నగరిలో రోజాకి షాక్… మంత్రి పాఠాలు నేర్చుకోవడంలేదా..?

By KTV Telugu On 8 August, 2022
image

ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు…ప్రజలు ఊహించని షాకులిస్తున్నారు. నాడు-నేడు పేరుతో పాఠశాలల రూపురేఖలు మారుస్తోంది వైసీపీ సర్కార్. అయితే బడుల విలీనంపై ప్రజలు భగ్గుమంటున్నారు. పర్యాటక మంత్రి, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు…పాఠశాలల విలీనంపై సొంత నియోజకవర్గంలోనే నిరసన సెగలు తాకుతున్నాయ్. ఎక్కడికక్కడ ప్రజలు నిలదీస్తుండటంతో…అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి….అధికారంలోకి వచ్చిన తర్వాత బడుల రూపురేఖలు మార్చడంపై ఫోకస్ పెట్టారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి…పాఠశాలలను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దుతున్నారు. గత ప్రభుత్వాల కంటే భిన్నంగా…భవనాల నిర్మాణంతో పాటు వసతి సౌకర్యాలపై ఫోకస్ పెట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదవే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఇదంతా నాణేనికి ఒకెత్తు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల విలీనం, మూసివేతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన బాట పడుతున్నారు. తమ పాఠశాలను విలీనం చేయవద్దంటూ నినదిస్తున్నారు.

పర్యాటక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజాకు…నియోజకవర్గ ప్రజల నుంచి నిరసన సెగలు తప్పడం లేదు. పేదలకు విద్యను దూరం చేస్తారా అంటూ మంత్రి రోజాను అడ్డుకుంటున్నారు. ఒక్క నగరి నియోజకవర్గంలోనే 18 స్కూళ్లు… విలీనం దెబ్బకు మూతపడుతున్నాయ్. దీనిపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు…ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి ఆర్కే రోజా ఎక్కడికెళ్ళినా…పాఠశాలల మూసివేతపైనే ప్రశ్నిస్తున్నారు. ఉన్న బడులను మూసేసి…సుదూరు ప్రాంతాలకు వెళ్లి చదువుకోవాలంటే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బడుల మూసివేత, విలీనంపై ప్రజలకు సమాధానం చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు మంత్రి రోజా.

యుటీఎఫ్…శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి చిత్తూరు జిల్లా నగరి వరకు…యాత్ర చేపట్టింది. నగరంలో నియోజకవర్గంలో యూటీఎఫ్ నేతలు…విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో స్కూళ్లు మూసివేతపై మాట్లాడారు. నాలుగు దశాబ్దాలుగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను…ప్రస్తుతం ఉన్న చోటే కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయ్. ఒకవైపు నాడు-నేడు కింద పాఠశాలల డెవలప్‌మెంట్‌ చేస్తూ….మరోవైపు విలీనం చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. పిల్లలు, పేరెంట్స్‌ బాధలను అర్ధంచేసుకుని విలీన ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.