ఏపీ సీఎం జగన్ దూకుడు పెంచుతున్నారు. ఓ వైపు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూనే మరోవైపు ప్రత్యర్థులను ప్రజల్లో వీక్ చేసే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. తెనాలిలో రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా టీడీపీ జనసేనలకు ఓ సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175 గెలిచి తీరుతానంటోన్న జగన్ అసలు 175 నియోజకవర్గాల్లో పోటీ చేసే ధైర్యం బాబు పవన్‌లకు ఉందా అంటూ ఛాలెంజ్ చేశారు. తనకు ఆ ధైర్యం ఉందని అన్నారు. టీడీపీ జనసేనల మధ్య పొత్తు ఖాయనుకుంటున్న తరుణంలో 175 టార్గెట్‌గా సవాళ్లు విసురుతున్నారు జగన్. రైతులకు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరిస్తూ మంచి చేస్తున్నాం గనుక ఆశీర్వదించండని అభ్యర్థిస్తూనే గత ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపుతున్నారు. ఒక్క మాటతో అటు ప్రజల మనసు గెలుచుకోవడంతో తన వ్యతిరేకులపై ప్రజల్లో యాంటీ ముద్ర పడేలా చూస్తున్నారు.
చంద్రబాబు వస్తే మళ్లీ కరువు వచ్చినట్లేననే రేంజ్‌లో జగన్ విమర్శలు గుప్పించారు. కరువుకు కేరాఫ్ అయిన బాబు తన పాలనలో కరువు మండలాలను ప్రకటించేవారన్నారు. కానీ తాము అధికారంలో ఉన్న ఈనాలుగేళ్లలో ఏనాడైనా ఆ పరిస్థితిని చూశామా అంటూ ప్రజల ముందు గత ప్రస్తుత ప్రభుత్వాల మధ్య పోలికను చూపించారు. తమది పేదల ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని జగన్ కితాబిచ్చుకున్నారు. ఇక బాబు పవన్‌లతో పాటు ఎల్లో మీడియాను లక్ష్యంగా చేసుకొని విమర్శనాస్త్రాలు సంధించారు. దుష్టచతుష్టయం అంతా ఒక్కటై ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తోందని తనకు అండ దండ ప్రజలేనని సెంటిమెంట్ పండించారు. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌లు ప్రజలకు ఎప్పుడూ మేలుచేయలేదన్న జగన్ దోచుకో పంచుకో తినుకో విధానంతో ముందుకెళ్లారని విమర్శలు గుప్పించారు.
రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలనే కసితో టీడీపీ ఉంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనాతో బాబు ముందే ప్రజల్లోకి వెళ్లారు. జిల్లాల పర్యటనలు నియోజకవర్గాల వారీగా సమీక్షలతో బిజీ అవుతున్నారు. మరోవైపు రాష్ట్రమంతా చుట్టేసేందుకు లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు. ఇక నియోజకవర్గాల్లోనూ టీడీపీ నాయకత్వం ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో ప్రజల్లోకి వెళ్తోంది. ప్రజాసమస్యలు తెలుకుంటూ ప్రభుత్వ వ్యతిరేకతను ఎండగడుతున్నారు. ఇక కొద్దిరోజుల్లోనే పవన్ కళ్యాణ్ కూడా బస్సుయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈనేపథ్యంలో టీడీపీ జనసేనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రి జగన్ వ్యూహాలను మార్చుకుంటున్నారు. వైసీపీ నేతలంతా ప్రజల్లోనే ఉండేలా చూసుకుంటున్నారు. అదేసమయంలో తాను కూడా ఏఫ్రిల్ నుంచి జనం బాట పడుతున్నారు. గ్రామాల్లో పల్లెనిద్ర చేసేందుకు రెడీ అవుతున్నారు.