వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానందస్వామి పేరు చాలామందికి గుర్తుండే ఉంటుంది. ఆమధ్య ఆయన సినీ నటి రంజితతో సన్నిహితంగా ఉన్న వీడియోలు కలకలం సృష్టించాయి. ఆ తరువాత ఆయనపై చాలా ఆరోపణలు వచ్చాయి. అత్యాచారం కేసులో ఆయనపై నాన్ బెయలబుల్ వారంట్ జారీ కావడంతో రాత్రికి రాత్రి జంప్ అయిపోయారు. నేరుగా పోయి కైలాస దేశంలో తేలారు. అంతవరకు ఆ పేరుతో ఒక దేశం ఉన్నట్లు ఎవరికీ తెలియదు. ఎందుకంటే నిత్యానందే ఆ దేశాన్ని ఏర్పాటు చేశారు. ఈక్వెడార్ సమీపంలో ఒక చిన్న ద్వీపాన్ని కొనుక్కున్నారు. దానికే ఆయన కైలాస దేశం అని పేరు పెట్టారు. ఆ దేశానికో జాతీయ పతాకం, పాస్‌పోర్ట్, కరెన్సీ వంటివి సృష్టించుకున్నారు. తమ గురించి బయట ప్రపంచానికి తెలిసేలా ఓ వెబ్‌సైట్ కూడా తయారుచేశారు. ఆ దేశం పేరు ఆ బిల్డప్ చూసి వీడెవడండీ బాబూ అని అందరూ నవ్వుకున్నారు. కానీ తనను లైట్ తీసుకున్నవారందరీకీ జలక్ ఇచ్చాడు నిత్యానంద.
కైలాస దేశానికి చెందిన ఇద్దరు మహిళా ప్రతినిధులు జెనీవాలో ఇటీవల జరిగిన ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీలో పాల్గొన్నారు. హిందుత్వం ఉట్టిపడేలా నుదుటిన పెద్ద బొట్టు, కాశాయ దుస్తులు, విచిత్రమైన తలపాగా, ఆభరణాలను ధరించిన ఒక మహిళ తనను తాను విజయప్రియగా పరిచయం చేసుకున్నారు. కైలాస దేశం నుంచి యూఎన్ సమావేశాలకు శాశ్వత ప్రతినిధిని అని ప్రకటించుకున్నారు. ఆమె తన ప్రసంగంలో తమది హిందువుల కోసం ఏర్పాటైన తొలి సార్వభౌమ దేశం కైలాస దేశమని ఆమె తెలిపారు. ఈ దేశాన్ని ఏర్పాటు చేసిన నిత్యానంద హిందూ సంప్రదాయాలను, నాగరికతను పునరుద్ధరిస్తున్నారని చెప్పారు. నిత్యానందను భారత ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. ఆయనపై అనేక కేసులు నమోదు చేశారని సొంత దేశంలోనే ఆయన బహిష్కరణకు గురయ్యారనేది ఆమె వాదన. మరొక ప్రతినిధి మాట్లాడుతూ తమ గురువు ఎదుర్కొంటున్న ఆరోపణలపై అంతర్జాతీయ సమాజం స్పందించాలని ఆమె మాట్లాడారు.
ఫోటోలో కనిపిస్తున్న విజయప్రియ నిత్యానంద ఎవరనేది ఎవరికీ అంతుబట్టలేదు. దాంతో నెట్‌లో ఆమె గురించి వెతికారు. విజయప్రియ కెనడాలోని మనిటోబా యూనివర్శిటీ నుంచి మైక్రోబయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తి చేశారు. యూనివర్సిటీలో ప్రతిభ చూపినందుకు డీన్ ఆనర్ జాబితాలో ఆమె పేరును చేర్చారు. 2013, 2014 సంవత్సరాల్లో ఆమె ఇంటర్నేషనల్ యూజీ స్టూడెంట్ స్కాలర్ షిప్ ను సాధించారు. ఇంగ్లీష్, ఫ్రెంచ్, క్రియోల్ భాషలను అనర్గళంగా మాట్లాడతారు. ఇండియా నుంచి పారిపోయి సొంతంగా ఒక దేశాన్ని ఏర్పాటు చేసుకున్న తరువాత నిత్యానంద గురించిన సమాచారం బయటకు రావడం లేదు. కొత్తం దేశాన్ని అనౌన్స్ చేసిన కొత్తలో కైలాస దేశాన్ని అధికారికంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితిని కోరారు. ఆ తర్వాత ఆ విషయం ఏమైందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు హఠాత్తుగా ఆ దేశం తరపున ఇద్దరు ప్రతినిధులు యూఎన్ కీలక సమావేశంలో పాల్గొనడం భారత్‌పై ఆరోపణలు చేయడం చర్చనీయాంశం అయింది.