తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు సినీ నటుడు నందమూరి తారకరామారావు కూతురు పురంధరేశ్వరి మరోసారి పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది.
ఎన్టీయార్ కు గారాల పట్టి అయిన పురంధేశ్వరిని ఎన్టీయార్ బంధువర్గమంతా చిన్నమ్మ అని పిలుస్తారట. ఇంట్లో ఏ నిర్ణయమైనా పురంధేశ్వరే తీసుకునేవారని అంటారు. ఎన్టీయార్ కు కూడా తన పిల్లందరిలో పురంధరేశ్వరి అంటే చాలా ఇష్టమని అంటారు.
ఎన్టీయార్ అంతగా అభిమానించే పురంధరేశ్వరి 1994లో తెలుగుదేశం పార్టీలో చోటు చేసుకున్న వెన్నుపోటు ఘటనలో చంద్రబాబు నాయుడికి మద్దతుగా నిలిచారు పురంధేశ్వరి దంపతులు. దగ్గుబాటి వెంకటేశ్వరావు పురంధరేశ్వరిలను కూడా తన ట్రాప్ లో వేసుకున్న చంద్రబాబు నాయుడు మొత్తం ఎన్టీయార్ కుటుంబ సభ్యులనందరినీ బుట్టలో వేసుకోడానికి లక్ష్మీపార్వతిని బూచిగా చూపించారు.
బాబు మాటలు నమ్మేసి ఎన్టీయార్ ను గద్దె దింపడంలో చంద్రబాబుకు సహకరించిన దగ్గుబాటి దంపతులు ఆ తర్వాత పశ్చాత్తాప పడ్డారు. వెంకటేశ్వరరావు కొంతకాలానికే తిరిగి ఎన్టీయార్ దగ్గరకు వెళ్లిపోయారు.
ఆ తర్వాత చంద్రబాబు నాయుడి దుర్మార్గాల గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఓ పుస్తకం కూడా రాశారు.
సరే దాన్ని పక్కన పెడితే ఎన్టీయార్ మరణానంతరం వెంకటేశ్వర్రావు బిజెపిలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. ఈ మధ్యనే దగ్గుబాటి వెంకటేశ్వరరావు నేటి రాజకీయాల్లో తాను ఇమడలేనని చెప్పి రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. తనతో పాటు తన కుమారుడు హితైషి చెంచురామ్ కూడా రాజకీయాలకు వీడ్కోలు పలికినట్లే అని వెంకటేశ్వరరావు ప్రకటించారు. అయితే తన సతీమణి పురంధరేశ్వరి రాజకీయ ప్రస్థానం గురించి మాత్రం ఆయన ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. ఎన్టీయార్ మరణానంతరం దగ్గుబాటి పురంధరేశ్వరి నాటి కాంగ్రెస్ అగ్రనేత వై.ఎస్.ఆర్. పిలుపు మేరకు కాంగ్రెస్ లో చేరారు. 2004 ఎన్నికల్లో బాపట్ల లోక్ సభ నియోజక వర్గం నుండి టిడిపి అభ్యర్ధి సినీ నిర్మాత డి.రామానాయుడిపై పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచి ఎంపీ అయ్యారు. అంతే కాదు వై.ఎస్.ఆర్. ప్రోత్సాహంతో కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్నారు.
అయిదు భాషల్లో అనర్గళంగా మాట్లాడగల పురంధరేశ్వరి సమర్ధవంతమైన నాయకురాలిగానూ సత్తా చాటుకున్నారు. అందుకే మన్మోహన్ సింగ్ కేబినెట్ లో చురుగ్గా వ్యవహరించారు. ఆమె వాగ్ధాటికి మెచ్చి ఆమెను దక్షిణాది సుష్మాస్వరాజ్ అని పిలిచేవారు. 2009 ఎన్నికల్లోనూ ఆమె కాంగ్రెస్ తరపున విశాఖ నుండి పోటీ చేసి గెలిచి రెండో సారి ఎంపీ అయ్యారు. ఆ సారి కూడా కేంద్ర మంత్రి వర్గంలో ఆమెకు చోటు లభించింది. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ఆమె కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి బిజెపిలో చేరారు. 2014 ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తు పెట్టుకున్నాయి. పొత్తుల్లో భాగంగా రాజంపేట లోక్ సభ నియోజకవర్గాన్ని బిజెపికి కేటాయించారు చంద్రబాబు నాయుడు. పురంధరేశ్వరిని వ్యతిరేకించే చంద్రబాబు నాయుడు కుట్ర కారణంగానే ఆ ఎన్నికల్లో రాజంపేటలో పురంధరేశ్వరి ఓటమి చెందారని అంటారు. టిడిపి ఓట్లు పురంధరేశ్వరికి బదలీ కాకుండా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేశారని అందుకే ఆమె ఓటమి చెందారని పురంధరేశ్వరి అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఆ ఎన్నికల తర్వాత ఆమెకు బిజెపి మహిళా మోర్ఛా లో పురంధరేశ్వరికి కీలక పదవి అప్పగించారు.
అయితే 2019 ఎన్నికల తర్వాత ఏపీలో బిజెపి మరింత బలహీన పడ్డంతో ఆమె ఆ పార్టీలో నామమాత్రంగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.
ఇటీవల దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు గుడ్ బై చెప్పినపుడు మీరూ మీ అబ్బాయి రాజకీయాలకు దూరంగా ఉంటే ఉండండి కానీ పురంధరేశ్వరి అక్కని రాజకీయాల్లోనే ఉంచండి అని జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఓ సందర్బంలో పురంధరేశ్వరితోనూ జగన్ మోహన్ రెడ్డి ఇదే చెప్పారట. మీరు మా పార్టీలోకి రండి అక్కా అని ఆప్యాయంగా పిలిచేసరికి పురంధరేశ్వరి కూడా భవిష్యత్ లో ఆ దిశగా ఆలోచిస్తాను లెండి అని చెప్పి ఊరుకున్నారట.
కేంద్ర మంత్రిగా ఎంతో సమర్ధవంతంగా వ్యవహరించిన పురంధేశ్వరి వంటి నాయకురాలు తమ పార్టీలో ఉంటే బాగుంటుందని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు చెబుతున్నారు. పురంధరేశ్వరి వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరితే 2024 ఎన్నికల్లో పురంధరేశ్వరికి విశాఖ పార్లమెంటు నియోజక వర్గం సీటు ఇవ్వాలని జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దానికి ఆమె కూడా సుముఖంగానే ఉండచ్చని అంటున్నారు. విశాఖలో ఆమె సామాజిక వర్గం ఓట్లు చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉండడంతో పాటు గతంలో విశాఖ ఎంపీగా వ్యవహరించిన పురంధరేశ్వరి పట్ల విశాఖలో మంచి పేరే ఉందని అంటున్నారు. ఆమె సై అంటే ఆమె విజయం ఖాయమని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.
గతంలో దివంగత వై.ఎస్.రాజశేఖర రెడ్డి పురంధేశ్వరిని రాజకీయంగా ప్రోత్సహించి కేంద్రమంత్రిని చేశారు. ఇపుడు ఆయన తనయుడు ఆమెను ఎంపీని చేసి ఢిల్లీలో కీలక పాత్ర పోషించే అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఆమె బిజెపిలో కొనసాగినా ఏపీ నుండి చట్టసభకు ఎన్నికయ్యే అవకాశాలు దరిదాపుల్లో లేవు. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటేనే కానీ బిజెపి ఏపీలో గెలవగలిగే సీటు ఒక్కటి కూడా లేదు. అటువంటప్పుడు బిజెపిలో కొనసాగడం అనవసరమని ఆమె కూడా భావిస్తున్నారట. తిరిగి కాంగ్రెస్ లో చేరదామంటే అసలు ఏపీలో కాంగ్రెస్ అనేదే లేదు. ఇక టిడిపిలో చేరే అవకాశాలు బొత్తిగా ఉండవు. ఎందుకంటే గత ఎన్నికల్లో తనను పనిగట్టుకుని ఓడించిన చంద్రబాబు నాయుణ్ని ఎప్పటికీ నమ్మలేం అని పురంధేశ్వరి తన వర్గీయులతో అన్నారట.