ఇందిరాగాంధీ బతికున్నప్పుడు అత్తచాటుకోడలు. రాజీవ్‌గాంధీ రాజకీయాల్లో ఉన్నప్పుడు తెరచాటునే ఉన్నారామె. భర్త హత్యతర్వాతే పార్టీకి పెద్దదిక్కయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ అంటే సోనియాగాంధీ. సోనియా అంటే కాంగ్రెస్‌పార్టీ. వారసుడు బాధ్యతలు నెత్తినేసుకోవడానికి సిద్ధంగా లేకపోయినా తన ఆరోగ్యం సహకరించపోయినా పార్టీకి తానే పెద్దదిక్కుగా ఉన్నారు సోనియాగాంధీ. మల్లికార్జునఖర్గే ఏఐసీసీ అధ్యక్షుడైనా ఆ పార్టీకి దిశానిర్దేశం చేస్తూ వచ్చింది మాత్రం సోనియాగాంధీనే. అలాంటి సోనియాగాంధీ రాయ్‌పూర్ ప్లీనరీలో రాజకీయాలకు గుడ్‌బై చెబుతున్నట్లు చేసిన ప్రకటన కాంగ్రెస్ శ్రేణులను గందరగోళంలో పడేసింది.
భారత్ జోడో యాత్రతో తన ఇన్నింగ్స్ ముగించడం ఆనందంగా ఉందన్నారు సోనియాగాంధీ. దీంతో ఆమె రాజకీయాలనుంచి పూర్తిగా వైదొలిగినట్లు వార్తలొచ్చాయి. అయితే సోనియాగాంధీ ప్రత్యక్ష రాజకీయాలనుంచి పూర్తిగా తప్పుకున్నట్లు కాదనీ ఇకపై అధ్యక్ష బాధ్యతలు చేపట్టననే ఆమె చెప్పారని కాంగ్రెస్ సీనియర్ నేతలు వివరణలిస్తున్నారు. కాంగ్రెస్‌పై ప్లీనరీలో ప్రదర్శించిన వీడియోని చూసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సోనియాగాంధీ. వీడియోని చూస్తే తానెంత ముసలిదాన్ని అయిపోయానో అర్ధమవుతుందన్నారు. మల్లికార్జున ఖర్గే నాయకత్వంలో పార్టీని నడిపేందుకు యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
1998లో తొలిసారిగా పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టారు సోనియాగాంధీ. 19 ఏళ్లపాటు పార్టీ అధ్యక్షురాలిగా కొనసాగారు. పాతికేళ్లలో పార్టీకి ఎన్ని సవాళ్లు ఎదురైనా సహనంతో అందరినీ నడిపించారు. భారత్ జోడో యాత్ర ఎంతో ఆనందం కలిగించిందన్న సోనియాగాంధీ ఆ సంతృప్తితోనే ఇన్నింగ్స్‌కి ముగింపు చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. అనారోగ్య కారణాలతోనే సోనియా పూర్తిగా రాజకీయాలనుంచి దూరం కావాలనుకుంటున్నారని అంతా భావించారు. అయితే సోనియా వ్యాఖ్యల వెనుక అర్ధంవేరేనని పార్టీ నేతలు వివరణ ఇవ్వటంతో కనీసం వచ్చే ఎన్నికలదాకా అయినే సోనియా బ్రాండ్‌తోనే కాంగ్రెస్ ముందుకెళ్లేలా ఉంది.