బీజేపీలో లావా పొంగే సమయం ఆసన్నమైందా. మోదీ నాయకత్వంపై అసంతృప్తి పెరుగుతోందా.. ఆ నాయకుడి వ్యాఖ్యల వెనుక పరమార్థమేంటి.. నాగ్ పూర్ బాబు నిజంగానే అన్నంతపని చేస్తారా..
ముక్కుసూటిగా మాట్లాడే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. మరో బాంబు పేల్చారు. ప్రస్తుత రాజకీయాల పట్ల తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలనిపిస్తోందని తన మనోగతాన్ని ఆవిష్కరించారు. మహాత్మాగాంధీ కలలుగన్న రాజకీయాలు ఇప్పుడు అంతర్ధానమయ్యాయని ఆయన అన్నారు. నాగ్ పూర్ లో జరిగిన ఒక ప్రైవేటు కార్యక్రమంలో తన ఆవేదనను వెళ్లగక్కారు. ప్రజా సంక్షేమం కోసం చేపట్టాల్సిన సంస్కరణలను రాజకీయ నాయకులు ఎప్పుడో మరిచిపోయారన్నారు. రాజకీయ నాయకులు ఇప్పుడు కేవలం అధికారాన్ని అంటి పెట్టుకుని ఉండేందుకే ఇష్ట పడుతున్నారన్నారు…
ఆరెస్సెస్ కేంద్ర కార్యాలయం నాగ్ పూర్ లోనే ఉంటుంది. ఆయన నియోజకవర్గం కూడా నాగ్ పూరే.. గడ్కరీ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినప్పుడు.. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉండేవారు. ఇద్దరికి పొసికేది కాదని బీజేపీ వర్గాలు తరచూ చెప్పుకుంటుంటాయి. నిజానికి ఆడ్వాణీ, వాజ్ పేయికి గడ్కారీ అత్యంత సన్నిహితుడు. ఆ బ్యాచ్ ను పూర్తిగా దెబ్బకొట్టాలని మోదీ భావించినప్పటికీ… గడ్కరీని ఏమీ చేయలేక తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నారన్న ప్రచారం కూడా చాలా రోజులుగా జరుగుతోంది… పార్టీ వ్యవస్థాపన కాలం నాటి ఆలోచనా విధానంతో గడ్కరీ ముందుకు సాగుతున్నందున.. ప్రస్తుతం నాయకత్వ పోకడలు ఆయనకు నచ్చడం లేదనిపిస్తోంది…
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత డిప్యూటీ సీఎం అయిన దేవేంద్ర ఫడ్నవీస్ .. రాష్ట్ర బీజేపీలో శక్తిమంతమైన నాయకుడిగా ఎదిగారు దానితో రాష్ట్ర పార్టీలో తన ప్రాధాన్యం తగ్గిపోయిందని గడ్కరీ భావిస్తున్నారు. మోదీ తనను దెబ్బకొట్టేందుకు ఫడ్నవీస్ ను ప్రోత్సహిస్తున్నారని గడ్కరీ చాలా రోజులుగా అసంతృప్తి చెందుతున్నారు. నేరుగా అడగలేని పరిస్తితుల్లో ఇండైరెక్ట్ గా తన అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారని చెబుతున్నారు.అందుకే కులం, డబ్బు, ఆశ్రిత పక్షపాతం లాంటి పదజాలాన్ని కూడా ఆయన వాడేస్తున్నారు..పైగా అసెంబ్లీ ఎన్నికల ముందు మహారాష్ట్ర బీజేపీలో జరిగిన కొన్ని సమావేశాలను గడ్కరీ బాయ్ కాట్ చేశారు. అలా జరిగిందని అధిష్టానానికి తెలిసేటట్లు చేశారు..
గడ్కరీ 2009 నుంచి 2013 వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పుడు ఆయనపై కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చాయి. గడ్కరీ నిర్వహణలో ఉన్న పూర్తి గ్రూప్ సంస్థలు.. పన్ను ఎగవేత సహా పలు ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. వీటికి మోదీ విస్తృత ప్రచారం కల్పించి తన పరువు తీశారని గడ్కరీకి కోపంగా ఉండేది. చివరకు గత్యంతరం లేక పార్టీ అధ్యక్ష పదవికి గడ్కరీ రాజీనామా చేశారు. మరో పక్క 2014లో పార్టీ ప్రధాని అభ్యర్థిని ప్రకటించాల్సి వచ్చినప్పుడు తన పేరు ప్రచారంలోేకి రావాలసి గడ్కరీ కోరుకుతున్నారు. గడ్కరీ ఆర్సెసెస్ హార్డ్ కోర్ అయినప్పటికీ.. ఆ సంస్థ మోదీని సమర్థించింది. మోదీ అడ్డదారిలో ప్రధానమంత్రి అయ్యారని గడ్కరీకి ఇప్పుడు కూడా కోపమే… ఇటీవల ఒకసారి కేబినెట్ భేటీలో మోదీ, గడ్కరీ మధ్య మాటల తూటాలు పేలాయట. దమ్ముంటే తనను మంత్రిపదవి నుంచి డిస్మిస్ చేసి చూడాలని గడ్కరీ సవాలు చేశారట. ఆ రోజు మోదీ మాట్లాడిన కొన్ని మాటలను మిత్రుల వద్ద ప్రస్తావిస్తూ గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారట….
ప్రధాని మోదీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని చాలా రోజులుగా పార్టీ సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడికి యూపీ కేబిెనెట్ లో చోటు అడిగితే… కుదరదని మోదీ చెప్పించారట. ఇలాంటి అనేక పరిణామాలు గడ్కరీ లాంటి వారికి అసంతృప్తిని మిగిల్చాయి. కాంగ్రెస్ పార్టీ మనుగడ దేశానికి అవసరమని అంటూ మోదీ ప్రవర్తన పట్ల గడ్కరీ అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్ర పరిణామాలపై కూడా గడ్కరీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారట. అందుకే ప్రస్తుత రాజకీయాల పట్ల ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేశారనుకోవాలి..