అసెంబ్లీ ఎన్నికలకు 9 నెలల సమయం ఉన్నా తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలూ కూడా రేపో మాపో ఎన్నికలన్నట్లు రాష్ట్రాన్ని చుట్టేస్తున్నాయి. జనంతో మమేకం అవుతూ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుని హల్ చల్ చేస్తున్నాయి. తమని గానీ ఒక్కసారి గానీ గెలిపించారా మీ ఇంటినే స్వర్గం చేసేస్తాం అని వరాలు గుప్పించేస్తున్నాయి. రాజకీయ పార్టీల ఆరాటం చూసి జనం కూడా నవ్వుకుంటున్నారు.
తెలంగాణాలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. దానికి చాలా సమయం ఉంది. అయినా సరే ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ఎన్నికల నగారా మోగేసినట్లు చెప్పులో కాలు తీయకుండా తెగ తిరిగేస్తున్నాయి. పాలక పక్షమైన భారత రాష్ట్ర సమితి ఇతర రాష్ట్రాల్లో హడావిడి చేస్తూనే తెలంగాణాలో కలియతిరిగేస్తోంది. అన్ని వర్గాల ప్రజలనూ ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కేసీయార్ నాయకత్వంలోనే తెలంగాణాకు బంగారు భవిష్యత్తు ఉంటుందని నమ్మబలుకుతోంది. బిజెపి, కాంగ్రెస్ లను నమ్మి చెడిపోవద్దని నూరి పోస్తోంది. తెలంగాణాలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కొత్త ఇన్ ఛార్జ్ వచ్చింది లగాయితూ గేర్ మార్చేసింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర హిట్ కావడంతో దానికి కొనసాగింపుగా పార్టీని ప్రజల్లో ఉంచేందుకు హాత్ సే హాత్ జోడో యాత్రకు శ్రీకారం చుట్టింది. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీయార్ కుటుంబమంతా అవినీతి మయం అని నిప్పులు చెరుగుతోన్న రేవంత్ రెడ్డి కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపైనా విరుచుకు పడుతూ ముందుకు సాగుతున్నారు. తెలంగాణాకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ కు అధికారం ఇవ్వాలని ఆయన చెప్పుకొస్తున్నారు.
ఇక భారతీయ జనతా పార్టీ కూడా దూకుడుమీదే ఉంది. పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రతో పాటు వాక్చాతుర్యంతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు తోడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణాలో అంది వచ్చిన ప్రతీ వేదికైనా కేసీయార్ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ ద్వయం తెలంగాణాపై ప్రత్యేక దృష్టి సారించింది. స్ట్రీట్ కార్న్ మీటింగ్ స్ తో కమలనాథులు దూసుకుపోతున్నారు. జనంతో మమేకం అవుతూ తమ వాణిని బానే వినిపిస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్, బి.ఆర్.ఎస్. లను గెలిపిస్తే రాష్ట్రం దివాళా తీయడం ఖాయమని బిజెపి అంటోంది. అవినీతి మయమైన బి.ఆర్.ఎస్. ను పక్కన పెట్టాలని పిలుపు నిస్తోంది. బిజెపిని గెలిపిస్తే కేంద్రంలోని బిజెపితో కలిసి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుందని అది తెలంగాణాకు మంచి రోజులు తెస్తుందని కమలనాథులు ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఎక్కడ లోపం జరిగిందో ఆరా తీస్తోన్న బిజెపి వచ్చే ఎన్నికల్లో అటువంటి పొరపాట్లు పునరావృతం కాకుండా జాగ్రత్తలు పడాలని పార్టీ శ్రేణులకు నూరిపోస్తోంది.
కమ్యూనిస్టు పార్టీలు ఎవరితో పొత్తు పెట్టుకోవాలో తేల్చుకోలేకుండా ఉన్నాయి. నిజానికి కమ్యూనిస్టు పార్టీలకు అంతో ఇంతో బలం ఉన్న ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ కు బలం ఉంది. అక్కడి బి.ఆర్.ఎస్. కు ఏ మాత్రం పట్టు లేదు. కానీ కమ్యూనిస్టు పార్టీలు బి.ఆర్.ఎస్. తో పొత్తు కోసమే వెంపర్లాడుతున్నాయి. ఈ పొత్తులను ఆశించే మునుగోడు ఉప ఎన్నికల్లో బి.ఆర్.ఎస్. కు కమ్యూనిస్టులు బేషరతుగా మద్దతు పలికారు. అయితే ఎన్నికలు ముగిశాక అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టలకు సీట్లు కేటాయించడానికి కేసీయార్ విముఖంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కావాలంటే కమ్యూనిస్టులకు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయిస్తామని అసెంబ్లీ ఎన్నికల్లోవారు పూర్తిగా మద్దతు ఇవ్వాలని కేసీయార్ చెప్పినట్లు అంటున్నారు. బి.ఆర్.ఎస్. ఒక్క సీటు కూడా ఇవ్వకపోతే అపుడు కాంగ్రెస్ తో పొత్తు కు ప్రయత్నించాలని కమ్యూనిస్టులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
కమ్యూనిస్టులను చిన్న చూపు చూసేవారు భారీ మూల్యం చెల్లించక తప్పదని కామ్రేడ్లు అంటున్నారు. తమకి బలం లేదనుకునేవారు రేపటి ఎన్నికల్లో విడిగా పోటీ చేస్తే తమ సత్తా చూపిస్తామని వారంటున్నారు. బి.ఆర్.ఎస్-బిజెపిల మధ్య ఎమ్మెల్యేల కొనుగోలు కేసు వివాదం కొనసాగుతోంది. అదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేసీయార్ తనయ కవిత పేరు ఉంది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా అరెస్ట్ నేపథ్యంలో ఏ తరుణంలో అయినా కవితను కూడా అరెస్ట్ చేస్తారేమోనని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలోని బిజెపి విధానాలను తప్పు బడుతున్నాం కాబట్టే తమపై కక్షసాధింపుగా కేసులు బనాయించి వేధించాలని చూస్తున్నారని ఇప్పటికే బి.ఆర్.ఎస్. నాయకత్వం ఆరోపించింది. ఇవన్నీ కూడా ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావం చూపుతాయని రాజకీయ పండితులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఎన్నికలకు ఇంకా ఎనిమిది నెలలకు పైగా సమయం ఉంది కాబట్టి ఆ లోపు సమీకరణలు ఎలాగైనా మారే అవకాశాలున్నాయని వారు అంటున్నారు.