ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో దర్యాప్తు సంస్థలు దూకుడుతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బడా వ్యాపారవేత్తలు నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆప్ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ హస్తినలో ప్రకంపనలు రేపగా, ఈ ఎపిసోడ్ తెలంగాణ సర్కార్‌ను షేక్ చేస్తోంది. సిసోడియాను సీబీఐ అదుపులోకి తీసుకున్న వేళ బీజేపీని బీఆర్ఎస్ టార్గెట్ చేస్తోంది. మనీశ్ సిసోడియా అరెస్ట్ అప్రజాస్వామికమని కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాలపై దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీజేపీ ఆప్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తప్పుడు కేసుల్లో ఇరికించే ప్రయత్నం చేస్తోందని హరీష్ రావు ఫైర్ అయ్యారు. ఢిల్లీ మేయర్ పీఠాన్ని ఆప్ కైవసం చేసుకోవడాన్ని బీజేపీ జీర్ణించుకోలేక లేకనే సిసోడియా అరెస్ట్ అంటూ గులాబీ నేతలు గరగరం అవుతున్నారు.
సిసోడియా తరహాలోనే కవిత అరెస్ట్ అవుతారంటూ అటు కమలనాథులు బీఆర్ఎస్పై బాణం ఎక్కుపెడుతున్నారు. పంజాబ్ గుజరాత్ ఎన్నికల సమయంలో ఆమ్ఆద్మీ పార్టీకి ఎమ్మెల్సీ కవిత 150 కోట్ల రూపాయలు చెల్లించారంటూ బీజేపీ నేత వివేక్ సంచలన ఆరోపణలు గుప్పించారు. కేసీఆర్ తెలంగాణలో అక్రమంగా సంపాదించిన డబ్బులును దేశవ్యాప్తంగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే కవితను సీబీఐ అధికారులు ప్రశ్నించారు. సీఆర్పీసీ 160 కింద కవితకు నోటీసులు ఇచ్చిన అధికారులు ఆ తర్వాత ఆమె ఇంటికి వచ్చి వివరాలు సేకరించారు. అప్పటికే ఆ కేసులో అరెస్ట్ అయిన కొందరు నిందితులు రిమాండ్ రిపోర్టులో చెప్పిన వివరాల ఆధారంగా కవితను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. సిసోడియా అరెస్ట్ ద్వారా ఈ కేసులో ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదనే సంకేతాలు పంపుతోంది మోడీ సర్కార్.
ఢిల్లీ మద్యం కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో పాటు ఎమ్మెల్సీ కవిత వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డిలతో పాటు పలువురికి సంబంధం ఉన్నట్టు ఈడీ పేర్కొంది. ఇప్పటికే మద్యం స్కాంలో కొంత మందిని సీబీఐ అరెస్ట్ చేసింది. కవితను అరెస్ట్ చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. సీబీఐ హెడ్ క్వార్టర్స్‌లో సుమారు ఎనిమిది గంటలకుపైగా విచారణ జరిపిన అనంతరం సిసోడియాను అరెస్టు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ కేసులో సిసోడియా నేరపూరిత కుట్రపన్నారని సాక్ష్యాలను నాశనం చేసేందుకు ప్రయత్నించాడని సీబీఐ ఆరోపించింది. ఈ కేసులో ప్పటి వరకు ఆప్ కమ్యూనికేషన్ ఇంచార్జి విజయ్ నాయర్ సహా తొమ్మిది మందిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ఈ స్కాంలో దాదాపు 36 మంది ప్రమేయం ఉన్నట్లు ఈడీ పేర్కొంది. అయితే దాదాపు ఆర్నెళ్ల విచారణ తరువాత మనీశ్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది.