ఉమ్మడి కృష్ణా జిల్లా ఒకప్పుడు తెలుగుదేశానికి కంచు కోట. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్.టీ.రామారావు సొంత జిల్లా. రాజకీయ చైతన్యం ఉన్న ఆ జిల్లాలో సామాజికవర్గాల సమీకరణాలు కూడా టీడీపీకి బాగానే ఉపయోగపడ్డాయనే చెప్పాలి. కృష్ణా జిల్లాలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయనే చర్చ నిత్యం జరుగుతూనే ఉంటుంది. ఆ జిల్లా నేతలకే కీలక మంత్రి పదవులు దక్కుతాయన్న టాక్ కూడా ఉంది. అలాంటి జిల్లాలో టీడీపీ మనుగడకే ముప్పు వచ్చి పడింది. వచ్చే ఎన్నికల్లో పార్టీ పరిస్థితేమిటన్న విశ్లేషణలు మొదలయ్యాయి. మరి ఎందుకలా జరుగుతోంది.
కృష్ణ నీళ్లు తాగితే ఆత్మగౌరవమే కాదు గర్వం కూడా ఎక్కువే అవుతుందంటారు. ఎవరినీ లెక్కచేయని మనస్తత్వం వస్తుందంటారు. వాళ్ల గొప్పేంటి మనం మన ఇష్టం అన్నట్లుగా ప్రవర్తిస్తారంటారు. ఉంటే ఎంత లేకపోతే ఎంత అన్నట్లుగా అన్ని పనులు చేస్తారంటారు. టీడీపీలోనూ ఇప్పుడు అదే జరుగుతోంది. ఎవరిని ఎవరూ లెక్కచేయకపోవడం పార్టీలో ఐకమత్యమనే మాటే లేకపోవడం వీలైతే పక్కనోడిని కిందకు లాగాలని ప్రయత్నించడం ఇప్పుడు కృష్ణా జిల్లా తెలుగుదేశంలో మనం గమనిస్తున్న పరిణామాలుగా చెప్పుకోవాలి.
కులాల కుంపట్లు ఆధిపత్యం కోసం రాజకీయ ఆటలు నోటికొచ్చిన ప్రకటనలతో ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ డీలా పడింది. అత్యవసర చికిత్స చేయాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. పార్టీ పరిస్థితి మరింతగా దిగజారుతోంది. జిల్లాలో 16 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే పార్టీకి ఇప్పుడు 1600 సమస్యలు ఎదురవుతున్నాయి. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరిగిన మునిసిపల్ పరిషత్ పంచాయతీ ఎన్నికల్లో ఎదురైన వరుస పరాజయాలతో టీడీపీలో నిస్తేజం నెలకొంది. ఒంగోలు మహానాడు వేదికగా చంద్రబాబు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినా పట్టించుకున్న వారే లేరని చెప్పాలి.
అధికార వైసీపీ ఆ జిల్లాలో బాగా బలపడింది. ప్రతీ చోట ఎమ్మెల్యేలు దూకుడు మీదున్నారు. దానితో వారిని తట్టుకునేందుకు ప్రయత్నించాల్సింది పోయి టీడీపీ శ్రేణులు అంతర్గత కుమ్ములాటలతో పార్టీ పరిస్థితిని మరింత దిగజార్చుతున్నాయి. బూతుల మంత్రిగా పేరు పొందిన ఎక్స్ మినిష్టర్ కొడాలి నానితో ఫైట్ చేయాల్సిన తరుణంలో గుడివాడ టీడీపీ నేతలు తగవులాడుకుంటున్నారు. గుడివాడలో టీడీపీ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరావు, పిన్నమనేని బాబ్జి, శిష్టా లోహిత్ వేర్వేరు గ్రూపులుగా రాజకీయాలు చేస్తున్నారు. తాను లోకేష్ మనిషినని చెప్పుకుంటూ శిష్టా లోహిత్ అధిపత్యం చెలాయించాలనుకుంటే ఇతర నేతలు దాన్ని తిప్పికొడుతున్నారు.
తిరువూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్, మాజీ మంత్రి జవహర్, నియోజకవర్గ ఇన్‌చార్జి సేవల దేవదత్తు మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. ఇన్‌చార్జికి నాయకులతో సఖ్యతలేదని రాజకీయ అనుభవం శూన్యమని పార్టీలోని ముఖ్యనేతలు వ్యతిరేకిస్తున్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గంలో నెట్టెం రఘురాం, శ్రీరాం తాతయ్య, టీడీ జనార్దన్ వర్గాల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. దానితో వచ్చే ఎన్నికల్లో జగ్గయ్యపేట టికెట్ ఎవరిన్న చర్చ పార్టీ అధిష్టానానికే ఇబ్బందికరంగా మారింది. మైలవరంలో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అంటే టీడీపీ జనం వణికిపోతున్నట్లు సమాచారం.
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ టీడీపీలో వర్గపోరు ఇంతింతకాదయా అన్నట్లుగా ఉంది. లోకేష్ పేరుతో బుద్దా వెంకన్న పెత్తనం చేయాలని ప్రయత్నాన్ని ఇతర నేతలు సమర్థంగా అడ్డుకుంటున్నారు. కార్పొరేషన్ ఎన్నికల్లో అధినేత చంద్రబాబు సమక్షంలోనే లోక్ సభ సభ్యుడు కేశినేని నానిని అవమానించారన్న చర్చ జరిగింది. దానితో నాని అడ్డం తిరుక్కున్నారు. పార్టీలో నేతలకు తరచూ వార్నింగులిస్తున్నారు. తను చెప్పిన వ్యక్తికే పశ్చిమ టికెట్ ఇవ్వాలని సందేశాలు వదులుతున్నారు. బుద్దా వెంకన్నను దూరం పెట్టాలన్న చంద్రబాబు ప్రయత్నాలకు లోకేష్ అడ్డు తగలడంతో ఆయన ఏమీ చేయలేకపోతున్నారు. కేశినేని నాని షరతులను పట్టించుకోని చంద్రబాబు కొత్త ఎత్తుగడ వేసి, అతని తమ్ముడు కేశినేని చిన్నీని ప్రోత్సహిస్తున్నట్లు చెబుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో చిన్నీకి టికెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. అధిష్టానం ప్రయత్నాలను నాని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. చిన్నీని ప్రోత్సహిస్తే వచ్చే ఎన్నికల్లో తాను పార్టీకి అండగా ఉండే ప్రసక్తే లేదని నాని తేల్చేశారు. పైగా ఎన్టీఆర్ వర్థంతి సందర్బంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో నిజమైన కార్యకర్తలకు గుర్తింపు లేదని టీడీపీ కోసం ఆస్తులు పోగొట్టుకున్న వారిని వదిలేసి సంపాదనాపరులకు అవకాశాలిస్తున్నారని కామెంట్లు వదిలారు. ఇలాంటి డైలాగులు రుచించకపోయినా చేసేందేమీ లేక చంద్రబాబు మిన్నకుండిపోతున్నారు. ప్రెస్ మీట్లు పెట్టే పేపర్ పులులే పార్టీలో మిగిలుతారని నాని వ్యాఖ్యానించడం విజయవాడ పార్టీలో నెలకొన్న విభేదాలకు నిదర్శనంగా నిలుస్తుంది. నియోజకవర్గ బాధ్యతలు అప్పగించలేదని అలిగిన జలీల్ ఖాన్ ను బుజ్జగించే సరికి తల ప్రాణం తోకకు రావడం మరో కోణం.
విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు పరిస్థితి పైకి కనిపిస్తున్నంత బలంగా లేదు. గద్దె సీటుపై పలువురు టీడీపీ నేతలు కన్నేశారు. లోకేష్ అండదండలతో కొందరు ఎన్‌ఆర్‌ఐలు ఈ నియోజకవర్గానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుండటంపై గద్దె కుటుంబం గుర్రుగా ఉంది. అవసరమైతే గద్దెను ఎంపీ అభ్యర్థిగా పంపించి, ఎమ్మెల్యే సీటు ఇస్తామని ఓ ఎన్‌ఆర్‌ఐకి అధిష్టానం మాట ఇచ్చిందన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై చంద్రబాబుకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో గద్దె తీవ్ర మనస్తాపం చెంది, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అనివార్యమైతే ఎంపీ కేశినేని నానితో జట్టు కట్టి సరికొత్త రాజకీయాలు చేయాలని గద్దె ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. పెనమలూరు నియోజకవర్గంలో బోడె ప్రసాద్, యలమంచిలి బాబురాజేంద్ర ప్రసాద్, దేవినేని గౌతం అలియాస్ పండు వర్గాల ఆధిపత్య పోరుతో టీడీపీ కునారిల్లుతోంది. లోకేష్ ఆశీస్సులతో పండు వర్గం పెత్తనం చెలాయిస్తోంది. దీంతో ఒకరిపై మరొకరు ఫిర్యాదు చేసుకొంటూ పార్టీ క్యాడర్‌ను పట్టించుకోకపోడంతో నాయకత్వంపై కార్యకర్తల్లో నమ్మకం సన్నగిల్లింది.
గన్నవరం ఇప్పుడు చంద్రబాబుకు కొత్త సమస్యలు తెచ్చి పెడుతోంది. కృష్ణా జిల్లా టీడీపీలో అనైక్యతకు గన్నవరం దర్పణం పడుతోంది. టీడీపీలో గెలిచి వైసీపీలో వెళ్లిపోయిన వల్లభనేని వంశీ ప్రదర్శిస్తున్న దూకుడు ఇప్పుడు జిల్లా టీడీపీలో ప్రతిధ్వనిస్తోంది. వంశీని ఎదుర్కొనే దమ్ము టీడీపీలో ఎవరికీ లేదన్న ప్రచారం జరుగుతోంది. గన్నవరంలో జరిగిన టీడీపీ వర్సెస్ వైసీపీ ఘర్షణలు తెలుగు తమ్ముళ్లను పూర్తిగా డిఫెన్స్ లో పడేశాయి. తొలుత చలో గన్నవరం కార్యక్రమానికి కొందరు నేతలు సహకరించలేదు. ఎక్కడికక్కడ హౌస్ అరెస్టులు చేస్తుంటే మిగతా వారు కూడా తమకు తెలియనట్లుగా ఉండిపోయారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై వైసీపీ గూండాలు దాడి చేసి కార్లు తగులబెట్టినా కొందరు నేతలు చీమకుట్టినట్లుగా కూడా వ్యవహరించలేదు. టీవీల్లోనూ బయట అన్ని తానై వ్యవహరించే కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వీరావేశంతో రంగంలోకి దిగి దెబ్బలు తిన్నా పట్టించుకున్న వారు లేరు. అజ్ఞాత వ్యక్తులు పట్టాభిని లాక్కుపోతుంటే అంత మంది ఉండి అడిగిన వాళ్లు లేరు. చివరకు పట్టాభిని 200 కిలోమీటర్లు తిప్పి పోలీసు స్టేషన్లో పడేసి కొట్టినా టీడీపీ నాయకులు చలించలేదు. నేరుగా చంద్రబాబు రంగంలోకి దిగి పట్టాభి కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు వైసీపీని గట్టిగా హెచ్చరించిన తర్వాతే టీడీపీ కేడర్ కు కాస్త ధైర్యం వచ్చింది. పట్టాభి కుటుంబంతో పాటు కార్యకర్తలందరికీ పార్టీ అండగా ఉంటుందని చంద్రబాబు ప్రకటించడం కొంత ఊరటనిచ్చే అంశం.
గన్నవరం సంఘటనల తర్వాత నేతల తీరుపై కొందరు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లడంతో కృష్ణా జిల్లా బ్యాచ్‌కు లాస్ట్ వార్నింగ్ ఇవ్వాలని ఆయన నిర్ణయించుకుని ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. చలో గన్నవరం కార్యక్రమానికి ఎవరూ సహకరించలేదని తెలుసుకుని చంద్రబాబు బాగా సీరియస్ అయ్యారు. పట్టాభి కష్టాల్లో ఉంటే విజయవాడలోని ఆయన ఇంటి వైపు ఎవరూ చూడలేదని తెలుసుకుని ఒక్కొక్కరికీ గట్టిగా క్లాస్ తీసుకున్నారు. తాను హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చినా విజయవాడ పరిసరాల్లో ఉన్న వాళ్లు రాకపోవడమేంటని చంద్రబాబు కొందరిని నిలదీశారు. అధికారం ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్లు ఇప్పుడు విపక్షంలో పార్టీని బలోపేతం చేయాలి కదా అని నిలదీశారు. దానితో కొందరు నేతలు దారికి వచ్చారు. ముందు ఆధిపత్య పోరుకు స్వస్థి చెప్పాలి. అప్పుడే చంద్రబాబు చేసిన దిశా నిర్దేశం అర్థమవుతుంది. ప్రస్తుతానికి గన్నవరం నియోజకవర్గంలో టీడీపీని పట్టించుకొనే నాథుడే లేడు. గన్నవరం వెళ్లాల్సిందిగా బయటి నియోజకవర్గాల నేతలను చంద్రబాబు ప్రాథేయ పడటం అక్కడ పార్టీ దుస్థితికి అద్దం పడుతోంది. ఆ పరిస్థితి పోయి ధైర్యంగా ప్రత్యర్థిని ఎదుర్కొనే చర్యలు చేపట్టారు. కృష్ణా జిల్లాలో టీడీపీ జైత్రయాత్ర గన్నవరంలో వంశీని ఎదుర్కోవడం నుంచి మొదలు కావాలి. మరి టీడీపీ నేతలు దారికి వస్తారో లేదో.