విజయసాయిరెడ్డి. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత. ఈ హోదా ఎన్నాళ్లుంటుందో తెలీదు. ఎందుకంటే పార్టీనుంచి ఆయనకు సెగ మొదలైంది. ఆయనకు తెలియకుండానే అనుబంధ సంఘాల నియామకం జరిగిపోయింది. పార్టీలో నెంబర్‌టూగా చక్రం తిప్పిన నాయకుడు సడెన్‌గా ఎందుకు చేదయ్యాడంటే తారకరత్న ఎపిసోడ్ కారణంగా చెబుతున్నారు. నందమూరి తారకరత్న విజయసాయిరెడ్డికి సమీప బంధువన్న విషయం మొన్నటిదాకా బయటివారికి తెలీదు. తారకరత్న భార్య విజయసాయిరెడ్డికి మేనకోడలు. తారకరత్న మరణం నందమూరి కుటుంబాన్ని ఎంత కుదిపేసిందో విజయసాయిరెడ్డిని కూడా అంతకంటే ఎక్కువ ఆవేదనలో ముంచేసింది.
ట్విటర్‌లో విజయసాయిరెడ్డి అగ్రెసివ్‌గా ఉండేవారు. చెణుకులు, విరుపులతో టీడీపీమీద విరుచుకుపడేవారు. ఈమధ్య ఎందుకో ఆయన రాజకీయ విమర్శలకు దూరంగా ఉంటున్నారు. తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత విజయసాయిరెడ్డిలో కనిపించిన మార్పు అందరినీ ఆశ్చర్యపరిచింది. చావులదగ్గర ప్రత్యర్థులు శత్రువులని చూడరు. ఎన్టీఆర్ మనువడి మరణంతో ఆయన కుటుంబసభ్యులతో విజయసాయిరెడ్డి అలాగే కలిసి ఉన్నారు. కాకపోతే అవసరానికంటే ఎక్కువగా ఆయన రాసుకుపూసుకు తిరిగారన్న అభిప్రాయంతో ఉంది వైసీపీ నాయకత్వం. అందుకే అవసరమైతే ఆయన్ని కూడా పక్కనపెడతామన్న సంకేతాలిస్తోంది.
తారకరత్న ఆస్పత్రిలో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి బాలకృష్ణతో సన్నిహితంగా మెలిగారు. మరణం తర్వాత భౌతికకాయం ఇంటికి చేరాక చంద్రబాబు పక్కనే విజయసాయిరెడ్డి కూర్చోవడం ఆయనతో మాట్లాడటం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే చంద్రబాబుతో పాటు కారుదాకా వెళ్లడం దగ్గరుండి సాగనంపడం మీడియాతో మాట్లాడుతున్న సమయంలో కూడా పక్కనే ఉండటం వైసీపీ పెద్దలకు మింగుడుపడనట్లుంది. తారకరత్న మరణంపై ఎన్టీఆర్ రెండోభార్య లక్ష్మిపార్వతితో వైసీపీ విమర్శలు చేయించింది. అతని చావుకు చంద్రబాబు లోకేషే కారణమని లక్ష్మిపార్వతి ఆరోపించారు. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత నందమూరి కుటుంబంతో సన్నిహితంగా ఉండటం వైసీపీకి అస్సలు నచ్చలేదు.
తారకరత్న చెల్లెలి అల్లుడు కావటంతో విజయసాయిరెడ్డి దగ్గరుండి అన్నీ చూసుకున్నారు. పదవులైనా ప్రాణమైనా ఏదీ శాశ్వతం కాదన్న వైరాగ్యభావన ఆయనకు కూడా వచ్చినట్టుంది. విశాఖలో ఆయన బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికిచ్చారు. సోషలమీడియాను సజ్జల కొడుక్కి కట్టబెట్టారు. నామినేటెడ్ పదవుల పెత్తనాన్ని చెవిరెడ్డికి ఇచ్చేశారు. ఇదివరకటిలా విజయసాయిరెడ్డి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో కనిపించడం లేదు. పార్టీలో చొక్కాలు చించుకున్నా లాభంలేదని ఆయనకు అర్ధమైనట్లుంది. అందుకే తారకరత్న మరణం తర్వాత అందరితో బాగున్నారు. వైసీపీకి ఇది నచ్చడం లేదుగానీ ఆ పార్టీ బద్ధశత్రువు రఘురామకృష్ణంరాజు కూడా విజయసాయిరెడ్డిలో మార్పుని ప్రశంసిస్తున్నారు.