సాధారణంగా కాస్తంత రక్తం చూస్తేనే కళ్లు తిరిగిపడిపోయే తత్వం యువకుల్లో ఉంటుంది. మనిషి శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్న దృశ్యాలు కూడా చూడటం అంటే చాలా మంది చానల్ మార్చేసుకుంటారు లేకపోతే కళ్లు మూసుకుంటారు. కానీ ఇప్పుడు యువతలో స్వయంగా అలా ముక్కలుగా నరకడం అదీ కూడా స్నేహితుడ్ని అలా చంపడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు.
నల్గొండ జిల్లాలోని ఎంజీ యూనివర్సిటీలో నవీన్ హరిహర కృష్ణలు ఇంజినీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నారు. ఇద్దరూ ఒకే అమ్మాయిని ప్రేమించారు. ఆ అమ్మాయి కూడా ఇద్దరితో చనువుగా ఉంది. తన కంటే ఎక్కువ హరహరకృష్ణతో చనువుగా ఉంటోందని నవీన్ కోపం పెంచుకున్నాడు. నవీన్ ను చంపేయాలనుకున్నాడు. ఈనెల 17వ తేదీన పార్టీ చేసుకుందాం రమ్మని అబ్ధుల్లాపూర్ మెట్ లోని తన ఫ్రెండ్ రూంకి నవీన్ ను పిలిచాడు. మద్యం తాగించి చంపేశాడు. అదీ అలా ఇలా కాదు. దారుణంగా చంపేశాడు. మర్మాంగం పెదాలు గుండె ఇలాంటి భాగాలను వేరు చేశాడు. వాటి ఫోటోలు తీసి ఈ వేలే కదా నిన్ను తాకింది ఈ పెదాలే కదా నిన్ను కోరింది ఈ గుండెనే కదా నిన్ను ప్రేమించిందంటూ ఫొటోల కింద రాస్తూ వాట్సాప్ ద్వారా యువతికి మెసేజ్ లు పెట్టాడు. చివరకు నవీన్ తలను కోసి దూరంగా పడేశాడు. నవీన్ మిస్సయిన వ్యవహారంపై పోలీసు కేసు నమోదు కావడంతో దర్యాప్తు ప్రారంభం కావడంతో దొరికిపోతాన్న భయంతో హరహరకృష్ణ పోలీసులకు లొంగిపోయారు. అసలు జరిగిందేమిటో చెప్పడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు.
హిందీ డబ్బింగ్ సీరియస్ సీఐడీ నేరాలను చేధించే సీరిస్ ప్రసారం చేస్తూ ఉంటుంది. ఎలా నేరాలు చేస్తారు ఎలా తప్పించుకోవాలన్నది ఇందులో విపులంగా ఉంటుంది. దీన్ని సీరియస్‌గా స్టడీ చేసిన హరిహరకృష్ణ ప్లాన్ చేశాడు. నవీన్‌ను హత్య చేసే క్రమంలో దొరకకుండా ఉండేలా ప్రయత్నించాడు. కత్తితో పొడిచే ముందు చేతికి గ్లౌజులు వేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లినప్పుడు గ్లౌజులు మాస్కులు ఉన్నట్లు గుర్తించారు. హత్య జరిగిన ప్రదేశంలో రక్తపు మరకలున్నాయి. హత్య ఎంత ఘోరంగా జరిగిందో వాట్సాప్ చూస్తే తప్ప పోలీసులకు అర్థం కాలేదు. అయితే సీఐడీ సీరియల్ చూసేవాడు లేకపోతే మరో క్రైమ్ ధ్రిల్లర్ చూసేవారు. అదే సమయంలో ఇంటర్నెట్ మొత్తం సెర్చ్ చేసి తనకు కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాడు. ఇక్కడ తప్పు సీఐడీ సీరియల్‌దో మరొకటో కాదు. ఖచ్చితంగా తన స్నేహితుడ్ని అత్యంత ఘోరంగా చంపాలనే ఆలోచన రావడమే తప్పు. అసలు ఇంకా జీవితం అంటే చూడని పిల్లల్లో ఈ ఆలోచన ఎలా వస్తోంది.
హరిహరకృష్ణకు నవీన్ మిత్రుడు. పగబట్టినా కొట్టడానికి కూడా సంకోచించాల్సిన వయసు. ఎందుకంటే కాలేజీ వయసులో అంతా స్నేహితులే ఉంటారు. కానీ హరిహరకృష్ణ లాంటి వాళ్ల ఘటనలు బయటకు వచ్చినప్పుడు ఒళ్లు గగుర్పొడుస్తుంది. హత్య చేసి పోలీసులకు లొంగిపోయిన తర్వాత కూడా హరిహరకృష్ణలో ఎలాంటి పశ్చాత్తాప చాయలు కనిపించలేదని పోలీసులు చెబుతున్నారు. ఇది యువత మనసుల్లో వస్తున్న భయంకరమైన మార్పులకు ప్రతి బంబం అనుకోవచ్చు. చిన్నపాటి హింసాత్మక ఘటనకు పాల్పడితేనే జీవితాంతం బాధపడేవారు ఉంటారు. అంత ఎందుకు మనలోనే ఎవరికైనా చిన్న అపాయం తెలియక చేసినట్లుగా అనిపించినా ఆ గిల్టీ ఫీలింగ్ జీవితం మొత్తం ఉంటుంది. కానీ నేటి కాలేజీ కుర్రకారులో ఆ సున్నితత్వం మిస్సవుతోంది.
ఇటీవల ప్రేమ కోసం చంపడం చావడం అనే కాన్సెప్ట్ తో సినిమాలు ఓటీటీ సీరిస్‌లు వస్తున్నాయి. ఇలాంటివి యువత మెదడుపై అధిక ప్రభావం చూపిస్తున్నాయి. అయితే మంచి విషయాలు చెప్పినప్పుడు తలకు ఎక్కించుకోని యువత చెడ్డ విషయాలను మాత్రమే పాటిస్తారా అనే నిష్టూరం వినిపించవచ్చు. పాటించకపోవచ్చు కానీ ఏదైనా చేయాలని మనసులోకి వచ్చినప్పుడు ఇవి గుర్తుకు వస్తాయి అక్కడే అసలు బీజం పడుతుంది. పెరిగి పెద్దదవుతుంది. కుటుంబం గురించి తమపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్న తల్లిదండ్రుల గురించి తోబుట్టువుల గురించి అసలు ఆలోచించడం లేదు. చంపడం లేకపోతే చావడం అన్నట్లుగా మానసిక స్థితి మారిపోతోంది. ఫలితంగా ఉన్మాదులు క్రూరమృగాలుగా మారిపోతున్నారు.
ఇంజినీరింగ్ కాలేజీలు ఎక్కువైపోయాయి. ప్రతీ ఒక్కరూ ఇంజినీరింగ్ అంటున్నారు. ఫలితంగా కాలేజీలు అంటే చదువు కన్నా బయట వ్యవహారాలే ఎక్కువగా విద్యార్థులకు ఉంటున్నాయి. ఇలాంటి వాటిపై వారి దృష్టి తగ్గేలా మరింత సీరియస్ గా అకడమిక్ వ్యవహారాలపై వారి కాన్సన్ ట్రేషన్ ఉండేలా చేయగలగాలి. ఎప్పటికప్పుడు జీవితంపై ఒక నిశ్చితాభిప్రాయం ఏర్పాటు చేసుకునేలా యువతకు ప్రత్యేకమైన ఆసక్తికరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. సమాజానికి మీరెంత ముఖ్యమో వారికి వివరించాలి. బాధ్యత తెలిసేలా చేయగలిగాలి. లేకపోతే యువత దారి తప్పుతుంది. యువత దారి తప్పితే అది భావి భవిష్యత్ భారతానికి మచ్చలా మారిపోతుంది. అందుకే ఇలాంటి వాటిని ఇంతటితో ఆపేలా సమాజం మొత్తం చొరవ తీసుకోవాల్సి ఉంది.