టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మార్చుతూ పార్టీని జాతీయ స్థాయికి తీసుకెళ్లినా తెలంగాణలో మాత్రం వ్యతిరేకత తప్పడం లేదని సీఎం చంద్రశేఖర్ రావుకు అర్థమైపోయింది. అందుకే నాలుగైదు నెలల్లో వచ్చే ఎన్నికల కోసం కొత్త వారిని బరిలోకి దించే సరికొత్త ప్లాన్ కు తెరతీయాలని తీర్మానించారు. అంతర్గతంగా నిర్వహించిన ఐదారు సర్వేల తర్వాత 30 మంది సిట్టింగులు గెలవడం కష్టమేనని కేసీఆర్ తీర్మానించుకున్నారు. అందులో సగం మంది 2018 ఎన్నికల తర్వాత వచ్చి చేరిన వారిగా గుర్తించారు. అందుకే సిట్టింగులందరికీ టికెట్లిస్తామని వేసుకున్న ఒట్టును తీసి గట్టుమీద పెట్టేసి కొత్త వారికి అవకాశం ఇచ్చే ప్రక్రియకు కేసీఆర్ శ్రీకారం చుట్టబోతున్నారు.
సర్వేల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారిలో ఐదారుగురు మినహా పాతిక మందికి మొండిచేయి చూపించాలని బీఆర్ఎస్ అధిష్టానం భావిస్తోంది. అందుకు అనేక కారణాలూ ఉన్నాయి నియోజకవర్గాల్లో వారంతా ఆధిపత్యపోరు, గ్రూపు రాజకీయాలు నడిపారని కేసీఆర్ దృష్టికి వెళ్లింది. అధిష్టానం దిశా నిర్దేశం చేసినట్లుగా కాకుండా సొంత తెలివితేటలు ఉపయోగించారని నిర్ధారించారు. కేసీఆర్, కేటీఆర్ మాటలను వాళ్లు పెద్దగా పట్టించుకోలేదని కూడా వార్తలు వచ్చాయి. అందుకే ఇప్పుడు ఆయా నియోజకవర్గాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చే దిశగా పావులు కదుపుతూ సిట్టింగులను బుజ్జగించే ప్రక్రియ కూడా ప్రారంభమైంది. దీని వల్ల సహజంగా వచ్చే యాంటీ ఇంకంబెన్సీ కూడా తగ్గుతుందని భావిస్తున్నారు.
టికెట్ల కేటాయించే విషయంలో కేసీఆర్ అనేక కోణాల్లో ఆలోచిస్తున్నారు. అందులో పార్టీలో క్రమశిక్షణగా పనిచేసిన వారికి పెద్ద పీట వేస్తారని తెలుస్తోంది. అహర్నిశలు పార్టీ కోసం కేటాయించిన వారికి అవకాశం ఉంటుంది. ఆర్థిక వనరులను పార్టీ కోసం అధికంగా వెచ్చించిన వారి రుణం టికెట్టిచ్చి తీర్చుకుంటారు. కేసీఆర్ కుటుంబానికి అత్యంత సాన్నిహిత్యంగా ఉన్న వారికి ఎమ్మెల్యే టికెట్లు వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఇవన్నీ కలగలిసి ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీల్లో కొందరిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే అవకాశం ఉంది. అందులో కొందరి పేర్లు ఇప్పుడిప్పుడే లీక్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్‌రెడ్డిని ఈ సారి ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నుండి బరిలోకి దింపేందుకు కేసీఆర్ తనయుడు కేటీఆర్ పావులు కదుపుతున్నారు. ఈ సంగతి ఆయన బహిరంగంగానే ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవి తనకు సంతృప్తినివ్వడం లేదని ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని కౌశిక్ రెడ్డి చెప్పడంతో కేసీఆర్ అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దానితో కౌశిక్ ఎక్కువ కాలం హుజురాబాద్ లో తిరుగుతున్నారు. అనధికారికంగా ఆయన ప్రచారం కూడా ప్రారంభించారు. మరో ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డిని కూడా ఎమ్మెల్యేగా బరిలో దించే అవకాశం కనిపిస్తోంది. ఆయన్ను మెదక్ నుండి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మాదేవేందర్‌రెడ్డి సీనియర్ అయినప్పటికీ ఆమె పట్ల నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందని గుర్తించారు. దానితో ఆమెను బుజ్జగించి ఆ స్థానంలో అత్యంత నమ్మకస్తుడైన శేరి సుభాష్‌రెడ్డిని ప్రమోట్ చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇక మరో ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డికి ఈ సారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి జనగామ నుండి బరిలో దించాలని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై అనేక ఆరోపణలు ఉన్నాయి. పలుమార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం వల్ల కొన్ని వర్గాలవారికి తీవ్ర వ్యతిరేకి అయ్యారు. ఈ సారీ ఆయనకే టికెట్ ఇస్తే ఇబ్బంది కలిగే అవకాశముంది. దాంతో ఆయన స్థానంలో కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో మంచి సాన్నిహిత్యం ఉన్న పోచంపల్లిని జనగామ బరిలో దింపి గెలిపించుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. అలాగే ఎమ్మెల్సీ నవీన్‌రావుని కూడా ఈసారి గ్రేటర్ పరిధిలోని ఏదైనా నియోజకవర్గం నుండి పోటీలో పెట్టాలని భావిస్తున్నారు. నవీన్‌రావుకి కూడా కేసీఆర్ ఫ్యామిలీతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు పార్టీ కోసం తొలి నుండి తెరవెనుక ఎంతో హార్ట్ వర్క్ చేశారు. కేసీఆర్ దూతగా అనేక పనులు చక్కదిద్దిన నవీన్‌రావుకి ఈ సారి గ్రేటర్ పరిధిలోని ఏదో ఒక టిక్కెట్ ఇవ్వాలని గులాబీబాస్ భావిస్తున్నారు. ఇలా ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న వారు ఎన్నికల తర్వాత ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసే ఛాన్సు కనిపిస్తోంది.