోవడంతో ఏం చేయాలా అని అంతా తలలు పట్టుకుంటున్నారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఘోరమైన పరాజయాలు మూటకట్టుకుంది కాంగ్రెస్. అందుకే తొమ్మిదేళ్లుగా ప్రతిపక్షంలోనే ఉండిపోయింది. వచ్చే ఎన్నికల తర్వాత కూడా అధికారంలోకి రాలేకపోతే దేశ ప్రజలు కాంగ్రెస్ ను మరచిపోతారేమోనన్న భయం ఆ పార్టీ నాయకత్వంలోనే ఉంది.

అందుకే వచ్చే ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించింది కాంగ్రెస్ హైకమాండ్. ఇప్పటికే సీనియర్ అయిన మల్లికార్జున ఖర్గేకి పగ్గాలు అప్పగించిన కాంగ్రెస్ నాయకత్వం విపక్షాల్లో కలిసొచ్చే ప్రతీ ఒక్కరినీ జాగ్రత్తగా ఒక్కతాటిపైకి తీసుకు వచ్చి వారితో కలిసి నడవాలని భావిస్తోంది. అవసరమైతే మూడో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంటే కాంగ్రెస్ బయటి నుండి మద్దతు ఇవ్వడానికి కూడా సిద్ధమేనన్న సంకేతాలు ఇస్తున్నారు సోనియా గాంధీ. ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోన్న నితిష్ కుమార్ తాను ప్రధాని కావడానికి ఈ పరిణామాలు కలిసొస్తాయని ఆశపడుతున్నారు. విపక్షాల్లో ఎవరూ కూడా నితిష్ ను వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజకీయంగా అపార అనుభవం ఉన్న నితిష్ కేంద్ర మంత్రిగానూ సమర్ధవంతంగా పనిచేశారు.

బిజెపికి బద్ధ వ్యతిరేకులైన పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లతో పాటు కమ్యూనిస్టు పార్టీలు కూడా విపక్షాల ఐక్యతకు అండగానే నిలుస్తారు. అయితే వీరంతా కలిసి ఎన్నిస్థానాల్లో పోటీ చేస్తారు ఎన్నిస్థానాల్లో గెలుస్తారు అన్నదే ముఖ్యం. ఇటీవలి సర్వేలు గమనిస్తే వచ్చే ఎన్నికల్లోనూ నరేంద్రమోదీ పార్టీయే అధికారంలోకి రావచ్చునని తేలింది. కాకపోతే బిజెపి బలం కొంత మేర తగ్గచ్చని అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ బలం కూడా కొంత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అయితే అది ఎంత అనేది ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ నూట పాతిక్కి పైగా స్థానాలు గెలిచి బిజెపిని గట్టి గా వ్యతిరేకించా పార్టీలన్నీ కలిసి రెండు వందల దాకా స్థానాలు సంపాదిస్తేనే బిజెపిని గద్దె దించడానికి వీలవుతుంది. అయితే కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని భావిస్తే ఇపుడు బిజెపికి అండగా ఉన్న కొన్ని తటస్థ పార్టీలు కూడా బిజెపీయేతర ప్రభుత్వం ఏర్పాటుకు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు.

మరాఠా గడ్డపై రాజకీయ దిగ్గజం శరద్ పవార్ వంటి వారు కూడా ఈ కూటమికి అండగా ఉంటారు. ఈ సమీకరణలను దృష్టిలో పెట్టుకునే నితిష్ కుమార్ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న నేపథ్యంలో విపక్షాల ఐక్యత అవసరాన్ని నొక్కి చెప్పారని భావిస్తున్నారు. ఇక బిజెపి-కాంగ్రెస్ లను సమానంగా వ్యతిరేకిస్తోన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సారధ్యంలోని బి.ఆర్.ఎస్. కూడా బిజెపియేతర ప్రభుత్వానికి మద్దతు నిచ్చే అవకాశాలు ఉండచ్చంటున్నారు.
2024 ఎన్నికల నాటికి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వానికి పదేళ్లు నిండుతాయి. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న ఏ కూటమికైనా కచ్చితంగా ప్రజల్లో వ్యతిరేకత ఉంటుంది. మోదీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు కూడా ప్రజల్లో అసంతృప్తిని రాజేస్తున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. ఈ ఏడాదిలో ఏమైనా జరగచ్చు. మోదీ పట్ల వ్యతిరేకత మరింతగా పెరగనూ వచ్చు. లేదంటే ఇపుడున్న వ్యతిరేకత నెమ్మదిగా తగ్గి సానుకూలత పెంచుకునేలా ప్రభుత్వం విధానపర నిర్ణయాల తీసుకోనూ వచ్చు.

అయితే ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వాలు తీసుకునే మంచి నిర్ణయాల పట్ల ప్రజలకు అంత నమ్మకం ఉండదంటారు రాజకీయ పండితులు. కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పథకాలు తెచ్చారని ప్రజలు భావించే అవకాశాలుంటాయని వారంటున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఈ సారి ప్రధాని కాలేకపోతే ఇక జీవితంలో ఎప్పటికీ ప్రధాని కాలేరని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాహుల్ గాంధీ ఇటీవల చేపట్టిన భారత్ జోడో యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ప్రతీ చోటా జనం నీరాజనం పలికారు. రాహుల్ గాంధీ కూడా ప్రజలతో మమేకం అవుతూ ముందుకు సాగారు. దానికి కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్. మొత్తానికి చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు చాలా పకడ్బందీగా సమాయత్తమవుతోంది.
ఒక వేళ కాంగ్రెస్ పార్టీయే 150కి పైగా స్థానాలు సంపాదించగలిగితే మాత్రం వచ్చే ఎన్నికల్లో మరోసారి యూపీయే ప్రభుత్వం ఏర్పాటు అయ్యే అవకాశాలు ఉంటాయి.

అయితే దానికి ముందుగా కాంగ్రెస్ పార్టీ చాలా చేయాల్సి ఉంటుంది. భావ సారూప్య పార్టీలతో ఎన్నికలకు ముందే ముందస్తు పొత్తులు కుదుర్చుకోవాలి. ఎన్నికల తర్వాత మాత్రమే పొత్తులకు సిద్ధమయ్యే పార్టీలు ఉంటే వాటితో అవగాహనలకూ రావాలి. ఈ క్రమంలో తాను పెద్దన్న పాత్ర పోషించి ఆధిపత్య ధోరణితో మాట్లాడకుండా చిన్న పార్టీలకుకూడా గౌరవం ఇవ్వాలి. వారిలో నమ్మకాన్ని కలిగించాలి. విపక్షాల కూటమి అద్భుత విజయాలు సాధిస్తే విపక్షాలకు ఆమోద యోగ్యమైన ఉమ్మడి అభ్యర్ధిని ప్రధాని పదవికి ఎంచుకోవలసి ఉంటుంది. ఒక వేళ ఆ పరిస్థితే కనక వస్తే తాను రేసులో ముందంజలో ఉండాలని నితిష్ కుమార్ ఇప్పటినుంచే కర్చీఫ్ వేసుకుంటున్నారు. అపుడు శరద్ పవార్ కూడా పోటీలో ఉండే అవకాశాలున్నాయి.

ఎందుకంటే పవార్ కు మమతా బెనర్జీ వంటి నేతల మద్దతు కూడా ఉండచ్చు. బిజెపిని ప్రత్యేకించి వ్యతిరేకించకుండా అలాగని బిజెపితో పొత్తులు పెట్టుకోకుండా అంశాల వారీగా మద్దతు ఇస్తూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ లోని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ, ఒడిశాలోని నవీన్ పట్నాయక్ పార్టీలు ఎన్నికల తర్వాత అవతరించే సమీకరణలను బట్టి తమ తమ రాష్ట్రాల ప్రయోజనాలకు ఎవరు కలిసొస్తే వారికి మద్దతు నిచ్చే అవకాశాలుంటాయి. ఒక వేళ తమ మద్దతుతోనే కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యే పరిస్థితులు ఉంటే మాత్రం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఇస్తేనే మద్దతు ఇస్తామని షరతు విధించే అవకాశాలుంటాయి. అది ఏపీకి మేలు చేసే పరిస్థితులు ఉంటాయి. రాజకీయంగా జగన్ ఇమేజ్ పెరగడానికి కూడా అదే దోహద పడుతుంది. అయితే ఎన్నికల నాటికి ఏ యే పార్టీలు ఎటు వైపు మొగ్గు చూపుతాయి ఏ కొత్త ఆలోచనలతో ఉంటాయనేది ఇపుడే చెప్పలేం.