ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల హడావుడి ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ మళ్లీ కమలం విరబూస్తోందని చెబుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్‌గా భావించే అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటివరకు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్‌లో అసెంబ్లీ ఎన్నికల సమరం జరిగింది. ఈ మూడింట రెండింటిలో బీజేపీదే మళ్లీ అధికారమని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని అంచనా వేయగా మేఘాలయ రాష్ట్రంలో మాత్రం బీజేపీకి చుక్కెదురు అయ్యే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది.
ప్రతీ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ స్థానంలో ఉన్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో అధికారం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 31. నాగాలాండ్ రాష్ట్రంలో మొత్తం 60 అసెంబ్లీ సీట్లలకు గానూ ఎన్డీపీపీ+బీజేపీ 35-43 సీట్లను గెలుచుకుంటుందని కాంగ్రెస్ 1-3, ఎన్పీఎఫ్ 2-5 సీట్లను గెలుచుకునే అవకాశం ఉందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా సర్వే ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. త్రిపురలో లో ఎన్డీపీపీ+బీజేపీ కూటమి 60 అసెంబ్లీ సీట్లకు గానూ 36-45 అసెంబ్లీ నియోజకవర్గాలను గెలుచుకుంటుందని లెఫ్ట్ పార్టీ 6-11 స్థానాలకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ ఒక్కస్థానంలో కూడా గెలుచుకోదని జీ న్యూస్ ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
మేఘాలయాలో మాత్రం బీజేపీకి మెజారిటీ సీట్లు రావని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. మేఘాలయాలో 60 స్థానాల్లో ఎన్పీపీ 18-24 గెలుచుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ 6-12, బీజేపీ 4-8 స్థానాల్లో గెలుపొందుతాయని ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. అయితే జీ న్యూస్-మాట్రిజ్ మాత్రం ఎన్పీపీ 21-26, బీజేపీ 6-11, కాంగ్రెస్ 3-6 స్థానాలు గెలుపొందుతుందని అంచనా వేసింది.