తెలంగాణ బీజేపీ: కటౌట్ కాదు కంటెంట్ ఉన్న క్యాండిడేట్స్ ఏరి

By KTV Telugu On 1 March, 2023
image

బీఫాం ఇస్తానంటే ఎవడైనా పోటీ చేస్తారు. అందులో వింతేమీ లేదు. అన్ని చోట్లా అభ్యర్థుల్ని నిలబెట్టడం కూడా పెద్ద విషయం ఏమీ కాదు. గత ఎన్నికల్లో కేఏ పాల్ పార్టీ ప్రజాశాంతి తరపున కూడా అభ్యర్థుల్ని నిలబెట్టారు. ఇప్పుడు బీజేపీ కూడా అన్ని చోట్లా అభ్యర్థుల్ని నిలబెడతామని చెబుతోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణలో బీజేపీకి అభ్యర్థులు లేరని దుష్ప్రచారం చేస్తున్నారని కానీ తాము అన్ని చోట్లా పోటీ చేస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత ప్రకటించారు. బండి సంజయ్ మాటలు విన్న తర్వాత అసలు తమ పార్టీ సమస్య ఏమిటో బండి సంజయ్ గుర్తించలేదా లేకపోకే గుర్తించనట్లుగా వ్యవహరిస్తున్నారా అన్నది బీజేపీ పెద్దలకు కూడా పెద్దగా అర్థం కాని విషయం.

బీజేపీకి అభ్యర్థులు లేకపోవడం అనేది సమస్య కాదు. బీఫాం ఇస్తే పోటీ చేయడానికి వంద మంది రెడీగా ఉంటారు. కానీ ఇక్కడ బండి సంజయ్ భావిస్తున్నట్లుగా అభ్యర్థులు లేరని ప్రచారం జరగడం లేదు బలమైన అభ్యర్థులు లేరనే చెప్పుకుంటున్నారు. ఈ విషయం ఢిల్లీ బీజేపీ నేతలకూ అర్థమయింది. తెలంగాణ విషయంలో పట్టుదలగా ఉన్న అమిత్ షా ఉన్న పళంగా నేతల్ని పిలిపించి తీసుకున్న క్లాస్ అభ్యర్థుల కోసమేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 20-25 నియోజకవర్గాల్లో మాత్రమే మా పార్టీకి చెప్పుకోదగ్గ నాయకులు ఉన్నారు. మిగిలిన చోట్ల నేతలున్నారు కానీ వారు నియోజకవర్గస్థాయి కాదు. మెజారిటీ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థుల కోసం కమలనాథులు అన్వేషిస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తామే గెలిచి అధికారంలోకి రాబోతున్నామనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తూనే సంస్థాగతంగా బలపడాలన్న పట్టుదలతో ఉన్నారు. పలు ప్రాంతాల్లో బిఆర్ఎస్ ని ఢీకొట్టే గట్టి నాయకత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు.

ఇతర పార్టీల నేతలు వచ్చి చేరిన చోట బలమైన అభ్యర్థులు ఉన్నారు. అయితే అవి చాలా పరిమితంగా ఉన్నాయి. హుజూరాబాద్, మునుగోడు వంటి చోట్ల మాత్రమే ఈ బలం కనిపిస్తోంది. అది కూడా అభ్యర్థుల వల్లే వచ్చింది. ఇక ఇతర నేతలు ఎవరూ పెద్దగా చేరకపోవడంతో నియోజకవర్గాల్లో బలపడిన సందర్భాలు లేవు. ఇంతకు ముందు పార్టీలో చేరిన వారు నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కాదు. పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా పలువురు నేతలు ఎన్నికల్లో పోటీ చేస్తారా చేస్తే గెలుస్తారా అన్నది చెప్పడం కష్టం. మెజార్టీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఇటీవల క్యాడర్ పెరిగింది కానీ లీడర్లు మాత్రం దొరకడం లేదు. అందరూ ఎవరికి వారు తామే లీడర్లం అనుకుంటున్నారు. కానీ వారిలో ఎమ్మెల్యేకు పోటీ చేసేంత పొటెన్షియల్ ఉందని హైకమాండ్ కూడా నమ్మడం లేదు. ఎలా చూసినా బీజేపీ పార్టీని కాకుండా బలమైన అభ్యర్థుల్ని నమ్ముకుని రాజకీయం చేసి వ్యూహాత్మక తప్పిదం చేసిందన్న అభిప్రాయం మాత్రం బీజేపీ ప్రస్తుత పరిస్థితిని చూస్తే అనిపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

సాధారణంగా బీజేపీ ప్రేమిస్తే ఎవరైనా ప్రేమించాల్సిందే. వచ్చి పార్టీలో చేరిపోవాల్సిందే. ఆ పార్టీ అనుకోవాలి కానీ ఎమ్మెల్యేలు అయినా వచ్చి చేరిపోవాలి. అయితే విచిత్రంగా ఈ మంత్రం తెలంగాణలో పని చేయడం లేదు. ఎవరూ చేరడం లేదు. చివరికి బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి ఇక బీజేపీలో చేరడమే తరువాయి అనుకున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా తటపటాయిస్తున్నారు. ఇక పదవుల్లో ఉన్న వారు వచ్చి చేరే చాన్స్ లేదు. మొదట్లో వచ్చిన వారినందర్నీ కాంగ్రెస్ పార్టీ నుంచి చేర్చుకున్నారు. బీఆర్ఎస్ నుంచి ఆకర్షించాలన్న ప్లాన్ పెయిలయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ నుంచి ఎవరూ బయటకు రారు. కోవర్టుల వల్లే చేరికలు లేవని ఈటల రాజేందర్ ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పుడు పూర్తిగా ఆశలు అడుగంటిపోయాయి. చివరి క్షణం వరకూ బలమైన నేతలు రాకపోతే ఇక కాంగ్రెస్, బీఆర్ఎస్‌లలో టిక్కెట్లు రాని నేతల్ని ఆకర్షించి అప్పటికప్పుడు టిక్కెట్లు ఇచ్చి బరిలోకి నిలపడం తప్ప బీజేపీకి మరో ఆప్షన్ ఉండదు. అదే జరిగితే బీజేపీ ఇమేజ్ కే మచ్చ పడుతుంది.

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చురుకుగా ప్రజల్లోకి వెళ్తోంది. రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టిన తర్వాత ఆ పార్టీలో ఐక్యత కనిపిస్తోంది. రేవంత్ పాదయాత్రకు వస్తున్న స్పందనతో సీన్ మారిపోయింది. ఆ పార్టీకి అభ్యర్థుల సమస్య దాదాపుగా లేదు. పొటెన్షియల్ అభ్యర్థులు రేసులో ఉన్నారు. కానీ బీజేపీకి మాత్రమే ఈ సమస్య ఎదురవుతోంది. తాము మాత్రమే బలంగా ఉండాలని తెలంగాణ బీజేపీ అగ్రనాయకత్వం స్వార్థ రాజకీయాలు చేయడమే పార్టీకి మైనస్ అయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.