బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను…సీబీఐ, ఈడీ, ఐటీ కేసుల పేరుతో వేధింపులకు పాల్పడుతోంది. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా…విపక్షాలకు చెందిన నేతలను వేధింపులకు గురి చేస్తోంది. పాత కేసులను తిరగదోడుతూ…శత్రువులను భయపెడుతోంది. తాజాగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను…నేషనల్ హెరాల్డ్ కేసులో…ఈడీ విచారించింది. అయితే ఈడీ కేసులను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ విఫలమైందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. మోడీ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టడంలో…దూకుడు ప్రదర్శించలేకపోతోంది.
బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రత్యర్థులను ఏదో విధంగా దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలను…జేబు సంస్థల్లాగా ప్రత్యర్థులపైకి ప్రయోగిస్తోంది. అయితే సిబీఐ లేదంటే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్…ఈ రెండు కుదరకపోతే ఐటీ దాడులు చేయిస్తోంది. ఐఎన్ఎక్స్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం, ఆయన తనయుడు కార్తీ చిదంబరం, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇలా చెప్పుకుంటూ పోతే…జాబితా చాంతాడంతా పెరిగిపోతూనే ఉంటుంది. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీలను ఈడీ అధికారులు విచారించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో…ఇద్దర్ని గంటల పాటు ప్రశ్నించారు. కరోనా నుంచి కోలుకున్న సోనియాకు ఈడీ నోటీసులు పంపింది. ఆ తర్వాత ఆమెకు కొవిడ్ అనంతర సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. కోలుకున్న తర్వాత మరోసారి నోటీసులు ఇచ్చిన…ఎట్టకేలకు ఈడీ ఆఫీసుకు రప్పించగలిగారు. ఆమెకు ఆరోగ్యం సరిగా లేకపోయినా…ఉదయం నుంచి సాయంత్రం కూర్చోబెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు.
ప్రధాని నరేంద్ర మోడీ….ఫెయిల్యూర్స్ ఎన్నో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆందోళనలు, నిరసనలు, ఉద్యమాలు ఆశించిన స్థాయిలో చేయలేకపోతోంది. ఎన్నో అవకాశాలు వచ్చినా…వాటిని అందిపుచ్చుకోలేకపోతోంది. రాహుల్ గాంధీ ఈడీ విచారణ సందర్భంగా…దేశవ్యాప్తంగా హస్తం పార్టీ శ్రేణులు ఆందోళనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. అయితే అదే స్థాయిలో సోనియా గాంధీ విచారణ సమయంలో దూకుడు ప్రదర్శించలేకపోయింది. 75 ఏళ్ల వయసులో అనారోగ్యం బాధపడుతున్న కేసుల పేరుతో వేధిస్తున్నారంటూ…బలమైన ఉద్యమం చేయాల్సి ఉన్నా….పెద్దగా స్పందించలేదు. ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేసులే కాదు…కేంద్రం వైఫల్యాలు ఎన్నో ఉన్నాయ్. మోడీ వైఫల్యాలపై పోరాటం చేయకుండా చేతులెత్తేసిందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. ప్రతిపక్షానికి బలమైన నాయకత్వం కరవైంది. వరుసగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలవుతున్న…ఏ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవడం లేదు.
మోడీ ప్రధాన మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నో వైఫల్యాలు ఉన్నాయ్. కొవిడ్ మహమ్మారితో ప్రజలు పిట్టల్లా రాలిపోయారు. గంగానదిలో శవాల గురించి మాటల్లో చెప్పలేం. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతు ఉద్యమం…చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వద్ద కొనసాగుతున్న ఉద్రిక్తతలు, రూపాయి విలువ పతనం కావడం…జీఎస్టీ అమలు, ఉన్నావ్, హత్రాస్, కశ్మీర్ అత్యాచారాలు దేశాన్ని కుదిపేసేవే. అయితే వాటిని సద్వినియోగం చేసుకొని…ప్రజా ఆందోళనలు చేయడంలో వెనుకబడిపోతోంది. షాహీన్ బాగ్ నిరసనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయ్. గుజరాత్ ముంద్రా ఎయిర్ పోర్టులో వేల కోట్ల విలువ చేసే డ్రగ్స్ దోరుకుతున్నా…పట్టించుకోవడం లేదు. ఉద్యమాల ద్వారా ప్రజల్లో కదలిక తీసుకురావాల్సిన కాంగ్రెస్ పార్టీ…సైలెంట్ అయిపోయింది.