మొన్నటి వరకు ఏపీ గురించి పట్టించుకోలేదు. 2014కు ఏవేవో హామీలిచ్చిన ఆ పార్టీ…2019 తర్వాత సెలైంట్ అయిపోయింది. మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో…ప్రజలకు దగ్గరయ్యేందుకు కొత్త పల్లవి అందుకుంది. అమరావతికి మద్దతుగా పాదయాత్ర మొదలు పెట్టింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ లో బీజేపీ వ్యవహారశైలిపై అంతటా చర్చ సాగుతోంది.
భారతీయ జనతా పార్టీ…ఉన్నట్టుండి ఆంధ్రప్రదేశ్ పై ఎక్కడా లేని ప్రేమ చూపిస్తోంది. 2019 ఎన్నికల తర్వాత ఏపీని గాలికి వదిలేసింది. జగన్ సర్కార్…ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా…చూసిచూడనట్లు వ్యవహరించింది. కమలనాథులను కలిసి…సమస్యలు విన్నవించుకున్నా తమకేమీ తెలియనట్లు నటించారు. రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ నేతలందరూ…గత ప్రభుత్వమంటూ చంద్రబాబును విమర్శించి వెళ్లారు. ప్రస్తుతం సీన్ రివర్స్ అవుతోంది. ఉన్నట్టుడి బీజేపీ ప్లేటు మార్చేసింది. రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యేలా కార్యక్రమాలకు రూపకల్పన చేస్తోంది. 2019 ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాకపోవడంతో…బీజేపీకి అసలు విషయం తెలుసొచ్చింది. అన్ని విషయాల్లోనూ ఏపీకి ప్రాధాన్యత కల్పించామనేలా…ప్రజలను నమ్మించేందుకు ప్రయత్నిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలుపొంది…మర్యాద నిలబెట్టుకునేందుకు ఇప్పటి నుంచే పాచికలు వేస్తోంది.
తాజాగా పింగళి వెంకయ్య 146వ జయంతిని ఢిల్లీలోని ఇందిరా గాంధీ స్టేడియంలో…కేంద్ర సాంస్కృతిక, పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహించింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను స్మరించుకుందాం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించింది. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య పేరుతో తపాలా బిల్లను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య మనవరాలు సుశీల, వారి కుటుంబ సభ్యులను మంత్రి అమిత్ షా సత్కరించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా నిర్వహించే హర్ ఘర్ తిరంగా పాటను విడుదల చేశారు. పింగళి వెంకయ్య రూపొందించిన మువన్నెల జెండా జెండా…రాజ్యాంగ సభలో ఆమోదం పొందిందంటూ కీర్తించారు. ప్రజల ఐక్యతకు అశోక్ చక్రం నిదర్శనమన్నారు అమిత్ షా.
మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు 125వ జయంతిని పురస్కరించుకొని…జులై 4న భీమవరంలో కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. అల్లూరి కుటుంబ సభ్యులను, వారసులను ప్రధాని మోడీ సత్కరించారు. తెలుగువీర లేవరా.. దీక్షబూని సాగరా అంటూ ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగించారు. అల్లూరి సీతారామారాజుకు సంబంధించిన…అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు. అజాదీగా అమృత్ మహోత్సవంలో భాగంగా…లంబ సింగిలో అల్లూరి మెమోరియల్, గిరిజన మ్యూజియం నిర్మిస్తామన్నారు. ఇలా వరుస కార్యక్రమాలతో ఏపీ ప్రజల్లో విశ్వాసం పొందాలని బీజేపీ అడుగులు వేస్తోంది.
రాజధాని అమరావతికి మద్దతుగా ఏపీ బీజేపీ నేతలు పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రాధ్యక్షుడు సోము వీర్రాజును రాజధాని ప్రాంత రైతులు నిలదీశారు. ముఖ్యంగా రాజధాని అనేది రాష్ట్రాల పరిధిలోకి వస్తుందని కేంద్రం చేసిన ప్రకటనలు కావచ్చు.. వివిధ సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డి వంటి నేతలు చేసిన కామెంట్స్ కావొచ్చు.. స్థానిక రైతులకు ఆగ్రహం కలిగించాయి. ఏపీ ఏకైక రాజధాని అమరావతి అనే నినాదాన్ని బీజేపీ అందుకున్నా.. ప్రజలు మాత్రం ఆ పార్టీపై గుర్రుగా ఉన్నారు. దీన్ని తగ్గించుకోవడంపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. మూడు రాజధానుల ప్రకటన వచ్చాక ఉద్యమించిన ఇక్కడి రైతులు.. బీజేపీపై ఆశలు పెట్టుకున్నారు. టీడీపీ విపక్షానికి పరిమితం కావడంతో బీజేపీనే ఏదైనా చేస్తుందని ఆశించారు. కానీ.. తమ ఆశలకు.. ఆశయాలకు భిన్నంగా కాషాయ పార్టీ ఉందని చాలా గుర్రుగా ఉన్నారు. అదే బీజేపీ పాదయాత్రలో బయట పడిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నా…దగ్గరయ్యే ప్రయత్నాలను మాత్రం బీజేపీ వదిలిపెట్టడం లేదు.