కొండా సురేఖ అక్కడ నుంచే పోటీ

By KTV Telugu On 26 February, 2023
image

పార్టీలు మారుతూ వచ్చే కొండా దంపతులు కాంగ్రెస్ లో ఉంటారా అన్న ప్రశ్న చాలా కాలంగా తలెత్తుతోంది. అందుకే అనేక కారణాలు లేకపోలేదు. కాంగ్రెస్ కు కంచుకోటగా ఉండే వరంగల్ తూర్పు నియోజకవర్గంపై వాళ్లు పట్టుబట్టడమే ఇందుకు కారణంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. వరంగల్ తూర్పు నుంచి తామే పోటీ చేస్తామని కొంత కాలంగా కొండా దంపతులు ప్రచారం చేసుకుంటూ అవసరమైతే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వంతో వివాదానికి సైతం సిద్ధమైన నేపథ్యంలోనే పార్టీలో వారి కొనసాగింపుపై అనుమానాలు తలెత్తాయి. కింది స్థాయి కార్యకర్తలు సైతం వారి కొనసాగింపుపై అనుమానాలు వ్యక్తం చేశారు. పైగా పార్టీలో తమకు తగిన గౌరవం దక్కడం లేదని కొండా సురఖే చేసిన ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోశాయి.

ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాదయాత్ర కొండా దంపతుల వైఖరిలో మార్పు తీసుకొచ్చింది. అందరినీ బుజ్జగిస్తూ వచ్చిన రేవంత్ ఇప్పుడు కొండా దంపతులను కూడా దారికి తీసుకొచ్చారని చెబుతున్నారు. కరెక్టుగా చెప్పాలంటే ఇన్నాళ్లు కొండా సురేఖ కొండా మురళీ దంపతులు పార్టీ నుంచి మరో టికెట్ ఆశించారు. వరంగల్ తూర్పుతోపాటు పరకాల లేదా భూపాలపల్లి టికెట్ తమకు ఇవ్వాలన్న పట్టు బట్టారు. కానీ ఇటీవల పాదయాత్రకు వచ్చిన రేవంత్ రెడ్డి కొండా దంపతులతో ప్రత్యేకంగా మాట్లాడారట. పార్టీలోని పరిస్థితులను జరగబోయే పరిణామాలను అన్నీ విశ్లేషించి చెప్పారట. వరంగల్ తూర్పు నియోజకవర్గం టికెట్ కొండా సురేఖకు కన్ఫామ్ చేసి పార్టీలోని పదవులపైనా హామీ ఇచ్చారట. దీంతో కొండా దంపతులు కూడా రేవంత్ మాట కాదనలేకపోయారట. ఇకపై తూర్పునియోజకవర్గంలో గెలుపే టార్గెట్‌గా కొండా దంపతులను సిద్ధం చేశారు రేవంత్ రెడ్డి. అదే విషయం వరంగల్ తూర్పు నియోజకవర్గంలో జరిగిన కార్నర్ మీటింగ్ లోనూ తేటతెల్లమైంది.

దీనితో కొండా దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రేవంత్ రెడ్డిని వాళ్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పోల్చారు. అప్పుడు రాజశేఖర్ రెడ్డితో తమ కుటుంబం ప్రదర్శించిన విశ్వాసమే రేవంత్ పట్ల చూపుతామని రేవంత్ రెడ్డే కాబోయే ముఖ్యమంత్రి అని ఆకాశానికి ఎత్తేశారు. తర్వాత మాట్లాడిన రేవంత్ రెడ్డి కూడా కొండా దంపతుల పట్ల అంతే గౌరవం ప్రదర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కొండా దంపతులకు ఎలాంటి గుర్తింపు గౌరవం దక్కిందో ఇకపై కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ అలాంటి గౌరవం గుర్తింపు ఉంటుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. దీనితో మీకుమేము మాకు మీరు అన్నట్టుగా కొండాదంపతులు రేవంత్ రెడ్డి మధ్య జరిగిన పరిణామాలు కనిపిస్తున్నాయి. అంతటితో ఆగకుండా తమ ఉమ్మడి శత్రువుగా భావిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావును కూడా మానసికంగా దెబ్బకొట్టాలని నిర్ణయించుకున్నారట.

అంతర్గతంగా జరిగిన చర్చలతోపాటు  కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన మాటలతో కొండా దంపతుల రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ కార్యకర్తలకూ క్లారిటీ వచ్చిందన్న చర్చ జరుగుతోంది. ఇన్నాళ్లూ పార్టీ వీడుతారన్న చర్చకు చెక్ పడింది. వరంగల్ తూర్పు టికెట్ ఆశించిన ఇతర నేతలకు క్లారిటీ వచ్చింది. కొండా దంపతులకు స్థానిక నేతలు సహకరించాల్సిన అనివార్యత ఏర్పడింది.