ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ మళ్లీ జూ.ఎన్టీఆర్‌ను దువ్వే ప్రయత్నం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కోసం ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీడీపీ అధినేత భావిస్తున్నారు. ఇప్పటికే పవన్ పార్టీతో జతకట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే మెగా క్యాంప్‌కు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్‌ను పలు సందర్భాల్లో ప్రశంసలు గుప్పించడం ద్వారా అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది ఆ పార్టీ. అదేసమయంలో జూ.ఎన్టీఆర్‌ను లాగడం చర్చనీయాంశంగా మారింది. తిరుపతిలో పాదయాత్ర నిర్వహిస్తున్న సందర్భంగా లోకేష్ యువతతో ఫేస్ టు ఫేస్ నిర్వహించారు. ఆ సందర్భంగా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మీరు ఆహ్వానిస్తారా అని ఓ యువకుడు అడిగిన ప్రశ్నకు తప్పకుండా అంటూ బదులిచ్చారు లోకేష్. అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండాలని కోరుకునే వారంతా రాజకీయాల్లోకి రావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. రాజకీయాల్లో మొదట కావాల్సింది మంచి మనసు అన్న లోకేశ్ 2014లోనే పవన్ కళ్యాణ్ లో మంచి మనసు చూశానన్నారు. చంద్రబాబు తన తనయుడు లోకేష్ కోసం ఎన్టీఆర్‌ను తొక్కేస్తున్నారని ప్రత్యర్థులు తరచూ విమర్శలు గుప్పిస్తుంటారు. ఈ సమయంలో లోకేష్ ఎన్టీఆర్‌ను ఆహ్వానిస్తూ చేసిన ప్రకటన కొత్త చర్చకు దారితీసింది.
లోకేష్ చేసిన ప్రకటనపై తారక్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. కానీ ఆయన సన్నిహితులైన కొడాలి నాని వల్లభనేని వంశీలు మాత్రం ఓ రేంజ్లో లోకేష్‌పై విరుచుకుపడుతున్నారు. ఎవరు పెట్టిన పార్టీలోకి ఎవరిని ఆహ్వానిస్తున్నారంటూ చంద్రబాబు లోకేష్‌లపై చెలరేగిపోయారు. టీడీపీని స్థాపించింది ఎన్టీఆర్ అని లోకేశ్ తాత ఖర్జూర నాయుడు కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్ ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవుతాడని ఆయన్ను ఆహ్వానించడానికి లోకేష్ ఎవరంటూ అటాక్ చేస్తున్నారు. అంతేకాదు టీడీపీ బాధ్యతలను జూనియర్ ఎన్టీఆర్ కు అప్పగించాలని ఎప్పటిలాగే తమ డిమాండ్‌ను వినిపించారు. 2009 ఎన్నికల్లోనే జూ.ఎన్టీఆర్ టీడీపీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం గెలవలేకపోయింది. ఆ సమయంలో లోకేష్ ఇంకా రాజకీయ వాసనే చూడలేదు. ఇక ఆ తర్వాత లోకేష్‌ను రాజకీయాల్లోకి తీసుకొచ్చే క్రమంలో బాబు ఎన్టీఆర్‌ను పక్కనబెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. అప్పట్నుంచి తారక్ ఆ కుటుంబానికి కాస్త దూరంగానే ఉంటున్నారు. తన ఫోకస్ అంతా సినిమాలపైనే పెట్టారు.
అయితే నారా కుటుంబంపై రాజకీయ విమర్శలు వచ్చిన ప్రతీసారి ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ నేతలు. కొద్ది నెలల క్రితం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో కొందరు టీడీపీ నేతలు జూనియర్ ఎన్టీఆర్ లక్ష్యంగా విమర్శలు కూడా చేసారు. వాటిని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పి కొట్టారు. ఆ తరువాత కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం తమ్ముళ్లను కలవరపాటుకు గురిచేసింది. వచ్చే ఎన్నికల్లో జూనియర్ ఎన్టీఆర్ ను తిరిగి పార్టీలోకి తీసుకురావాలనే డిమాండ్ కొందరు బలంగా వినిపిస్తున్నారు. లోకేష్ కారణంగానే జూనియర్ కు అవకాశం దక్కటం లేదనే ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలోనే అటు పవన్ కళ్యాణ్, ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ ఎన్నికల వేళ బ్యాలెన్స్ చేసుకోవాలనేది టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. లోకేష్ ఆహ్వానించినా జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎన్నికల సమయంలో తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే అవకాశాలు కనిపించటం లేదు.