మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలేలా లేదు. వైసీపీ ప్రతినిధులను సీబీఐ విచారణకు పిలిచినప్పుడల్లా ఆ పార్టీ నేతల్లో ఆందోళన పెరుగుతోంది. రోజుకో కొత్త అంశం వెలుగు చూస్తున్న కొద్దీ టైమ్ దగ్గర పడుతోందన్న ఫీలింగ్ వారిలో పెరుగుతోంది. కొత్త కథలను తెరపైకి తెచ్చి ప్రచారం చేయాలని చూస్తున్నప్పటికీ సీబీఐ దర్యాప్తులో వెలుగులోకి వస్తున్న అంశాల ముందు అవి వెలవెలబోతున్నాయి. ఇప్పటి వరకు తటస్థంగా ఉన్న వారు సైతం క్రమంగా వైసీపీపై అనుమానపడటంతో ఇక ఖేల్ ఖతమైందన్న ఫీలింగ్ వారిలో వస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇదేం ఖర్మరా నాయనా అని జగన్ సహా నేతలంతా తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు 2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి కడప జిల్లా పులివెందులలో మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య ఆ ఎన్నికల్లో వైసిపికి కలిసి వచ్చింది. అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం ఈ హత్య పై సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. నాడు ఈ హత్య వెనుక చంద్రబాబు ఉన్నాడని నారాసుర రక్త చరిత్ర అంటూ సొంత పత్రికలో చంద్రబాబు చేతిలో కత్తి పట్టుకొని ఉన్న ఫోటో వేసిన వైసిపి దాన్ని ఎన్నికల ప్రచారానికి వాడుకుంది. సీబీఐ దర్యాపు చేయాలని గవర్నర్ కు వినతిపత్రం కూడా ఇచ్చింది. వివేకా కుమార్తె హైకోర్టులో పిటిషన్ వేసిన తర్వాత జగన్ తన పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. క్రమంగా కేసు విచారణ వేగవంతమైంది. సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడంతో పాటు తెలంగాణకు బదలీ చేయడం కూడా వైసీపీకి మింగుడు పడటం లేదు.
వివేకా హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. నిందితుడుగా ఉన్న డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిపోవడంతో అతను ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా సీబీఐ తీగ లాగితే డొంకంతా కదిలింది. ఈ కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆయన తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి లను సీబీఐ నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచింది. ఇప్పటికే అవినాష్ రెడ్డి రెండు పర్యాయాలు సీబీఐ విచారణకు వెళ్లి వచ్చారు. అవినాష్ లోపల సీబీఐతో చెబుతున్నదొక్కటీ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నది మరోకటి అన్నట్లుగా పరిస్థితి తయారైంది. పైగా ఆడలేక మద్దెలు ఔడు అన్నట్లుగా మీడియాపై అవినాష్ విషం కక్కుతున్నారు. భాస్కర్ రెడ్డిని ప్రశ్నిస్తే నిజానిజాలు తెలుస్తాయని సీబీఐ భావిస్తోంది.
ఇదే కేసులో సీబీఐ గూగుల్ టేక్ ఔట్ ఆధారంగా సిఎం పిఎస్ కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ భారతి సహాయకుడుగా ఉండే నవీన్ ను కూడా పిలిపించి విచారించింది. అయితే తాజాగా కేసు దర్యాప్తుకు సంబంధించి సీబీఐ వ్యూహం ఎలా ఉంటుందనే అంశం పై వైసిపిలో కీలక నేతలు న్యాయనిపుణులను సంప్రదిస్తున్నారు. గత విచారణ సందర్బంగా అవినాష్ రెడ్డికి అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పి మరీ శుక్రవారం విచారించారు. తదుపరి విచారణ ఎప్పుడు ఉంటుందో ఇంకా తెలీదు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి లో ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వివేకా హత్య కేసులో చంద్రబాబు ఆదినారాయణ రెడ్డి బీటెక్ రవి పాత్ర పై కూడా విచారణ జరపాలని అంటూ ఇదే సమయంలో వివేకా రెండోవ పెళ్లి విషయం పై కూడా వార్తలు వచ్చాయని ఈ దిశగా ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు పై చంద్రబాబు బీజేపీలోని తన కోవర్టుల ద్వారా ప్రభావితం చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
ఇప్పుడు విచారణ మొత్తం వైఎస్ భారతి చుట్టూ తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమె సహాయకుడు నవీన్ ను పిలిపించి సీబీఐ ప్రశ్నించడం ఇంకా హాట్ టాపిక్ గానే కొనసాగుతోంది. హత్య జరిగిన రోజున అవినాష్ రెడ్డి స్వయంగా నవీన్ కు ఫోన్ చేశారని ఆ విషయంలోనే భారతీ సహాయకుడిని పిలిపించి సీబీఐ ప్రశ్నించిందని చెబుతున్నారు. దానితో ఇప్పుడు వివేకా కేసులో అవినాష్, జగన్, భారతీ కీలకమవుతారని న్యాయనిపుణులు చెబుతున్నారు. మరి సీఎం దంపతులను ప్రశ్నిస్తారో లేదో చూడాలి. మరో పక్క వివేకా కేసుకు సంబంధించి టీడీపీ చేస్తున్న వైసీపీ వ్యతిరేక ప్రచారం సక్సెస్ అవుతోంది. హూ కిల్డ్ బాబాయ్ నుంచి అబ్బాయి కిల్డ్ బాబాయ్ వరకు అన్ని క్యాంపైన్లు సక్సెస్ అయ్యాయి దానితో బయటకు చెప్పుకోకపోయినా తాడేపల్లి ప్యాలెస్ వణికిపోతోందన్నది మాత్రం నిజం.