కన్నా మెడలో పచ్చ కండువా.. రాయపాటి కళ్లల్లో ఎర్ర జీరలు

By KTV Telugu On 27 February, 2023
image

సృష్టిలో ప్రతీ చర్యకీ సమానమైన ప్రతి చర్య ఉంటుందని న్యూటన్ ఎప్పుడో చెప్పాడు. రాజకీయాల్లో ప్రతి చర్య అనేది అత్యంత సహజమైన ప్రక్రియ అంటారు పొలిటికల్ సైంటిస్టులు. ఓ పార్టీలో ఒకరు వస్తున్నారంటే ఆ పార్టీలో ఉన్న ఇంకొకరు బయటకు పోవడానికి రంగం సిద్ధం అవుతుందనే అనుకోవాలంటున్నారు వారు. ఏపీ లో తెలుగుదేశంలో చోటు చేసుకుంటోన్న వ్యవహారాలే అందుకు నిదర్శనమని వారు అంటున్నారు.

మాజీ కాంగ్రెస్ నాయకుడు బిజెపి తాజా మాజీ నేత కన్నా లక్ష్మీనారాయణ మొత్తానికి చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అందుకు గుర్తుగా చంద్రబాబు నాయుడు ఓ పచ్చ కండువాను కన్నా భుజాలపై కప్పారు. ఆ వెంటనే కన్నా చాలా గొప్పనాయకుడని కన్నాను పొగిడారు. చంద్రబాబు అంతటి నాయకుడే తనని పొగిడే సరికి ఉక్కిరి బిక్కిరి అయిన కన్నా లక్ష్మీనారాయణ కూడా చంద్రబాబును మించిన నేత మరొకరు లేరని బాబుపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇద్దరు రాజకీయ దిగ్గజాలు అలా ఒకరినొకరు కొనియాడుకోవడం చూసిన వారికి కళ్లకింపుగా అనిపించి ఉంటుంది. కాకపోతే కొద్ది రోజుల క్రితమై సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియో మాత్రం ఎన్నో ప్రశ్నలను సంధించింది. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఓ టీవీ ఛానెల్ కు కన్నా లక్ష్మీనారాయణ ఇచ్చిన వన్ టూ వన్ ఇంటర్వ్యూలోని ఓ బిట్ బాగా వైరల్ అవుతూ వచ్చింది.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్-టిడిపిల మధ్య రాజకీయ వైరం తీవ్ర స్థాయిలో ఉన్న రోజుల్లో టిడిపి నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రముఖ కాపునాయకుడు వంగవీటి రంగాతో పాటు తననుకూడా హతమార్చడానికి విశ్వప్రయత్నాలు చేశారని కన్నా లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణ చేశారు. వంగవీటి రంగా విషయంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు కానీ తన విషయంలో మాత్రం అనుకున్నది సాధించలేకపోయారని కన్నా అన్నారు. దానికి కారణం కూడా ఆయనే చెప్పారు. తనను భౌతికంగా లేకుండా చేద్దామని చంద్రబాబు అనుకుంటోన్నట్లు తెలియగానే టిడిపి వ్యవస్థాపకుడు ఎన్టీయార్ చంద్రబాబును పిలిచి చివాట్లు పెట్టారని అటువంటి ప్రయత్నాలు చేయద్దని మందలించారని అందుకే చంద్రబాబు తన విషయంలో ఇక ముందుకు వెళ్లలేదని కన్నా లక్ష్మీనారాయణ టీవీ యాంకర్ తో చెప్పిన విషయం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సిల్వర్ జూబ్లీ ఆడేసింది. ఇపుడు నెటిజన్లు కూడా ఆ వీడియో క్లిపింగ్ నే ప్రస్తావిస్తూ మరి మిమ్మల్ని చంపాలనుకున్న చంద్రబాబు పార్టీలోకి ఎందుకు వెళ్లినట్లు అని ట్రోల్ చేస్తున్నారు.

రాజకీయాల్లో శాస్వత శత్రువులు శాస్వత మిత్రులు ఉండరనడానికి ఈ ఇద్దరి తాజా అనుబంధమే తిరుగులేని నిదర్శనమని పొలిటికల్ సెటైరిస్టులు అంటున్నారు. అయితే అది అందరి విషయంలోనూ నిజం కాదంటున్నారు రాజకీయ పండితులు. ఎందుకంటే కన్నా లక్ష్మీనారాయణ పేరు చెబితేనే ఒంటిపై తేళ్లూ జెర్రెలూ పాకుతున్నట్లు జుగుప్సతో చూసే మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇప్పటికీ కన్నాపై మండిపడుతూనే ఉన్నారు. కన్నా లక్ష్మీనారాయణ టిడిపిలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమాచారం వైరల్ కాగానే రాయపాటి దానిపై సీరియస్ అయ్యారు. కన్నా ఎంట్రీని టిడిపిలో ఒక్క చంద్రబాబు తప్ప ఇంకెవరూ ఇష్టపడ్డం లేదని రాయపాటి పేర్కొన్నారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరి జిల్లాలో ఎక్కడి నుండి పోటీ చేసినా ఆయన్ను ఓడించి తీరతామని రాయపాటి శపథం చేశారు. గతంలో తననూ చంద్రబాబును నోటికొచ్చింది తిట్టిన కన్నా లక్ష్మీనారాయణను పార్టీలోకి ఆహ్వానించడమే సిగ్గుమాలిన చర్య అని రాయపాటి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 2010లో కన్నా లక్ష్మీనారాయణ తనపై పరువు నష్టం దావా వేశారని అన్న రాయపాటి 12 ఏళ్ల తర్వాత ఈ మధ్యనే ఆ కేసును ఉపసంహరించుకుని రాజీ చేసుకున్నారని అన్నారు. బహుశా టిడిపిలో చేరాలని అప్పుడే ఆయన అనుకుని ఉంటారని రాయపాటి వ్యాఖ్యానించారు.

కన్నా ఎంట్రీని తాను వ్యతిరేకిస్తున్నట్లు తెలిసి పార్టీ అధ్యక్షుడు అచ్చెంనాయుడు తనకు ఫోను చేశారని కన్నా చేరికపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయద్దని చెప్పారని రాయపాటి గుర్తు చేసుకున్నారు. ఇలాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే పార్టీలో ఎవరు ఉంటారని రాయపాటీ సీరియస్ అయ్యారు. గత ఎన్నికల్లో కన్నాకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలీదా అటువంటి నాయకుడి రాకతో పార్టీకి ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు. కన్నా లక్ష్మీనారాయణ రాక టిడిపిలో చాలా మందికి ఇష్టం లేదు. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం కన్నా ను చేర్చుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారట. బహుశా టిడిపి అత్యంత బలహీనంగా ఉంది కాబట్టే చంద్రబాబు ఎవరు వచ్చినా మంచిదేనని భావిస్తున్నట్లు ఉందని వారు అంటున్నారు. ఇప్పటికే టిడిపిలోని కాపు నేతలు కన్నా రాక పట్ల అసహనంగా ఉన్నారని అంటున్నారు. రెండు వరుస ఎన్నికల్లో ఓడిపోయిన కన్నా లక్ష్మీనారాయణను చేర్చుకోవడం వల్ల పార్టీకి ఒరిగేదేంటని వారు నిలదీస్తున్నారు. పార్టీలో ఉన్న జనాకర్షక నేతలను పక్కన పెట్టి బయటి నుండి కన్నా లాంటి వేస్ట్ లీడర్లను తీసుకురావడం కరెక్టు కాదని వారు అచ్చెంనాయుడికే చెప్పినట్లు తెలుస్తోంది.