అసెంబ్లీ ఎన్నికల వేళ బీజేపీ వ్యూహాత్మక నిర్ణయం

By KTV Telugu On 1 March, 2023
image

ప్రజా సంగ్రామ యాత్రతో జనంలో మమేకమైన టీ.బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు అధిష్టానం మద్దతు కూడా ఉంది. అందుకే ఎవరేమన్నా ఆయన ధైర్యంగా ఉంటారన్న టాక్ నడుస్తోంది. తెలంగాణ ఎన్నికల వేళ టీబీజేపీ అధ్యక్షుడి మార్పు వ్యవహారం చర్చనీయాంశమైనప్పటికీ అందరి నోట సంజయ్ మాటే వినిపిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్‌ను మార్చుతారన్న ప్రచారం కొంతకాలంగా జరుగుతోంది. అయితే ఆ ఊహాగానాలకు బీజేపీ ఇన్‌చార్జ్ తరుణ్ చుగ్ తెర దించేశారు. ఎన్నికల ఏడాది కావడంతో మార్పు మంచిది కాదన్న అభిప్రాయానికి బీజేపీ వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తోన్న బీజేపీ వచ్చే ఎన్నికలను బండి నాయకత్వంలోనే ఎదుర్కోవాలని నిర్ణయించినట్లు ఆ పార్టీలో టాక్‌ వినిపిస్తోంది. అధ్యక్షుడి కొనసాగింపు అంశంపై అధిష్టానం త్వరలోనే క్లారిటీ ఇవ్వనుండగా తరుణ్ చుగ్ మాత్రం అనధికారికంగా ప్రకటించేశారు.

వాస్తవానికి బీజేపీలో అధ్యక్షుడి కాలపరిమితి మూడేళ్లు.‌ అది పూర్తైన తర్వాత రెండోసారి కూడా కొనసాగే అవకాశం ఉంటుంది. బండి సంజయ్ బాధ్యతలు చేపట్టి మార్చి 11తో మూడేళ్లు పూర్తవుతుంది ఆయనకంటే ముందు అధ్యక్షుడిగా పనిచేసిన లక్ష్మణ్ మూడేళ్ళు ఆ పదవిలో ఉన్నారు. అంతకుముందు కిషన్‌రెడ్డి రెండు సార్లు అధ్యక్షుడిగా పనిచేశారు. అయితే ప్రస్తుతం బండి టర్మ్‌ పూర్తి కానుండగా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మార్చితే ఇబ్బందులు తప్పవని అధిష్టానం భావిస్తోంది. దానితో 2024 వరకు సంజయే కొనసాగుతారని తరుణ్ చుగ్ కామెంట్స్‌ చేయడంతో బీజేపీ క్యాడర్‌లో జోష్ నెలకొంది. బండి నాయకత్వంలో ఎన్నికలకు వెళ్తేనే బీజేపీకి మంచిదన్న అభిప్రాయం క్యాడర్‌లోనూ ఉంది. పాతాళంలో ఉన్న పార్టీని బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ స్థాయికి తీసుకొచ్చిన సంజయ్ తోనే గెలుపు ఈజీ అవుతుందని బీజేపీలోని మెజారిటీ నేతలు చెప్పుకొస్తున్నారు.

రెండో సారి అధ్యక్ష పదవిని కట్టబెట్టినా సంజయ్ కు అంత వీజీ కాదన్న చర్చ మొదలైంది. సమస్యల సుడిగుండం నుంచి ఆయన ఈదుకుంటూ బయటకు రావాల్సి ఉంటుంది. బండితో పాటు ఆయన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఒకవైపు పార్టీ సీనియర్లు మరోవైపు అన్నట్లుగా రాజకీయం సాగుతోంది. ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి వివేక్ లాంటి నేతలు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితోపాటు ఇతర సీనియర్ల నుంచి బండికి ఎలాంటి సహకారం అందడం లేదన్న ప్రస్తావన చాలా రోజులుగా వినిపిస్తోంది. ఒకవేళ సీనియర్లు సహకరించకపోతే రేవంత్‌రెడ్డి మాదిరిగా బండి కూడా ఒంటరి పోరాటం చేయాల్సి ఉంటుంది. అయితే మోదీ అమిత్ షా ఆశీస్సులు పుష్కలంగా ఉండడం సంజయ్ కు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడల్లా సంజయ్ ను ఒకటికి రెండు సార్లు భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు.

సంజయ్ పై అధిష్టానం విశ్వాసం పెంచుకోవడానికి అనేక కారణాలున్నాయ్. పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమైన బీజేపీని గ్రామీణ ప్రాంతాల్లోకి తీసుకెళ్లడంలో బండి సంజయ్‌ సక్సెస్ అయ్యారు. గతంలో ఎన్నడూ లేని సంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చి పాదయాత్రతో బీజేపీలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు.‌ పార్టీని బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేలా చేశారు. ఆయా పరిణామాలన్నీ రెండోసారి అధ్యక్షుడిగా కొనసాగించేలా చేస్తున్నాయి. నాయకత్వం బలోపేతం కావడంతో పాటు నాయకులు ధైర్యంగా జనంలోకి వెళ్లేందుకు బండి దూకుడు ఉపయోగపడిందనే చెప్పాలి. అందుకే అధ్యక్ష పదవికి ఈటల లాంటి నేతలు ప్రయత్నించినా బండ్ సంజయ్ నే కొనసాగించాలని నిర్ణయించినట్లు భావిస్తున్నారు.

రెండో సారి సంజయ్ ను కొనసాగించబోతున్నట్లు అధికారికంగా సమాచారం ఇక సీన్ వేరుగా ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దూకుడు పెంచడంతో పాటు మరో సారి ప్రజా సంగ్రామ యాత్ర చేసే అవకాశం ఉంది. ఆ పని మార్చ్ రెండో వారం తర్వాత ఎప్పుడైనా జరగొచ్చు. సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టి ఎన్నికల నాటికి ఆయన కొత్త టీమ్ ను ఏర్పాటు చేసుకునే వీలుంటుంది. మరి ఆ అవకాశం ఎవరెవరికి వస్తుందో చూడాలి.