సైకిల్‌ పార్టీ, కాపు కార్డు.. కన్నాని మళ్లీ గెలిపిస్తాయా

By KTV Telugu On 24 February, 2023
image

ఒకప్పుడు కాంగ్రెస్‌. ఎన్‌ఎస్‌యుఐ నుంచి మంత్రిదాకా ఆ పార్టీతోనే సుదీర్ఘ రాజకీయ జీవితం. ఏపీలో కాంగ్రెస్‌ కనుమరుగైపోగానే కాషాయపార్టీలో చేరిపోయారు. సీనియర్‌ వచ్చాడుకదాని బీజేపీ కూడా ఆయన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసింది. కానీ ఆయనకంత సీన్‌లేదని అర్ధమయ్యాక ఆయన స్థానంలో సోమువీర్రాజును తెచ్చింది. అప్పట్నించీ బీజేపీలో ఇమడలేక అటూఇటూ చూసి చివరికి సైకిలెక్కేశారు కన్నా లక్ష్మినారాయణ. చంద్రబాబుకు సరిసమానమైన రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. జనసేనతో పొత్తుకోసం పరితపిస్తున్న టీడీపీకి కన్నా రాక కొత్త ఉత్సాహాన్నిచ్చింది. ఎందుకంటే కాపు నేతల్లో కన్నాకు కూడా కాస్తంత పేరుంది. ఆయన మొదట జనసేనలో చేరతారనుకున్నారు. ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ ఇంటికెళ్లి మరీ మాట్లాడారు.

కానీ ప్రజారాజ్యాన్ని చూసిన అనుభవమో ఎప్పటికైనా టీడీపీతో కలిసిపోయే పార్టీనే అనుకున్నారో లేదంటే బీజేపీకి మిత్రపక్షంగా ఉండే పార్టీ ఎందుకనుకున్నారోగానీ ఫైనల్‌గా చంద్రబాబుతో చేయికలిపారు కన్నా. కన్నా ఎక్కడ కావాలంటే అక్కడ సీటిచ్చేందుకు టీడీపీ రెడీ. ప్రభుత్వం అధికారంలోకొస్తే మంత్రి పదవి ఇస్తామన్న హామీ కూడా వచ్చుండాలి. కన్నా పోటీ గుంటూరునుంచా పెదకూరపాడునుంచా లేదంటే సత్తెనపల్లినుంచా అన్నది తేలాల్సి ఉంది. ఓ సీనియర్‌ రాజకీయ ప్రస్థానంలో ఇది మూడోపార్టీ. పదేళ్లుగా రాజకీయంగా గడ్డుపరిస్థితులు ఎదుర్కుంటున్న కన్నా పొలిటికల్‌ కెరీర్‌ దాదాపు క్లైమాక్స్‌లో ఉంది. మరి టీడీపీలో చేరికతో ఆయన ఫ్యూచర్‌ మారుతుందో ఇక్కడితోనే ఫుల్‌స్టాప్‌ పడుతుందో చూడాలి.