2024లో కేంద్రంలో అధికారమే లక్ష్యం

By KTV Telugu On 28 February, 2023
image

 

ఛత్తీస్ ఘడ్ రాజధాని రాయ్ పూర్ లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఎనిమిది పదుల వయసు దాటిన మల్లికార్జున ఖర్గే పార్టీ అధ్యక్షుడయ్యిన తర్వాత జరుగుతున్న మొట్ట మొదటి ప్లీనరీ సమావేశాలివి. ఈ ఏడాది దేశంలో 9 రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జరుగుతోన్న కీలక సమావేశాలివి. వచ్చే ఏడాది ఆరంభంలో సాధారణ ఎన్నికలకూ ఇవే సమావేశాల్లో సన్నద్ధం కావలసి ఉంది . 9రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేలా వ్యూహరచన చేసుకోవాలి. దక్షిణాదిలో కర్నాటక తెలంగాణా రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు ఉన్నాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. గట్టిగా ప్రయత్నిస్తే ఈ రెండింటా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఖాయమని ధీమాగా ఉంది. ఇవి కాక రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికలు చాలా కీలకమైనవి. గత ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్సే అధికారంలోకి వచ్చింది. కాకపోతే ఎంపీలో స్వయంకృతాపరాధంతో అధికారాన్ని చేజార్చుకుని బిజెపికి పళ్లెంలో పెట్టి ఇచ్చింది కాంగ్రెస్.

ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో రాజస్థాన్, ఎంపీల్లో మరోసారి పాగా వేయాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ ప్రస్తుత ప్లీనరీ సమావేశాల్లో ఆ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించే అవకాశాలున్నాయి. ఇవి కాక మేఘాలయ, నాగాలాండ్, ఛత్తీస్ ఘడ్, మిజోరం, జమ్ము కశ్మీర్ వంటి చిన్న రాష్ట్రాలకూ ఈ ఏడాదే ఎన్నికలు జరగనున్నాయి.
వీటిలో పార్టీ సత్తా చాటాలి. పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుకోవాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేయాలి. పార్టీ అనుసరించాల్సిన విధానాలకు సంబంధించి ఈ ప్లీనరీలో చర్చించనున్నారు. అదే విధంగా వివిధ అంశాలపై తీర్మానాలను ఆమోదించనున్నారు. పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలంటే పార్టీ ని బలోపేతం చేసుకోవాలి. అందుకోసం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాలి. అది చేయాలంటే పార్టీ విజయాల బాట పట్టాలి. యువతకు పెద్ద పీట వేయడం ద్వారా పార్టీకి యంగ్ లుక్ తీసుకురావాలి. పార్టీ ప్రక్షాళనకు సంబంధించి ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కొద్ది వారాల క్రితం సోనియా గాంధీకి ఓ నివేదిక సమర్పించారు. అందులో చాలా సిఫారసులు,సూచనలు ఉన్నాయి. వాటిలో ఇబ్బంది లేదనుకున్న సిఫారసులను యథాతథంగా అమలు చేయాలని భావిస్తున్నారు.

వాటికి ఈ ప్లీనరీలోనే ఆమోద ముద్ర వేయనున్నారు. కీలక నిర్ణయాలను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ద్వారానే ప్రకటించాలని నిర్ణయించారు. పార్టీ బతికి బట్టకట్టాలంటే గాంధీలు పదవుల నుండి తప్పుకోవాలంటూ గతంలో జీ-23 నేతలు డిమాండ్ చేసిన నేపథ్యంలోనే గాంధీలు పక్కకు తప్పుకుని మల్లికార్జున ఖర్గేకు పదవిని కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఇపుడు కూడా ఏ కీలక నిర్ణయం తీసుకున్నా దాన్ని ఖర్గే ద్వారానే ప్రకటించి అమలు చేయించాలని సోనియా గాంధీ నిర్ణయించినట్లు చెబుతున్నారు. అంటే నిర్ణయాలు టెన్ జన్ పథ్ లో తయారైనా కూడా వాటిని ఖర్గేనే అందరికీ తెలియచేస్తారన్నమాట. ఇటీవల ముగిసిన రాహుల్ గాంధీ జోడో యాత్రపైనా ప్లీనరీలో చర్చిస్తారు. ఈ యాత్రకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన లభించిన నేపథ్యంలో ఎన్నికల ఏడాదిలో ఈ తరహా కార్యక్రమాలు మరిన్నింటికి రూపకల్పన చేయాలని ఆలోచన చేస్తున్నారు. పార్టీని తిరిగి జనంలోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ప్రజలకు దూరం కావడం వల్లనే వరుసగా రెండు ఎన్నికల్లో ఓడిపోయామని కాంగ్రెస్ బావిస్తోంది. వివిధ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పరాజయాలకు కారణం సరియైన విధానాలు అనుసరించకపోవడమేనని పార్టీ వ్యూహకర్తలు అంటున్నారు. వాటిపై విమర్శనాత్మకంగా చర్చించి కొత్త నిర్ణయాలు తీసుకోనున్నారు.

భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా దేశ వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో యాత్రకు పార్టీ అధినాయకత్వం డిజైన్ చేయడం అది మొదలు కావడం తెలిసిందే. ఆ యాత్రలకు కూడా స్పందన బానే ఉందని పార్టీ నేతలు అంటున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రణాళికలు వ్యూహాలు ఉండాలన్నది లక్ష్యంగా చెబుతున్నారు. 2024 ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే భావసారూప్యత ఉన్న పార్టీల మద్దతు తప్పనిసరి. అందుకే బిజెపియేతర పార్టీల మద్దతు కూడగట్టడంతో పాటు వారిని ఒక్కతాటిపైకి తీసుకువచచేందుకు కాంగ్రెస్సే చొరవ చూపాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నారు. బిజెపిని గట్టిగా వ్యతిరేకిస్తోన్న మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్, కేసీయార్ వంటి నేతలను ఆకర్షించేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని నిర్ణయించారు. బిజెపి వ్యతిరేక పార్టీలతో పాటు కాంగ్రెస్-బిజెపిలకు సమదూరంలో ఉన్న తటస్థ పార్టీలపైనా దృష్టి సారించాలని అనుకుంటున్నారు. చిన్న పార్టీ పెద్ద పార్టీ అన్న తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలకూ సమాన గౌరవం ఇచ్చి వారితో జట్టు కట్టేందుకు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలని నిశ్చయించారు.

గతంలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ప్రస్తుతం కాంగ్రెస్ కు దూరంగా ఉన్న సమాజ్ వాది ఆర్జేడీ, జేడీయూ పార్టీ నేతలతో సమాలోచనలు చేసి ఎన్నికల సమయానికి కొత్త ఊపు తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ అంశాలన్నీ కూడా ప్రస్తుత ప్లీనరీలో చర్చకు రానున్నాయి. వీటిపై పార్టీ పరంగా కీలక నిర్ణయాలనూ ప్రకటించే అవకాశాలున్నాయి 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తన రాజకీయ జీవితంలోనే ఎన్నడూ లేనంతగా చావు దెబ్బతినేసింది. కేవలం 44 స్థానాలకు మాత్రమే పరిమితమై దేశ చరిత్రలోనే అత్యంత దయనీయమైన స్థితికి దిగజారింది కాంగ్రెస్ పార్టీ. ఆ ఫలితాలు కాంగ్రెస్ శ్రేణులను తీవ్ర నిరాశలో ముంచెత్తాయి. పార్టీ నాయకత్వం నోట మాట లేదు. నాయకుల మొహం పై కత్తివాటుకు నెత్తుటిచుక్కలేదు. గాంధీల సారధ్యంలో కాంగ్రెస్ అంత అధ్వాన్నమైన ఫలితాలను అంతకు ముందెన్నడూ చవిచూడలేదు. అయిదేళ్ల పాటు భారంగా గడుపుకొచ్చారు. అంతలో 2019 ఎన్నికలు తరుముకు వచ్చాయి. 2014లో ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని కాంగ్రెస్ నాయకత్వం అనుకుంది. దూరమైన అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చని ఆశపడింది. అయితే మరోసారి భంగపాటు తప్పలేదు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చతికిల పడిపోయింది. ఈ సారి 52 స్థానాలకు పరిమితం అయ్యింది కాంగ్రెస్. వచ్చే 2024 ఎన్నికల్లోనూ ఓడితే కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. అందుకే వచ్చే ఎన్నికలు కాంగ్రెస్ కు అత్యంత కీలకం.