కాంగ్రెస్, బీజేపీ స్పీడ్ పెంచడంతో కేసీఆర్ అలెర్టయ్యారు. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చుతూ రాజకీయాలకు పదును పడుతున్నారు. హ్యాట్రిక్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. తెలంగాణలో మరో ఆరు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. దీని తో ప్రతిపక్షాలు స్పీడ్ పెంచాయి. శ్రేణులను అందుకోసం సిద్దం చేసే పనిలో పడ్డాయి. అందులో భాగంగా పార్టీలన్నీ గ్రామాల బాట పట్టాయి. పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి పాద యాత్రతో నియోజకవర్గాల వారిగా ఊరు వాడ చుట్టేస్తున్నారు. దాదాపుగా అభ్యర్థుల పేర్లు ప్రకటిస్తూ కేడర్ లో జోష్ నింపుతున్నారు. మరో వైపు బీజేపీ సైతం కార్నర్ మీటింగ్స్ తో హోరెత్తిస్తోంది. ఇక షర్మిల పాదయాత్ర చేస్తుండటం కమ్యూనిస్టులు కూడా యాక్టివ్ కావడంతో బీఆర్ఎస్ ఇప్పుడు గేమ్ ప్లాన్ మార్చింది.
సిట్టింగులందరికీ టికెట్లిస్తామని కేసీఆర్ ఇటీవల ప్రకటించారు ఇప్పుడా విషయంలో పునరాలోచనలో పడ్డారు. గెలిచే అభ్యర్థులనే బరిలోకి దించాలనే ఆలోచనలో ఉన్న కేసిఆర్ గెలుపు గుర్రాల కోసం వరుసగా సర్వేలు జరిపిస్తున్నారు. ప్రైవేట్ సంస్థలతో పాటు ఇటు ప్రభుత్వ నిఘా వర్గాల ద్వారా సర్వేలు సిద్ధమవుతున్నాయి. ఆ రిపోర్టుల ఆధారంగా ఎవరికి టిక్కెట్లు ఇవ్వాలి సిట్టింగ్లో ఎవరి ఎవరికి పక్కన బెట్టాలి అనే విశ్లేషణలు జరుగుతున్నాయి. 2108 ఎన్నికల్లో బిఆర్ఎస్ 88 సీట్లలో గెలిచింది. ఆ తరువాత కాంగ్రెస్ టిడిపి పార్టీల్లోని ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారు. వారితో కలిపి అసెంబ్లీలో ఆ పార్టీ బలం 103కు చేరింది. అయితే మూడోసారి అధికారంలోకి రావాలంటే బలమైన అభ్యర్థులను రంగంలోకి దించడం కోసం ఎమ్మెల్యేల పనితీరుపై పలు సర్వేలు చేయిస్తునట్లు సమాచారం.
రెండుమార్లు అధికారంలో ఉన్న ప్రభుత్వం పై సహజంగానే కొంత వ్యతిరేకత ఏర్పడుతోంది. ఇప్పుడు మాత్రం పార్టీ కంటే కూడా చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ థియరీ ఆధారంగానే సర్వేలకు సంబంధించి ప్రశ్నలు తయారయ్యాయి. 20కి పైగా ప్రశ్నలు సిద్ధం చేసిన జనంలోకి వదిలారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి నియోజకవర్గంలో వారిపై ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటి ప్రజా మద్దతు ఉందా వారికి టికెట్ ఇస్తే విజయంసాధించే అవకాశముందా. సిట్టింగ్ కు కాకుండా ఇతరుల్లో ఎవరికి టికెట్ ఇస్తే బెనిఫిట్ ఉంటుంది ప్రత్యర్థి పార్టీలో బలమైన నాయకులు ఎవరు, పక్క పార్టీ వారు ఎవరైనా గెలిచే అవకాశం ఉందా. ఇక బిఆర్ఎస్ పై ప్రజల్లో ఎలాంటి ఒపీనియన్ ఉంది ఏ పథకాల పట్ల ప్రజలు సంతృప్తి గా ఉన్నారు ప్రభుత్వం నుంచి జనం కోరుకుంటున్నదేమిటి. వంటి అనేక అంశాల పైన క్షేత్రస్థాయిలో ప్రజల అభిప్రాయాలను సర్వేలలో తెలుసుకుంటున్నారు.
రిపోర్ట్ ల ఆధారంగా వ్యూహాలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇప్పటి వరకు వస్తున్న ఫీడ్ బ్యాక్ సర్వే రిపోర్టులు ప్రకారం 30 మంది సిట్టింగ్స్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరి పై ప్రజల్లో వ్యతిరేక త తీవ్ర స్థాయిలోఉన్నట్లు తేలిందట. మళ్లీ వారికే టికెట్ ఇస్తే మాత్రం ఓడిపోవడం ఖాయమనే చర్చ జరుగుతోంది. నెగిటివ్ రిపోర్ట్ వచ్చిన వారిలో మెజారిటీ ఎమ్మేల్యే లు ఇతర పార్టీల నుంచి కారు పార్టీలో చేరిన వారే ఉన్నట్లు సమాచారం.
ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్టేట్ మెంట్ ను కూడా కొందరు గుర్తు చేస్తున్నారు. కొందరు సిట్టింగులను మార్చితే పార్టీకి ఘనవిజయం ఖాయమని ఆయన ప్రకటించారు. అలాంటి ప్రకటనలు వద్దంటూ ఎర్రబెల్లిని అధిష్టానం వారించినా ఆయన మాటల్లో నిజాలను మాత్రం అర్థం చేసుకుంది. అందుకే కెసిఆర్ కూడా గెలిచే ఛాన్స్ లేని సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానంలో ఆల్టర్ నెట్ నేతలను రంగంలోకి దింపే యోచన లో ఉన్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాంటి వారికి పరోక్ష సంకేతాలు కూడా ఇస్తున్నారనే చర్చ సాగుతోంది. అధికార బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఇప్పుడు టెన్షన్ పట్టుకుంది. అధినేత సర్వేలు చేయిస్తున్నారని తెలియడంతో అందులో ఏముందో అర్థం కాక ఇబ్బంది పడుతున్నారు. దానితో ఇక ప్రతీ ఒక్కరు నియోజకవర్గాల్లో తిరుగుతూ ఓటర్లను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. మరి వారి కోరిక తీరుతుందో లేదో చూడాలి.