పవిత్రమైన వైద్యవృత్తితో పదిమందికీ సేవచేయాలనుకుంది. పీజీతో తాను కోరుకున్న వృత్తిలోకి అడుగుపెట్టాలనుకుంది. ఆ గిరిజనబిడ్డ లక్ష్యాన్ని కొందరి అహం ఛిద్రంచేసింది. సీనియర్ల వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ధరావత్ ప్రీతి చివరికి ప్రాణాలు విడిచింది. కట్టెపాన్పుమీద కాలి బూడిదైంది. తండ్రి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ. కూతురి కలలు నెరవేర్చడానికి ఆ కుటుంబం ఎన్నో కష్టాలు పడింది. గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది ప్రీతి. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మూడు నెలలక్రితమే అనస్తీషియా పీజీ కోర్సులో చేరింది. అక్కడి సీనియర్ల అహం ఆమెకు మరణశాసనం రాసింది.
పీజీ కోర్సులో భాగంగా ప్రీతి ఎంజీఎం ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్లో సీనియర్లతో కలిసి విధులు నిర్వర్తించాలి. ఆ సీనియర్లలో పొగరు తలకెక్కిన సైఫ్ వేధింపులకు పాల్పడ్డాడు. అవి శృతిమించటంతో ప్రీతి కుటుంబసభ్యులకు చెప్పుకుంది. సైఫ్ వేధింపులపై ప్రీతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసేదాకా వెళ్లింది. పోలీసులు కేఎంసీ ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అనస్తీషియా డిపార్ట్మెంట్ హెడ్ ఫిబ్రవరి 21న ప్రీతికి, సైఫ్‌కు కౌన్సెలింగ్ నిర్వహించారు. తర్వాత నైట్‌డ్యూటీలో అస్వస్థతకు గురైంది ప్రీతి. అపస్మారక స్థితిలో పడున్న ప్రీతికి హార్ట్ ఎటాక్ వచ్చిందని భావించారు. ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు.
పరిస్థితి విషమించటంతో ప్రీతిని నిమ్స్‌కి తరలించాక ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని తేలింది. ఐదురోజులు వెంటిలేటర్మీదే ఉన్న ప్రీతి మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌తో చివరికి కన్నుమూసింది. మరణానికి ముందు తల్లితో ఫోన్లో సీనియర్ల వేధింపుల గురించి ప్రీతి చెప్పుకుంది. ఇప్పుడా ఆడియో కలకలం రేపుతోంది. కుటుంసభ్యులు, గిరిజన సంఘాలు నిరసనకు దిగటంతో ప్రీతి అంత్యక్రియదాకా ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. వేధింపుల విషయంలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కున్న సైఫ్‌ని అరెస్ట్‌చేసినా కారకులైన అందరిమీదా చర్యలు తీసుకోవాలని కుటుంబం డిమాండ్చేస్తోంది. ఆత్మహత్యకాదు హత్యని అనుమానిస్తున్నారు ప్రీతి కుటుంబసభ్యులు. ప్రీతి ప్రాణాలు తీసుకునేంత పిరికిది కాదంటున్నారు. సైఫ్ పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి ఉంటాడని ప్రీతి తండ్రి సంచలన ఆరోపణలు చేస్తున్నారు.
వరంగల్ కేఎంసీ మెడికో ప్రీతి ఆత్మహత్య దేశమంతా చర్చనీయాంశమైంది. మెడికోల ఆత్మహత్యలపై జాతీయ వైద్య మండలి ఓ నివేదిక విడుదల చేసింది. ఇండియాలో ఐదేళ్ల కాలంలో 119 మంది మెడికోలు ఆత్మహత్య చేసుకున్నారని జాతీయ వైద్య మండలి ప్రకటించింది. అందులో 64 మంది యూజీలు ఉంటే, 55 మంది పీజీ విద్యార్థులు. అంతేకాదు దేశవ్యాప్తంగా ఐదేళ్లలో 1,166 మంది విద్యార్థులు మెడిసిన్ నుంచి తప్పుకున్నారు. యూజీలో 160 మంది, పీజీ జనరల్ సర్జరీలో 114 మంది, ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 50 మంది, గైనకాలజీలో 103, ఎంఎస్ ఈఎన్టీలో 100, ఎండీ జనరల్ మెడిసిన్‌లో 56, ఎండీ పిడియాట్రిక్స్‌లో 54, ఇతర బ్రాంచ్‌లన్నింటిలో కలపి 529 మంది మధ్యలోనే వైద్యవిద్యని వదిలేశారు. అన్ని చావులవెనుక వైద్యవిద్యను వదిలేయడం వెనుక వేధింపులు ఉన్నాయని చెప్పలేంకానీ కచ్చితంగా అందులో సగమైనా అలాంటి కారణాలే ఉండుంటాయ్. అహానికి ఆత్మాభిమానానికి మధ్య ఆ ప్రాణాలు నలిగిపోయుంటాయ్.