మంత్రి శ్రీనివాస్ గౌడ్ మంత్రిగా కిక్కిచ్చేలా చేయగలిగారా.. తుస్సుమనిపించారా

By KTV Telugu On 27 February, 2023
image

ఏదైనా ఓ టీమ్‌ను ఎన్ని వడ పోతల తర్వాత ఎంపిక చేసుకున్నా అందులో అందరూ చురుకైన వాళ్లు ఉండరు. అలాగే ఉందరూ నిస్సత్తవుగా ఉండేవాళ్లు ఉండరు. అలాగని వారు టాలెంట్ లేని వాళ్లేమీ కాదు. కొంత మంది దూకుడుగా ఉంటారు. మరికొంత మంది స్లోగా ఉంటారు. కానీ ఆ పనివల్ల ఫలితాలు మాత్రం ఈ స్వభావాలకు విరుద్ధంగా వస్తూంటాయి. రాజకీయాల్లో మాత్రం ప్రజల ముందు కనిపించాల్సిన ఇమేజ్ కూడా ముఖ్యం కాబట్టి టీమ్‌లో జోష్‌గా ఉండే వాళ్లకు ఎక్కువ ఫోకస్ వస్తుంది. తెలంగాణ మంత్రివర్గంలో రెండు రకాలుగా ఉండే మంత్రులు ఉన్నారు. జోష్ గా ఉండే మంత్రుల్లో ఒకరు వి శ్రీనివాస్ గౌడ్. మందు మంత్రిగా ముచ్చటగా చెప్పుకునే శ్రీనివాస్‌గౌడ్‌కు ఎక్సైజ్ మాత్రమే కాదు స్పోర్ట్స్ యూత్ అఫైర్స్ టూరిజం అండ్ కల్చర్ ఆర్కియాలజీ వంటి శాఖలు ఉన్నాయి. ఓ రకంగా కీలక మంత్రి అన్నమాట. తెలంగాణ సీఎం కేసీఆర్ అభిమానాన్ని దండిగా సంపాదించుకున్న ఈ మాజీ ఉద్యోగ సంఘం నేత మరి కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారా. అనుకున్న విధంగా పని చేశారా  అటు ప్రభుత్వానికి ఇటు పార్టీకి ప్లస్ అయ్యారా మైనస్సా.

వి. శ్రీనివాస్ గౌడ్ నాలుగైదు శాఖలకు మంత్రిగా ఉన్నారు కానీ ఒక్క సారైనా అధికారికంగా ఫలానా శాఖపై ప్రెస్ మీట్ పెట్టిన విషయం ఎవరికైనా గుర్తుంటుందా అసలు పెట్టలేదనే అనుకోవచ్చు. అబ్కారీ శాఖలో ఏదైనా వివాదం తలెత్తితే వివరణ ఇవ్వడానికి మాట్లాడతారు కానీ విధానపరమైన నిర్ణయాల విషయంలో ఆయన సమీక్షలు చేసింది నిర్ణయాలు తీసుకుంది ఎవరికీ తెలియదు. అదొక్కటే కాదు ఆయన నిర్వహిస్తున్న స్పోర్ట్స్ యూత్ ఆఫైర్స్ టూరిజం అండ్ కల్చర్ ఆర్కియాలజీ కూడా అంతే. ఇటీవల హైదరాబాద్‌లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ నిర్వహించారు. ఆయన పాత్రేమీ కనిపించలేదు. హెచ్ సీఏ వివాదాల్లో అప్పుడప్పుడూ జోక్యం చేసుకున్నారు కానీ అది కూడా వివాదమే అయింది. ఇక తెలంగాణలో టూరిజం చాలా గొప్పగా ఉంటుంది ఉంది కూడా. కానీ ఈ విషయంలో ఆయన పాత్ర ఏమైనా ఉందా కొత్తగా ఏమైనా చేశారా అంటే చెప్పడం కష్టం. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏ శాఖ కీలక నిర్ణయాలన్నీ ఆయా మంత్రులకు పెద్దగా తెలియకుండానే జరిగిపోతూంటాయి. కొన్ని సందర్భాల్లో అధికారికంగా వారు తెర ముందుకు వస్తారు. శ్రీనివాస్ గౌడ్ కూడా అలాగే నిమిత్త మంత్రి. అయితే ఈ శాఖల పనితీరు ఆయన పనితీరే కాబట్టి పాస్ మార్కులు ఇచ్చేయవచ్చు. అబ్కారీ శాఖ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి ప్రధాన ఆదాయవనరుగా మారింది. టూరిజం నుంచి కూడా మంచి ఆదాయం వస్తోంంది. పెద్దగా ఎదురుదెబ్బలు శాఖా పరమైన వివాదాలు లేకుండా శ్రీనివాస్ గౌడ్ నెట్టుకొచ్చేశారు.

కానీ రాజకీయంగా శ్రీనివాస్ గౌడ్ చేసే సౌండ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అతి ఎక్కువగా వివాదాలే. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సంద‌ర్భంగా భార‌త స్వాతంత్య్ర వ‌జ్రోత్స‌వాల పేరుతో తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఫ్రీడమ్ ర్యాలీలో పోలీసు దగ్గర నుంచి తుపాకీ తీసుకుని గాల్లోకి కాల్చేశారు. దీంతో అందరూ అవాక్కవ్వాల్సి వచ్చింది. అలాంటి ప్రవర్తన ఆయన పదవి చేపట్టినప్పటి నుంచి ఉంది. ఆయన హత్యకు కుట్ర పన్నారంటూ కొంత మందిని ఢిల్లీ నుంచి పోలీసులు తీసుకొచ్చిన వ్యవహారం సంచలనం అయింది. శ్రీనివాస్ గౌడ్ పై అనర్హతా వేటు వేయించడానికి వారు పోరాడుతున్నారు. దీంతో వారిపై హత్యకు కుట్ర పేరుతో అరెస్ట్ చేయడం దుమారం రేపింది. ఈ వ్యవహారం పై తెలంగాణ సమాజంలో ఎన్నో అనుమానాలున్నాయి. ఈ కేసు ఇప్పటి వరకూ తేలలేదు. ఇక ఇతర రాజకీయ పార్టీలపై ఆయన చేసే విమర్శలు హద్దులు దాటి ఉంటాయి. కేసీఆర్ కోసం సైన్యం రెడీగా ఉందని చావడానికైనా చంపడానికైనా సిద్ధం అంటూ ప్రకటనలు చేస్తూ ఉంటారు. ఈ వివాదాలన్నీ టీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగానూ మేలు చేసేవి కావు. కానీ ఆయనకు బీఆర్ఎస్ పెద్దల అండ ఉంది కాబట్టి ఆయన అనుకున్నట్లుగానే అన్నీ సజావుగా సాగిపోతున్నాయి.

మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉమ్మడి మహబాబూ నగర్ జిల్లాకు మంత్రిగా ఉన్నారు. పార్టీని బలోపేతం చేశారా అంటే అంత తీరిక ఆయనకు ఎక్కడదన్న వాదన బీఆర్ఎస్ క్యాడర్ వినిపిస్తూ ఉంటుంది. పాలమూరు జిల్లాలో ఏ పెద్ద డీల్ జరిగినా ఆయన పేరు ప్రముఖంగా బయటకు వస్తుంది. బీఆర్ఎస్ పార్టీ ద్వితీయశ్రేణి నేతలు శ్రీనివాస్ గౌడ్ పై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉంటారు. ఇతర నేతలతోనూ ఆయనకు పెద్దగా సఖ్యత లేదు. శ్రీనివాస్ గౌడ్ పై ఓ కౌన్సిలర్ హెచ్చార్సీకి కూడా ఫిర్యాదు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం పార్టీకి కనీస మేలు చేయలేదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది.

ఉద్యోగిగా ఉన్నప్పుడు ఆయన రెండు మూడు సార్లు ఏసీబీకి పట్టుబడ్డారు. ఉద్యమం పుణ్యాన ఆయన ఓవర్ నైట్ ఉద్యోగ సంఘం నేత అయ్యారు. గెజిటెడ్ ఆఫీసర్స్ అనే గ్రూప్ పెట్టేసుకుని లీడర్ అయిపోయారు. రాష్ట్రం ఏర్పడగానే ఇక ఉద్యోగం వదిలేసి రాజకీయంలోకి వచ్చారు. కేసీఆర్ ప్రాపకాన్ని పొందడానికి ఆయనకు తెలియని రాజకీయం లేదు కాబట్టి అప్రహతిహతంగా ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్‌కు కేటీఆర్‌కు అత్యంత సన్నిహిత మంత్రుల్లో ఒకరు. కానీ ఆయన వల్ల అటు ప్రభుత్వానికి కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీకి కానీ ఏమైనా మేలు జరిగిందా అంటే ప్చ్ అని అనుకోక తప్పదు. కానీ రాజకీయాల్లో ఈ పని తీరే కొలమానం కాదు అంతకు మించిన పనులు కూడా ఒక్కో సారి పార్టీలో ప్రాధాన్యతలు నిర్ణయిస్తాయి. అందులో విధేయత ఒకటి. శ్రీనివాస్ గౌడ్ కు ఈ విధేయత ప్లస్ గా మారింది. అయితే మంత్రిగా ఆయన పని తీరు మాత్రం నాసికంగా ఉంది. కనీసం పాస్ మార్కులు కూడా వేయలేం !